పింక్ పోలీసింగ్: నిలదీస్తే నలిపేసుడే

‘తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది. అవసరమైతే కేజీ నుంచి పీజీ దాకా నిర్బంధ విద్యను అమలు చేసేందుకు పోలీసులను వాడుతాం’ అని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక.. పోలీస్ వింగ్‌‌ను రాంగ్ ట్రాక్‌‌లోకి మళ్లించారు. మొత్తం పోలీస్ వింగ్‌‌ను పొలిటికల్ వింగ్‌‌లో మింగిల్ చేసేశారు. తన నియంతృత్వ పోకడలతో పోలీసు వ్యవస్థను అడ్డగోలుగా వాడుకుంటున్నారు. నిరసన అన్న మాట వినిపిస్తే చాలు ప్రజావ్యతిరేకత బయటకు రాకుండా చేయాలని నేతల అరెస్టులు, నిరసనకారులపై లాఠీ చార్జ్‌‌లు రొటీన్‌‌గా మారిపోయాయి. ప్రజాస్వామ్యం ప్రకారం శాంతి భద్రతల రక్షణ చేయాల్సిన ఖాకీలను పూర్తిగా టీఆర్ఎస్ తన పొలిటికల్ అవసరాల కోసం నచ్చినట్టు వాడుకుంటూ ‘పింక్ పోలీస్‌‌’గా మార్చేసింది.

ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే వాళ్లను అణిచేయటం.. ప్రజల ఆందోళనలను అణగదొక్కడం.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టే నిరసనలు, కార్యక్రమాలను కట్టడి చేయటం.. విపక్ష నేతలను హౌస్ అరెస్ట్ చేయటం.. అసలు ధర్నా చౌక్ అనేది లేకుండా చేయటం.. ఇవీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రజల వాయిస్‌‌ను నొక్కేయడానికి ఎంచుకున్న పాలసీల్లో భాగం. ఇవన్నీ ఒకెత్తయితే, మొత్తం పోలీసు డిపార్టుమెంట్ అధికార పార్టీ కనుసన్నల్లో ఉండేలా గతంలో ఎన్నడూ లేని రహస్య ఆదేశాలను ఈ ప్రభుత్వం దొంగచాటుగా అమల్లోకి తెచ్చింది. పథకం ప్రకారం పోలీస్ డిపార్టుమెంట్‌‌ను నీరుగార్చేసింది. డైనమిక్ పోలీసు ఆఫీసర్లు, నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన  ఐపీఎస్ ఆఫీసర్లు కూడా పెదవి విప్పని పరిస్థితిని తీసుకొచ్చింది.

అన్నింట్లో లీడర్ల జోక్యం

రాష్ట్రంలోని నదులు, వాగులు, వంకలను కొల్లగొట్టి.. ఇసుకను అక్రమంగా అమ్ముకునే దందాను టీఆర్‌‌ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు దర్జాగా సాగిస్తున్నారు. ఇసుక లోడ్ ట్రాక్టర్, లారీలు దొరికినా స్టేషన్ నుంచి విడిపించే పనిలో ఎమ్మెల్యేలు బిజీగా ఉంటున్నారు. రియల్ ఎస్టేట్ దందాలు, భూ కబ్జాలు, పెట్టీ పంచాయతీలు అన్నింటిలోనూ అధికార పార్టీ లీడర్ల జోక్యం వల్ల పోలీసులకు చేతులు కట్టేసినట్టవుతోంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇంతే..  ఫ్రెండ్ ఇన్ ఫేవర్ ఆఫ్ పవర్ పార్టీ.. అని బహిరంగంగానే తేల్చేస్తున్నారు. ఒకవేళ ప్రత్యర్థుల కేసు నమోదు చేయటం తప్పనిసరైతే అధికార పార్టీ వాళ్ల తరఫున కౌంటర్ కేస్ బుక్ చేస్తున్నారు. అది ఎవరూ చెప్పకుండానే, తమ పనే అన్నట్లుగా పోలీసులు అడుగు ముందుకేస్తున్నారు. దీంతో టీఆర్​ఎస్​ నేతలు ఆడింది ఆటగా.. పాడింది పాటగా సాగుతోంది.

