- ఆ రాష్ట్రాలకే ఎక్కువ కేటాయించారు
- ప్రసంగంలో తెలంగాణ పదమే లేకపోవడం దారుణం
- రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై బీజేపీ ఎంపీలు సమాధానం చెప్పాలని డిమాండ్
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోదీ మొండి చెయ్యి చూపించారని కాంగ్రెస్ ఎంపీలు మండిపడ్డారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌ను కాపాడుకునేందుకు పెట్టిన బడ్జెట్‌లాగా కేంద్ర బడ్జెట్ ఉందని విమర్శించారు. ఇందులో భాగంగానే ఎన్డీయేలో కీలక భాగస్వాములైన ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకే ఎక్కువ కేటాయింపులు చేశారన్నారు. ఈ బడ్జెట్ ఆ రెండు రాష్ట్రాల కోసమే పెట్టినట్లు ఉందని వారు ఎద్దేవా చేశారు.
ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే ఈ రెండు రాష్ట్రాలకు కేటాయింపులు చేశారని ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, కడియం కావ్య, బలరాం నాయక్ మీడియాతో మాట్లాడారు. మల్లు రవి మాట్లాడుతూ.. ‘‘కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసింది. విభజన చట్టం గురించి చాలా సార్లు ప్రస్తావించారు. కానీ తెలంగాణ అన్న పదం వాడకపోవడం శోచనీయం. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల ప్రస్తావన లేదు. హైదరాబాద్ మినహా 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా గుర్తించినప్పటికీ.. తెలంగాణకు ప్రత్యేక కేటాయింపుల్లేవు.
ఈ విషయంలో కేంద్ర వైఖరిని ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌కు నిధులు కేటాయించడంలో మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణకు కేటాయింపులు లేకపోవడం బాధాకరం. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి పూర్తి చేయాలని ప్రధాని, కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు”అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారని, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా.. రాష్ట్రానికి దక్కింది శూన్యమని ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై బీజేపీ ఎంపీలు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ హక్కుల సాధనకు అన్ని పార్టీల ఎంపీలు కలిసి పోరాడేందుకు ముందుకు రావాలని కోరారు. బీజేపీ, ఎంఐఎం ఎంపీలను కలిసి ఉమ్మడి పొరాటంపై చర్చిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తెలంగాణ హక్కుల సాధనకు పోరాటం చేస్తామని తెలిపారు.
నిధుల కేటాయింపులో సవతి తల్లి ప్రేమ: ఎంపీ కడియం కావ్య
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటునే ఓర్వలేని మోదీ.. రాష్ట్రానికి నిధులు కేటాయించడంలోనూ సవతి తల్లి ప్రేమ చూపారని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య విమర్శించారు. నిధుల్లేక ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం ఉందని, ఈ టైంలో కేంద్ర బడ్జెట్ కొంత ఉపశమనం కలిగిస్తుందని భావిస్తే, మరోసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిరాశ పర్చారని దుయ్యబట్టారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర ప్రజలకు బీజేపీ ఎంపీలు ఎలా మొఖం చూపిస్తారని ఎంపీ బలరాం నాయక్ ప్రశ్నించారు.
తెలంగాణకు అన్యాయం: గడ్డం వంశీకృష్ణ
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర బడ్జెట్ పొలిటికల్ బడ్జెట్‌గా ఉందని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. ప్రధాని పదవిని, కేంద్రంలో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు పెట్టిన బడ్జెట్ అని అభిప్రాయపడ్డారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో వంశీకృష్ణ మీడియాతో మాట్లాడారు. సామాన్యులకు ఉపశమనం కలిగించేలా ఒక్క చర్య కూడా బడ్జెట్‌లో లేదన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని యువతకు ఇచ్చిన హామీని మోదీ విస్మరించారన్నారు. గడిచిన పదేండ్లలో నిరుద్యోగులకు బీజేపీ సర్కార్ 20 కోట్ల ఉద్యోగాలు బాకీ ఉందని గుర్తుచేశారు.
ఏపీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు, రాష్ట్రానికి నిధులు, నీటి పారుదల ప్రాజెక్టులు సాధించేంత వరకు పోరాడుతామని, ఎంపీలుగా అది తమ బాధ్యత అని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. పార్లమెంట్‌లో కొట్లాడైన రాష్ట్రానికి నిధులు తెస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ నష్టపోయినా హామీ మేరకు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచినా వారు సాధించిందేమీ లేదని
దుయ్యబట్టారు.
బడ్జెట్‌లో పొలిటికల్ ఫెడరలిజం: సురేశ్ రెడ్డి
కేంద్ర బడ్జెట్‌లో కో-ఆపరేటివ్ ఫెడరలిజం లేదని, కేవలం పొలిటికల్ ఫెడరలిజం మాత్రమే కనిపించిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్ రెడ్డి విమర్శించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీల అమలు విషయంలో ఎన్డీయే సర్కార్ విఫలమైందన్నారు. తెలంగాణకు కేటాయించకపోవడం సరికాదన్నారు.