
ఎంజే మార్కెట్: ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ చిన్న కుమారుడు ప్రిన్స్ మొజంజా బహదూర్ పేరు మీదుగా మొజంజాహీ మార్కెట్‌ను 1935లో పూర్తి చేశారు. ఈ మార్కెట్ పై భాగంలో ఉన్న గడియారం ప్రత్యేక ఆకర్షణ. మార్కెట్‌ను గ్రానైట్ స్టోన్, బూడిద రంగు రాయితో నిర్మించారు.
అసఫ్‌జాహీల కాలంలో హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందింది. ఆనాటి కాలంలో నిర్మించిన భవన సముదాయాలు నేటికీ వినియోగంలో ఉన్నాయి. ముఖ్యంగా ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్, ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో చేపట్టిన నిర్మాణాలు ఎంతో ప్రఖ్యాతిగాంచాయి. ఇవి పోటీ పరీక్షల దృష్ట్యా ఎంతో కీలకం. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో చేపట్టిన నిర్మాణాల గురించి తెలుసుకుందాం.
రాష్ట్రపతి నిలయం: బ్రిటీష్ వైశ్రాయ్ నివాసాన్ని 1950లో కేంద్ర ప్రభుత్వం రూ.60లక్షలకు కొనుగోలు చేసి దాన్ని రాష్ట్రపతి నిలయంగా తీర్చిదిద్దింది. 70 ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్రపతి నిలయాన్ని బొల్లారంలో ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి దక్షిణ ప్రాంత ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఈ నివాసాన్ని ఏర్పాటు చేశారు.
ఉస్మానియా హాస్పిటల్: మూసీ నదీ తీరంలో 1866లో రెండు అంతస్తుల హాస్పిటల్ భవనాన్ని నిర్మించి, అత్యంత ఆధునిక వైద్య సేవలను అందిస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో ఈ హాస్పిటల్‌ను అఫ్జల్‌గంజ్ దవాఖానా అని పిలిచేవారు. 1908లో మూసీ నది వరదల తాకిడికి భవనం పూర్తిగా దెబ్బతిన్నది. ఏడో నిజాం ప్రభువు 1920లో తిరిగి అదే ప్రాంతంలో హాస్పిటల్ కోసం నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఐదేండ్లలో పూర్తి చేసి 1925లో కొత్త హాస్పిటల్ ప్రారంభించాడు.
ఈఎన్టీ హాస్పిటల్: ప్రస్తుత చెవి ముక్కు గొంతు హాస్పిటల్ భవనాన్ని ప్రఖ్యాత పార్శీయులు పెస్తోజీ అండ్ కంపెనీ నిర్మించింది. 1839–45 మధ్యకాలంలో పెస్తోజీ కంపెనీ నిజాం ప్రభువుల రెవెన్యూ రికార్డులు, లెక్కలు పరిశీలించేవారు. పెస్తాన్జీ నిర్మించిన ప్రస్తుత ఈఎన్టీ హాస్పిటల్ భవన సముదాయాన్ని నిజాం రాజ్యంలోని ఉన్నతోద్యోగి రాజా ప్రతాపగిరి కొన్నారు.
సిటీ కాలేజ్: మూసీ నదీ తీరంలో ముస్లిమ్జంగ్ బ్రిడ్జికి సమీపం, హైకోర్టు భవనానికి పశ్చిమ వైపుగా సిటీ కాలేజ్‌ని 1921లో ఏడో నిజాం ప్రభువు నిర్మించారు. హింద ముస్లిం వాస్తుకళ మిశ్రమంతో రూ.8లక్షలతో ఈ కాలేజ్ నిర్మించారు. మొదటి, రెండో అంతస్తుల వారందరికీ ఉపయోగపడేలా అతిపెద్ద హాలును నిర్మించారు. దీన్ని గ్రేటర్ హాల్ అంటారు. నిజాం ప్రభువు పిల్లల చదువు కోసమని సిటీ స్కూల్‌గా ఏర్పడి, ఆ తర్వాత సిటీ కాలేజ్‌గా అభివృద్ధి చెంది కాలానుగుణంగా ప్రస్తుత విద్యా విధానంలోని వివిధ కోర్సులను ప్రవేశపెట్టారు. 2004 మార్చి 7న ఈ కళాశాల స్థాపించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫ్లాటినం జూబ్లీ వేడుకలను నిర్వహించారు.
చిరాన్ ప్యాలెస్: ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజ్ ప్రముఖ్ పదవి చేపట్టిన అనంతరం తాను నివాసం ఉండే కింగ్ కోఠి ప్రాంతం జనసమర్థతతో ఉన్నదని తనకు నగర శివారులో ఎక్కడైనా తగిన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాల్సిందిగా కోరగా రాష్ట్ర ప్రభుత్వం జూబ్లీహిల్స్‌లోని రిజర్వ్ ఫారెస్ట్‌లో 300 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ భూమిలోనే ఏడో నిజాం తన కోసం చిరాన్ ప్యాలెస్‌ను ఆధునిక రీతిలో ఫ్రెంచ్ వారి వాస్తుశైలిలో నిర్మించారు. నిజాం వారసులకు ఆరెకరాల భూమిని వదిలి మిగతా ప్రాంతంలో జాతీయ పార్క్‌ను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఈ పార్కును కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కుగా నామకరణం చేసింది.