గ్యాంగ్‌‌స్టర్‌‌ నయీం కేసులోనూ పోలీసులు వివాదాస్పద పాత్ర పోషించారు. అధికార పార్టీ నేతల జోక్యంతోనే నయీం చెరలో ఉన్న ఆస్తుల వివరాలను దాచిపెట్టారు.  ఇప్పటికీ ఆస్తుల  పరిస్థితి ఏమిటనేది క్లారిటీ కూడా లేదు. నయీం భూ ఆక్రమణలు, దందాలు, కబ్జాల్లో ప్రమేయం ఉన్న లీడర్లను ఇప్పటికీ పెంచి పోషిస్తున్నారు. అప్పుడు నయీంతో దోస్తీ కట్టిన పోలీసు ఆఫీసర్లపై చర్యలు తీసుకోకపోగా, మంచి పోస్టింగ్‌‌లు ఇచ్చారు. గత ప్రభుత్వాల హయాంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదు. కొత్త రాష్ట్రంలో అంతకు మించి శాంతిభద్రతలను కాపాడుతామని, కొత్త పోలీసింగ్ మాన్యువల్ తీసుకొస్తామని టీఆర్ఎస్ ఎన్నికల ముందు చెప్పింది. కానీ పింక్ పోలీసింగ్ మ్యాన్యువల్ అని ఎవరూ ఊహించలేదు.

ఎమ్మెల్యేలకు ఖాకీ కాన్వాయ్‌‌లు

ఇప్పుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్టే చేస్తే.. ఆయన ఇంటి దగ్గర నుంచి ఎమ్మెల్యే వెళ్లే ప్రతి ప్రోగ్రామ్‌‌కూ ఎస్ఐ, సీఐ, డీఎస్పీ పొద్దంతా అటాచ్డ్‌‌గా ఉండాల్సిందే. ముగ్గురు ఆఫీసర్లూ ఆ రోజు స్టేషన్ డ్యూటీ  వదిలేసి.. మూడు వెహికల్స్ కాన్వాయ్‌‌తో ఎమ్మెల్యే వెంట తిరగాలి. దీంతో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు ప్రతి రోజు ఎమ్మెల్యేకు సలాం కొట్టడం, ఆయన చెప్పింది చేయటం కంపల్సరీ అన్నట్లుగా లా అండ్ ఆర్డర్ హద్దులు చెరిగిపోయాయి. నాకు తెలిసినంత వరకు గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యే వెంట ఉండే ఎస్కార్ట్ తప్ప ఇతర ఆఫీసర్లు ప్రదక్షిణలు చేసే డ్యూటీ ఉండేది కాదు. పబ్లిక్ మీటింగ్స్ ఉండే చోట మాత్రమే ఎస్ఐ, సీఐ, డీఎస్పీ ఇన్వాల్వ్ అయ్యేవారు. జిల్లాల్లో ఎస్పీలు అడపా దడపా మినిస్టర్లను ఇళ్ల దగ్గరకు వెళ్లి కర్టసీగా కలిసే సంప్రదాయం ఉండేది. ఇప్పుడు ఏకంగా ఎస్పీలు అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి కలిసి వస్తున్నారు. దీంతో అక్కడ పని చేసే డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు సైతం సలాం బాస్ అంటూ ఎమ్మెల్యేల ఎదుట మోకరిల్లే దౌర్బల్యం కనిపిస్తోంది.

సిరిసిల్ల నుంచి మంథని దాకా

కొన్ని నియోజకవర్గాల్లో ఇసుక మాఫియాను కంటికి రెప్పలా కాపాడే బాధ్యతను అక్కడి పోలీస్ ఆఫీసర్లకే అప్పగించినట్లు గతంలోనే బహిరంగమైంది. సిరిసిల్లలో ఇసుక లారీ కింద పడి యువకుడు చనిపోతే ఆగ్రహంతో ఊరోళ్లందరూ కలిసి ఇసుక లారీలను తగలబెట్టిన కేసును భూతద్దంలో చూపించి దళితులను పోలీసులు చిత్రహింసలు పెట్టారు. అప్పటి దురాగతం వెనుక నేరుగా ప్రగతి భవన్‌‌కు సంబంధాల్లేవా? ఇప్పటికీ ఆ ఘటనను జనం మరిచిపోలేదు. ఎప్పటికీ మరిచిపోరు. ఇప్పుడు మంథనిలో లాయర్ దంపతులను నరికి చంపిన కేసు కూడా అలాంటిదే. ఈ హత్య కేసులో డైరక్ట్‌‌గా టీఆర్ఎస్ లీడర్ల ప్రమేయం ఉందనడానికి సాక్ష్యంగా ఇప్పటికే కొన్ని వీడియోలు వైరలయ్యాయి. ఇప్పటికీ సీఎం కేసీఆర్, కేటీఆర్,  రాష్ట్ర హోం మంత్రి ఈ కేసుపై మాట్లాడకపోవటం విచిత్రంగా ఉంది. అధికార పార్టీ పురమాయించిన కేసుల్లో హడావుడి చేసే పోలీసులు ఈ జంట హత్యల కేసును ఎటువైపు మళ్లిస్తారో అన్నది వేచి చూడాల్సిందే.

