- ఇందుకు గత ఎన్నికల ఫలితాలే నిదర్శనం
- కాంగ్రెస్ గ్రాఫ్ పెంచేందుకు కేసీఆర్ కుట్ర చేస్తుండని ఫైర్
గంగాధర, వెలుగు : ధరణి పోర్టల్‌తో ఎందరి బతుకులనో సీఎం కేసీఆర్ నాశనం చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. తన భూములనే తప్పుగా రికార్డు చేసి, ఆగం చేశారని మండిపడ్డారు. ‘‘ధరణి గురించి మాట్లాడితే సీఎం నన్ను సన్నాసి అంటున్నడు. ఆయనకు 53 ఎకరాల 30 గుంటల భూమి ఉంటే 53 ఎకరాల 31 గుంటల భూమి ఉన్నట్లు ధరణిలో రికార్డయిందంటూ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇది ఎవరి తప్పు? ఇప్పుడు ఎవరు సన్నాసి? నువ్వే పెద్ద సన్నాసివని ఒప్పుకుంటవా? నీదో దిక్కుమాలిన ప్రభుత్వమని నీకు అనిపిస్తలేదా?’’ అంటూ ఫైర్ అయ్యారు. కరీంనగర్ జిల్లా గంగాధరలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశానికి బీజేపీ చొప్పదండి నియోజకవర్గ అభ్యర్థి బొడిగె శోభ, పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌ను ఓడగొట్టేది బీజేపీనే అని, ఇందుకు గత ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పారు. కాంగ్రెస్ గ్రాఫ్ పెంచేందుకు కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని, కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
బీజేపీ గ్రాఫ్‌ను దెబ్బతీసే కుట్ర
‘‘బీజేపీ అధికారంలోకి వస్తే నేనే సీఎం అవుతానని చెప్పను. నాకు ఆ అలవాటు లేదు. ముఖ్యమంత్రిగా ఎవరిని చేయాలనేది ఎన్నికైన ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారు. ఎమ్మెల్యేల అభిప్రాయాల మేరకు బీజేపీ అధిష్టానం సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుంది. నేను సీఎం అవుతానని ఎన్నడూ చెప్పను. సామాన్య కార్యకర్తనైన నాకు ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవులిచ్చి గౌరవించిన పార్టీ బీజేపీ. అధిష్టానం తీసుకునే నిర్ణయమే నాకు శిరోధార్యం” అని సంజయ్ చెప్పారు. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే బీసీ నాయకుడే సీఎం అవుతారని చెప్పారు. చొప్పదండిలో బొడిగె శోభ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన శిలాఫలకాలపై బీఆర్ఎస్ నేతలు పోస్టర్లు వేయడం సిగ్గు చేటని, దమ్ముంటే నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. ‘‘బీజేపీ గ్రాఫ్ దెబ్బతీసేందుకు కాంగ్రెస్ గ్రాఫ్ పెంచే కుట్రకు కేసీఆర్ తెరతీశారు. పొరపాటున బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కొద్ది నెలల్లోనే ఎన్నికలు రావడం ఖాయం. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ సీఎం అవుతారు. ఆయన అహంకారం, బాడీ లాంగ్వేజ్ చూస్తే హరీశ్‌రావు, కవిత, సంతోష్, ఎమ్మెల్యేలెవరూ పార్టీలో ఉండే పరిస్థితి లేదు. అప్పుడు ప్రభుత్వం కూలిపోవడం పక్కా. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం పదవి కోసం లీడర్లంతా కొట్లాడుకుంటారు. రేవంత్, ఉత్తమ్, భట్టి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహా ప్రతి ఒక్కరూ తామే సీఎం కావాలని గోల పెడతారు. సీఎం కుర్చీ కొట్లాటలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది” అని చెప్పారు.
బీజేపీతోనే సుస్థిర పాలన
తెలంగాణలో సుస్థిర పాలన బీజేపీతోనే సాధ్యమని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ఓడిపోతుందని కేసీఆర్‌కు అర్థమైందని, అందుకే ఓడిపోయే స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు డబ్బు సంచులు పంపుతున్నడని ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి గెలిచాక బీఆర్ఎస్లోకి వచ్చేలా, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేలా లోపాయికారి ఒప్పందం చేసుకున్నాడని అన్నారు. అధికారం కోసం సొంత పార్టీ నేతలను కూడా ఓడగొట్టేందుకు కేసీఆర్ వెనుకాడరని మండిపడ్డారు.