Telangana Tour : వెయ్యేండ్ల నాటి ఖమ్మం కోట.. ఇలా వెళ్లాలి

రాజుల కాలంలో శత్రుదేశాల నుంచి తమ రాజ్యాన్ని కాపాడుకునేందుకు పెద్ద పెద్ద కోటలు కట్టేవాళ్లు. శత్రువులు దండెత్తినప్పుడు ఈ కోటల మీద నుంచి ఫిరంగులతో దాడిచేసేవాళ్లు. అలా కట్టించిన వాటిల్లో వందల ఏండ్లు అయినా కొన్ని కోటలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అంతేకాదు చారిత్రక వారసత్వాన్ని కళ్లకు కడుతూ టూరిస్టుల్ని ఆకర్షిస్తున్నాయి కూడా. అలాంటిదే వెయ్యేండ్ల నాటి ఖమ్మం కోట. 

కాకతీయుల రెండో రాజధానిగా పేరున్న ఖమ్మం జిల్లాలో ఉన్న ఈ కోటకి 'ఖమ్మం ఖిల్లా' అని పేరు. ఖమ్మం నడిబొడ్డున ఉన్న ఈ కోటని 'స్తంభాద్రి' అనే పెద్దరాయి మీద కట్టించారు. కాకతీయుల కాలంలోనే ఈ కోట కొంత భాగం కట్టారు. ఆ తర్వాత ముసునూరి నాయకులు, వెలమ రాజులు ఈ కోటని పూర్తిచేశారు. వీళ్ల తర్వాత రెడ్డి రాజులు, కుత్బ్షాహీ వంశస్తులు ఈ కోటని రిపేర్ చేయించారు. ఈ కోట నాలుగు చదరపు కిలోమీటర్ల పొడవు ఉంటుంది. కోట చుట్టూ 40 నుంచి 80 అడుగుల ఎత్తు, 15 నుంచి 20 అడుగుల వెడల్పు ఉన్న రాతి గోడ ఉంటుంది.

ఈ కోట నిర్మాణంలో హిందూ, ముస్లిం ఆర్కిటెక్చర్ కలగలిసి ఉంటుంది. కోట ప్రధాన ద్వారం 30 అడుగుల ఎత్తులో ఉంటుంది. 'ఖిల్లా దర్వాజ' గా పిలిచే దీనికి రెండు వైపులా ఫిరంగుల్ని చూడొచ్చు. 

రాళ్లతో కట్టిన బురుజులు

వర్షం నీళ్లని ఒడిసిపట్టేందుకు ఇటుకలు, సున్నపురాయితో కట్టిన నీటి ట్యాంకులు ఉన్నాయి ఇక్కడ. కోటలో పది గేట్లు ఉంటాయి. అయితే వీటిలో కొన్ని దెబ్బతిన్నాయి. ప్రతి గేటు దగ్గర ఫిరంగితో పాటు రాళ్లతో తయారుచేసిన నీటిబిందెలు ఉంటాయి. అంతేకాదు శత్రు దేశాల సైన్యం దండెత్తినప్పుడు వాళ్ల మీదకి ఫిరంగులు ఎక్కుపెట్టేందుకు వీలుగా కోటకి కిటికీలు ఏర్పాటుచేశారు కూడా.

ఈ కోటలోపల చిన్న చిన్న గుళ్లు, మండపాలు, మసీదు ఉంటాయి. కోట మీదకి వెళ్లడానికి మెట్లున్నాయి. రాళ్లతో కట్టిన బురుజులు 15 వరకు ఉంటాయి. ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండియా ఈ కోట మెయింటెనెన్స్ చూసుకుంటుంది. కోట ఎక్కి చూస్తే ఖమ్మం సిటీ మొత్తం కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో చాలామంది ఇక్కడికి వెళ్తుంటారు.

ఇలా వెళ్లాలి..

హైదరాబాద్ నుంచి 193 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఖమ్మం కోట. వరంగల్ నుంచి 120 కిలోమీటర్ల జర్నీ, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి బస్సు, రైలు సదుపాయం ఉంది.