ఈ పోలీస్ పాలనతో ఎప్పటికైనా ప్రమాదమే

గతంలో మంథని నియోజకవర్గంలోని ముత్తారంలో జరిగిన లాకప్ డెత్, మల్లారంలో దళితుని మర్డర్ కేసు అన్నింటిలోనూ పోలీసులు తీసుకున్న చర్యలు విమర్శలపాలయ్యాయి.  మొన్నటికి మొన్న దుబ్బాక బై ఎలక్షన్స్‌‌లో పోలీసుల హంగామా అంతా ఇంతా కాదు. బీజేపీ నేతల ఇళ్లపై సోదాలు చేసి, తప్పుడు కేసులు బుక్ చేసేందుకు చేసిన ప్రయత్నాలన్నీ జనంగమనించారు. అందుకే టీఆర్ఎస్‌‌కు అక్కడి ప్రజలు ఓటుతో తగిన గుణపాఠం చెప్పారు. ఇటీవల గుర్రంపోడులో పోలీసులు అకారణంగానే లాఠీఛార్జీ చేసి బీజేపీ కార్యకర్తలను చితక్కొట్టారు. అధికార పార్టీ నేతలు ఆక్రమించినట్లుగా చెబుతున్న భూములను కాపాడేందుకు పోలీసులు ఎందుకు హడావుడి చేశారనేది అసలు ప్రశ్న. ఇప్పుడదే అందరినీ ఆలోచనలో పడేసింది. ప్రతిపక్ష నేతలు గొంతెత్తకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేయటం, అసలు నిరసనలు, ఆందోళనల మాటెత్తకుండా అణిచివేసే ధోరణి తెలంగాణలో శ్రుతి మించుతోంది. అధికార పార్టీని సేవ్ చేయటం, విపక్షాలు చేసే ప్రతి పనిని అటకాయించే ధోరణిని పోలీసులు ప్రదర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యయుతంగా పార్టీలు చేపట్టే కార్యక్రమాలు, ఆందోళనలు, నిరసనలను అడ్డుకుంటూ ప్రభుత్వ నిరంకుశ ధోరణికి తానా అంటే తందానా అన్నట్లుగా లాఠీలు ఝుళిపించే ఈ పోలీస్ పాలన ఎన్నటికైనా ప్రమాదమే.

రాష్ట్రం సాధించుకున్నంక ఈ తీరు

తెలంగాణ ఉద్యమ సందర్భంలో  మన ప్రాంత నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని బాధపడ్డం. 14ఎఫ్ అమలు చేసి  జోన్లకు అతీతంగా  హైదరాబాద్ ఫ్రీ జోన్ చేయాలనే కుట్రను అడ్డుకునేందుకు  లీగల్ ఫైట్ చేసినం. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 14ఎఫ్ పేరాను తొలగించాలని ఢిల్లీలోనూ కొట్లాడినం. మన ప్రాంతంలోని పోలీసు ఉద్యోగాలు మన వాళ్లకే దక్కాలని ఆరాటపడినం. ప్రత్యేక రాష్ట్రం రావటంతో అందరి ఆకాంక్ష నెరవేరింది. ఇప్పుడదే పోలీసు సమాజం వ్యవహరిస్తున్న తీరు.. అది రాజకీయ పుంతలు తొక్కుతున్న తీరు నిజంగానే బాధ కలిగిస్తోంది.

