ఇది బడ్జెట్ కాదు.. బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టో.. కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎంపీల విమర్శలు

ఇది బడ్జెట్ కాదు.. బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టో.. కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎంపీల విమర్శలు

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టింది కేంద్ర బడ్జెట్ కాదని.. బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టో అని కాంగ్రెస్ ఎంపీలు విమర్శించారు. త్వరలో జరగనున్న ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల ఎన్నికల కోసమే బడ్జెట్ పెట్టినట్లు ఉందన్నారు. కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామ సహాయం రఘురాం రెడ్డి, సురేశ్ షట్కర్ శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. 

ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. బడ్జెట్‌లో ఏపీ విభజన చట్టంలో పొందుపరిచిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన హామీలు, పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్‌కు జాతీయ హోదాను కేంద్రం విస్మరించిందన్నారు. నిరుద్యోగం, పెరిగిన నిత్యవసర ధరల తగ్గింపుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ధనవంతులు, కార్పొరేట్ వ్యక్తులు, వ్యాపారవేత్తల కోసమే ఈ బడ్జెట్ పెట్టినట్లు ఉందన్నారు.

 
ఢిల్లీ, బిహార్‌‌ ఎన్నికల కోసమే బడ్జెట్‌.. 

 

కేంద్రానిది పూర్తిగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో అని.. ఢిల్లీ గద్దెను దక్కించుకునే ఉద్దేశంతో ఈ బడ్జెట్ పెట్టినట్లు ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలను బీజేపీ చిన్నచూపు చూస్తున్నదని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణకు ప్రాముఖ్యత కల్పించాలని కోరారని గుర్తుచేశారు. గుజరాత్ వ్యాపారస్తులకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు సరికాదని చెప్పారు. ఎన్నికలు జరగనున్న ఢిల్లీ, బిహార్ ఎన్నికల కోసం ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు ఉందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి విమర్శించారు. బడ్జెట్‌లో తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేసిందని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కర్ అన్నారు. 

కేంద్రానిది అట్టర్ ప్లాఫ్ బడ్జెట్

కేంద్ర  బడ్జెట్ పూర్తిగా అట్టర్ ప్లాఫ్ అని పెద్దపలి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ అన్ ఫిట్ అని విమర్శించారు. ఓటు బ్యాంకింగ్ రాజకీయాలు, అదానీ, అంబానీని సంతోషపెట్టేందుకు బడ్జెట్ పెట్టినట్లు ఉందన్నారు. దేశ అభివృద్ధి, కంట్రిబ్యూషన్‌లో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలను కేంద్రం విస్మరించిందని ఫైర్ అయ్యారు. 

శనివారం కేంద్ర బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం పార్లమెంట్ ఆవరణలో, ఢిల్లీ తెలంగాణ భవన్‌లో మీడియాతో వంశీకృష్ణ మాట్లాడారు. తెలంగాణ నుంచి ఒక రూపాయి ట్యాక్స్ రూపంలో చెల్లిస్తే.. కేవలం 40 పైసలే రిటర్న్ ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో వస్తున్నాయన్నారు. అదే ఉత్తరప్రదేశ్‌కి రూ.5, బిహార్‌‌కు రూ.10 అదనంగా ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో కేంద్రం ఇస్తున్నదని తెలిపారు. ప్రొడెక్షన్ లింక్డ్ ఇన్సెటీవ్స్ (పీఎల్ఐ) పేరుతో అంబానీ, అదానీలకు మాత్రమే రాయితీలు ఇస్తున్నారని, అందువల్ల పీఎల్ఐని ఏఎల్ఐ(అదానీ– అంబానీ లింక్డ్ ఇన్సెటీవ్స్)గా పేరు మార్చుకోవాలన్నారు. 

తెలంగాణ అప్పుల రీస్ట్రక్చర్‌‌పై సీఎం రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేసినా, కేంద్రం పట్టించుకోలేదన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని పలువురు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశానని చెప్పారు. సింగరేణికి గ్రీన్ అండ్ క్లీన్ టెక్, కోల్ గ్యాసిఫికేసణ్, సోలార్ ప్రాజెక్టుల రూపంలో వచ్చే ఎంప్లాయిమెంట్ కోసం కేంద్రానికి ఎన్ని ప్రతిపాదనలు చేసినా స్పందించలేదన్నారు. 

ధర్మపురిని టూరిజం స్పాట్‌గా చేయాలనే యోచనలో.. ఈ ఆలయానికి కేంద్ర నిధులు కోరానని వివరించారు. మంథనిలోని రామగిరిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రతిపాదనను కూడా కేంద్రానికి పంపినట్లు తెలిపారు. ముఖ్యంగా పెద్దపల్లిలో కోల్డ్ స్టోరేజ్ హబ్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. వీటిపై కూడా బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన లేదని ఫైర్ అయ్యారు. విభజన హామీలతో పాటు తెలంగాణకు ఆకాంక్షలపై పార్లమెంట్‌లో పోరాడుతామన్నారు.