బఫర్ జోన్‍, FTLలకు మధ్య తేడా ఇదే.. హైడ్రా వాటినెందుకు కూల్చేస్తోంది

హైదరాబాద్ లో చెరువులు, నాలాలు ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై హైడ్రా దృష్టి పెట్టింది. ఒక్కోక్కటిగా చెరువులను ఆక్రమించి కట్టిన బిల్డింగులను నేలమట్టం చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే రెండు పదాలు తరుచుగా వార్తల్లో వినిపిస్తున్నాయి. అవే.. ఒకటి FTL, మరొకటి బఫర్ జోన్ .. ఈ రెండు ప్రాంతాల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలనే టార్గెట్ చేసుకొని మున్సిపల్ అధికారులు హైదరాబాద్ లో భూకబ్జాలకు చెక్ పెట్టాలనుకుంటున్నారు. ఇప్పుడు బఫర్ జోన్, FTL అంటే ఏంటో తెలుసుకుందాం..

FTL (ఫుల్ ట్యాంక్ లెవల్) :

చెరువులు, కుంటలు ఉన్న ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఆ చెరువు నీటి సామర్థ్యాన్ని అంచనా వేసి FTLను మున్సిపల్ అధికారులు, నీటి పారుదల శాఖ నిర్ణయిస్తారు. వర్షకాలంలో పూర్తిగా నీరు ఉంటే ఏ ఏరియా వరకు నీరు నిల్వ ఉంటుందో చెప్పేదే FTL.. అక్కడ అన్నీ కాలాల్లో నీరు ఉండదు. దీంతో చాలామంది వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. నీరు లేకున్నా ఆ ప్రాంతం ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తోంది. ఎఫ్‌టీఎల్ పరిధిలో పట్టా భూములున్నా సరే.. అందులో వ్యవసాయం మాత్రమే చేసుకోవచ్చు. నిర్మాణాలు చేయడానికి అక్కడ పర్మిషన్ లేదు. వాటిని ఖాళీగా వదిలేయాలి. 

బఫర్ జోన్ :

రెండూ లేదా అంతకంటే ఎక్కువ నీటి వనరులున్న ప్రాంతాలను వేరే చేసే ప్రదేశాన్ని బఫర్ జోన్ అంటారు. అక్కడ లభించే నీటి వనరుల లభ్యత ఆధారంగా బఫర్ జోన్ పరిధిని నిర్ణయిస్తారు. ఇవి ఉండే ప్రదేశాలను బట్టి వాటిలో రకాలు కూడా ఉంటాయి. కొన్ని బఫర్ జోన్లు వన్యప్రాణుల సంరక్షణకు నిలయంగా ఉంటాయి. 25 హెక్టార్లు లేదా అంతకు మించి విస్తీర్ణంలో ఉన్న జలాశయాలు, చెరువులు, కుంటలను బఫర్ జోన్లుగా పరిగణిస్తారు. ఆ బఫర్ జోన్ కు 30 మీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే రూల్ ఉంది. బఫర్ జోన్ పరిధిలో ఉన్న సొంత భూమి అయినా సరే.. కేవలం అక్కడ సాగు మాత్రమే చేసుకోవచ్చు. కట్టడాలకు అది అనువైన ప్రదేశం కాదు.

ఇదీ FTL, బఫర్ జోన్ మధ్య తేడా..ఇప్పుడు హైడ్రా.. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కూల్చివేతలు ఈ FTL, బఫర్ జోన్ కింద ఉన్నవే.