పోలీస్​ వెన్ను విరిచారు

రాష్ట్రంలో శాంతి భద్రతలను అందరూ మెచ్చుకుంటున్నారని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. ఇక్కడి పోలీసు ఆఫీసర్లు స్వేచ్ఛగా డ్యూటీ చేసే వీలు లేకుండా చేసింది. పోలీసులు సొంతంగా నిర్ణయం తీసుకోకుండా, వాళ్లకు విచక్షణాధికారాలేవీ లేకుండా పెత్తనం చేస్తోంది. ప్రతి కేసులోనూ లీడర్ల జోక్యం ఉండే  నయా మాన్యువల్ ఇప్పుడు తెలంగాణలో అమల్లో ఉంది. ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల రికమండేషన్ లెటర్ ఇస్తే తప్ప పోస్టింగ్ ఉండదు. ట్రాన్స్‌‌ఫర్ ఆర్డర్ రాదు’.. అని బాజాప్త ఎస్పీలు, ఐజీలే కింది స్థాయి సిబ్బందిని డైరెక్ట్ చేస్తున్నారు. దీంతో శాంతి భద్రతలెలా ఉన్నా.. అధికార పార్టీ ఎమ్మెల్యేలతో మంచిగుండాలి. వాళ్లు చెప్పింది చేయాలనే కాన్సెప్ట్ ఎక్కువ మంది పోలీస్ ఆఫీసర్లలో నాటుకుపోయింది. లా అండ్ ఆర్డర్ డ్యూటీకి మించి, పొలిటికల్ అఫిలియేషన్ కోసమే ఆరాట పడుతున్నారు. లీడర్లు చెప్పింది కాదన్నా.. లీడర్ల ఆశీస్సులు తమకు లేకున్నా లూప్ లైన్ తప్పదని భయపడుతున్నారు. తమకు మంచి పోస్టింగ్ ఇచ్చిన లీడర్‌‌‌‌కు దక్షిణలు ఇచ్చుకుంటున్నారు. సీఐ పోస్టింగ్‌‌కు రూ.20 లక్షల వరకు, ఎస్ఐ పోస్టింగ్‌‌కు రూ.10 లక్షల వరకు ఇచ్చుకుంటున్నట్లు ప్రచారంలో ఉంది. మళ్లీ అంత మొత్తం సంపాదించుకోవాలంటే రాంగ్ రూట్ దందాలు, మాఫియా సెటిల్‌‌మెంట్లు తప్పదన్న ఫీలింగ్‌‌లోకి పోలీసులు వచ్చేస్తున్నారు.

కేడర్‌‌‌‌ను రెచ్చగొడుతున్న లీడర్లు

పథకం ప్రకారం రాష్ట్రంలో పోలీసింగ్ వీక్ చేసిన టీఆర్ఎస్.. ప్లాన్ ప్రకారమే లోకల్ లీడర్లు, కేడర్‌‌‌‌ను రెచ్చగొడుతోంది. సీఎం కేసీఆర్‌‌‌‌తో పాటు పార్టీ విప్‌‌లు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు మాట్లాడుతున్న తీరు కూడా మారిపోయింది. పబ్లిక్ మీటింగ్స్‌‌లోనే ‘తొక్కిపడేస్తాం,  నాశనం చేస్తాం, కార్యకర్తలారా మీరు చూసుకోండి’..  అంటూ పార్టీ కేడర్‌‌‌‌ను రెచ్చగొడుతున్నారు. రాజకీయ దాడులను ఎంకరేజ్ చేసేలా కామెంట్స్ చేస్తున్నారు.

నిలదీస్తే నలిపేసుడే
శాంతి భద్రతల డ్యూటీతో పాటు చట్టా నికి కట్టుబడి ఉండాల్సిన పోలీసు డిపార్టుమెంట్ రాష్ట్రంలో గులాబీ గూటికి కాపలా వ్యవస్థగా మారిపోయింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ గడిచిన ఏడేండ్లలో ఇరిగేషన్ తర్వాత అత్యంత ఎక్కువ బడ్జెట్ కేటాయించింది, నిధులను ఖర్చు
చేసింది పోలీస్ డిపార్టుమెం ట్ పైనే. పోలీసు వెహికల్స్ కొనుగోలుకు ఎక్కువ డబ్బులిచ్చింది. మోడరన్ పోలీసింగ్ స్పీడ్ పెంచింది. రాష్ట్రంలో ఏ మూలన ఏం జరిగినా తెలుసుకునేం దుకు వీలుగా కోట్లు ఖర్చు పెట్టి , సైబర్ టవర్స్ నిర్మిస్తోంది. రాజ్యాన్ని తమ గుప్పిట్లో పెట్టు కునేందుకు, నిలదీసినోళ్లను నలిపేసేందుకు కేసీఆర్ ఎంచుకున్న అడ్వాన్స్ ప్లానింగ్ ఇది.

 – డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ మెంబర్