రెడ్డి హాస్టల్: నిజాం పాలనా కాలంలో నగర పోలీస్ కమిషనర్‌గా రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి పనిచేస్తున్న సమయంలో విద్యార్థుల కోసం 1920లో ఒక వసతి గృహాన్ని రెడ్డి హాస్టల్ పేరుతో ప్రారంభించారు. యురోపియన్ ఇండో హిందువు శైలిలో నిర్మించిన ఈ హాస్టల్ భవనంలో 150 మంది విద్యార్థులకు వసతి సౌకర్యం ఉంది.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్: నిజాం ప్రభుత్వంలోని రెవెన్యూశాఖ డైరెక్టర్ శ్రీవాక్ ఫీల్డ్ చొరవతో జమీందారులు, ఆంగ్లేయుల పిల్లల కోసం ఒక పబ్లిక్ స్కూల్‌ను 1924 నవంబర్‌లో ఏర్పాటు చేశారు. ఈ పబ్లిక్ స్కూల్‌కు జాగీర్దార్ కాలేజ్ అనే పేరు పెట్టారు. స్థానిక ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ఇండియన్ పబ్లిక్ స్కూల్‌గా పేరు మార్చి తగిన మార్పులతో తిరిగి ప్రారంభించారు. ఈ అతిపెద్ద భవన సముదాయంలో ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను నిర్వహిస్తున్నారు.
జూబ్లీహాల్: ఏడో నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీఖాన్ అధికారం చేపట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం కోసం 1936లో ప్రత్యేకంగా ఈ భవన సముదాయాన్ని నిర్మించారు. 1936లో జూబ్లీ వేడుకలు జరగాల్సి ఉన్నా కింగ్ ఐదో జార్జి మరణించడంతో ఆ వేడుకలను 1937లో నిర్వహించారు. సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలను నిర్వహించడం కోసం ఏర్పాటు చేసిన భవనం కాబట్టి ఇది జూబ్లీ భవన్‌గా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం రాష్ట్ర శాసన మండలిని జూబ్లీహాల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు.
నీలోఫర్ హాస్పిటల్: మీర్ ఉస్మాన్ అలీఖాన్ 2వ కొడలైన ప్రిన్సెస్ నీలోఫర్ పేరు మీదుగా 1949లో ఈ హాస్పిటల్‌ను ప్రారంభించారు. ఈ హాస్పిటల్ చిన్న పిల్లల వైద్యానికి ప్రసిద్ధి చెందింది.
నిజాం సంస్థానం.. దివాన్ దేవిడి
నిజాం సంస్థానం ప్రధాని అధికార నివాసమే దివాన్ దేవిడి. అసఫ్‌జాహీ ప్రభువుల ఆస్థానంలో పనిచేసిన సాలార్జంగ్–1, సాలార్జంగ్–2, సాలార్జంగ్–3 మొదలైన వారు దివాన్ దేవిడి నుంచి తన అధికార హోదాలో ప్రభువులకు తమ సేవలు అందించారు. సాలార్జంగ్–1, సాలార్జంగ్–3 సేకరించిన అనేక విశిష్టమైన కళారీతులు మొదట దివాన్ దేవిడిలోనే ప్రజాప్రదర్శనకు ఏర్పాటు చేశారు. సాలార్జంగ్ మ్యూజియం నిర్మాణం పూర్తయిన తర్వాత దివాన్ దేవిడిలోని కళారీతులను మ్యూజియానికి తరలించారు. బర్మా టేకుతో చేసిన లక్కడ్ కోట భవన సముదాయం, నిలువుటెత్తు అద్దాలు, షాండిలియర్లు గల ఐనా ఖానా హాలు మొదలైన వాటితో దివాన్ దేవిడిలో అద్భుతమైన నిర్మాణాలు చేపట్టారు.
కింగ్‌కోఠి: కింగ్‌కోఠి అంటే ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నివాసించే ప్యాలెస్. 21 ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్యాలెస్‌ను యూరోపియన్ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ ప్యాలెస్‌ను కమాల్‌ఖాన్ నిర్మించాడు. ఇందులోని అద్దాలు, తలుపులు, గోడలపై కమాల్‌ఖాన్ తన పేరును కేకే అని చెక్కించుకున్నాడు. కేకేను కింగ్కోఠిగా నిజాం మార్చాడు. ముబారక్ మాన్సన్, ఉస్మాన్ మాన్సన్, నియాజ్ఖాన్, మేజ్ఖానా ఇలా పలు భవనాలు నిర్మించాడు. ముబారక్ మాన్సన్ ఎత్తయిన ప్రధాన సింహద్వారాల దగ్గర ఒక పెద్ద పరదా వేలాడుతూ ఉండేది.
నిజాం ప్రభువు ప్యాలెస్‌లో లేని సమయంలో ఈ పరదాను ఎత్తి ఉంచేవారు. ముబారక్ మాన్సన్‌కు తూర్పు దిశలో బొగ్గులకుంట రోడ్డులోని ప్రవేశ ద్వారాన్ని గాధిలాల్ గేటు అని అంటారు. ఇందులో నిజాం వ్యక్తిగత కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల సలహాదారుని కార్యాలయాలు ఉండేవి. ఈ మాన్సన్లోనే సూపరింటెండెంట్ ఆఫ్ ది రాయల్ ప్యాలెస్ అధికార కార్యాలయం ఉండేది. దీన్నే సీట్ ఆఫ్ హజర్ జంగ్ అని పిలిచేవారు. కింగ్ కోఠి ప్యాలెస్‌ను తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సందర్శించాడు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1967 ఫిబ్రవరి 24న ఈ ప్యాలెస్‌లోనే మరణించారు. ప్రస్తుతం కోఠి ప్యాలెస్ భవనంలో కింగ్ కోఠి హాస్పిటల్ నడుస్తోంది.