కోల్‌కతా: కేంద్ర బడ్జెట్ ఆర్థిక, రాజకీయ దివాళాకోరుతనాన్ని ప్రతిబింబిస్తున్నదని తృణముల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆరోపించింది. మోదీ సర్కార్ 'యూనియన్ బడ్జెట్'కి బదులు 'ఆంధ్రా-బిహార్ బడ్జెట్'ప్రవేశపెట్టిందని ఎద్దేవా చేసింది. ఈ మేరకు టీఎంసీ సీనియర్ నేత కునాల్ ఘోశ్ ట్వీట్ చేశారు. మోదీ తన కుర్చీని కాపాడుకోవడానికే ఏపీ, బిహార్ రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించారని ఆరోపించారు.
మిగిలిన రాష్ట్రాలను ఘోరంగా అవమానించారని మండిపడ్డారు. ఈ బడ్జెట్ దేశంలోని ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. కేవలం గణాంకాలు, వాక్చాతుర్యానికి ప్రాముఖ్యతను ఇచ్చారని తెలిపారు. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ..బెంగాల్‌పై మోదీ ప్రభుత్వం కొనసాగిస్తున్న నిర్లక్ష్యానికి త్వరలోనే ప్రజల నుంచి గట్టి జవాబు వస్తుందని అన్నారు. కేంద్ర బడ్జెట్ బీజేపీకి ఓటు వేయని వారిపై ప్రతీకార వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
దేశంలోని నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణం వంటి అత్యవసర సమస్యలను పరిష్కరించడానికి బదులు బీజేపీ తన సంకీర్ణ భాగస్వాములకే ప్రాధాన్యం ఇచ్చిందని ఆరోపించారు. ఎన్డీఏని విడిచి వెళ్లకుండా కూటమిలోని పార్టీలను కొనుగోలు చేయడానికే బడ్జెట్‌ను రూపొందించారని అభిషేక్ బెనర్జీ పేర్కొన్నారు.