ఇది అసాధారణ అనుభూతి.. వాంఖడేలో ఓ స్టాండ్‌కు తన పేరు నిర్ణయంపై రోహిత్

ఇది అసాధారణ అనుభూతి.. వాంఖడేలో  ఓ స్టాండ్‌కు తన పేరు నిర్ణయంపై రోహిత్

ముంబై: ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో ఓ స్టాండ్‌‌‌‌కు తన పేరు పెట్టాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించడంపై టీమిండియా కెప్టెన్‌‌‌‌ రోహిత్ శర్మ స్పందించాడు. దీన్ని తాను అస్సలు ఊహించలేదని చెప్పాడు.  ‘చిన్నప్పుడు వాంఖడే స్టేడియం బయట నిలబడి లోపలికి వెళ్లి రంజీ క్రికెటర్లను చూడాలనే తాపత్రయం ఉండేది. అప్పట్లో నాకు లోపలికి వెళ్లడం సాధ్యపడేది కాదు. 

ఇప్పుడు అదే స్టేడియంలో  ఓ స్టాండ్‌‌‌‌కి నా పేరు ఉండబోతుంది అంటే ఇది నిజంగా అసాధారణమైన అనుభూతి. నా జీవితంలో  దక్కిన ఇంత పెద్ద గౌరవానికి నేను ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటాను.  స్టాండ్‌‌‌‌పై నాపేరును చూసినప్పుడు అది నాకు చాలా భావోద్వేగభరితమైన క్షణం అవుతుంది’ అని శుక్రవారం ముంబై టీ20 లీగ్‌‌‌‌కు తనను బ్రాండ్‌‌‌‌ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా ప్రకటించిన ఈవెంట్‌‌‌‌లో పాల్గొన్న రోహిత్ చెప్పాడు. 

ఈ సందర్భంగా వాంఖడే స్టేడియంతో తన అనుబంధాన్ని హిట్‌‌‌‌మ్యాన్ గుర్తు చేసుకున్నాడు. ‘2003-–04లో అజాద్ మైదాన్‌‌‌‌ లో  అండర్-14, అండర్-16 ట్రైనింగ్ పూర్తయిన తర్వాత రైల్వే ట్రాక్ దాటి  దోస్తులతో కలిసి స్టేడియం వద్దకు వచ్చేవాడిని. అప్పట్లో వసీం జాఫర్, అమోల్ ముజుందార్ లాంటి క్రికెటర్లను ఒక్కసారైనా చూడాలనేది మా టార్గెట్‌. ఒక్కసారి గేట్ దాటి లోపలికి వెళితే చాలు అనుకునేవాళ్లం’ అని రోహిత్ పేర్కొన్నాడు.