ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీ ఇదే

ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీ ఇదే
  • డెవలప్ చేసిన స్టార్టప్ కంపెనీ ఈప్లేన్‌

బెంగళూరు: హెలీకాప్టర్ కంటే వేగంగా వెళ్లే  ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీని ఐఐటీ మద్రాస్‌‌‌‌కు చెందిన స్టార్టప్‌‌ ఒకటి డెవలప్ చేసింది. 2017 లో మొదలైన స్టార్టప్‌‌  ఈప్లేన్ కంపెనీ  బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా షోలో దీని ప్రోటోటైప్‌ను   ప్రదర్శనకు పెట్టింది. సిటీల్లో వేగంగా ప్రయాణించేందుకు  ఈ ఫ్లయింగ్ ట్యాక్సీలు సాయపడుతాయని కంపెనీ చెబుతోంది. ఈవ్లోట్‌ పేరుతో పిలుస్తున్న ఈ ప్రోటోటైప్  నిటారుగా టేకాఫ్ అవ్వడమే కాకుండా ల్యాండింగ్ కూడా చేస్తుంది. సింగిల్ ఛార్జింగ్‌‌పై 200 కి.మీ ప్రయాణిస్తుండడం విశేషం. ఈ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీ కార్ల కంటే 10 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుందని  ఈప్లేన్ కంపెనీ పేర్కొంది. వీటిలో ట్రావెల్ చేసే ప్రయాణికుడికి  ఉబర్‌‌‌‌లో చేసే ప్రయాణంతో పోలిస్తే రెండు రెట్లు మాత్రమే ఎక్కువ ఖర్చు అవుతుందని తెలిపింది. ఈప్లేన్‌‌ కంపెనీని  సీటీఓ సత్య చక్రవర్తి ఏర్పాటు చేశారు.

ఈ కంపెనీ చెబుతున్నదాని ప్రకారం,  ఈ ఫ్లయింగ్ ట్యాక్సీని పార్క్ చేయడానికి ఎక్కువ స్థలం అవసరం లేదు. ఇది కేవలం 25 చదరపు మీటర్ల ప్లేస్‌‌నే ఆక్రమిస్తుంది. ఈ ఫ్లయింగ్ ట్యాక్సీ బరువు 200 కేజీలు. నాలుగు ఫ్యాన్‌‌లు ప్రొపెల్లర్లుగా పనిచేస్తాయి.  ఒకే సారి ఇద్దరు ప్రయాణికులు గంటకు 150–200 కి.మీ స్పీడ్‌‌తో ట్రావెల్ చేయొచ్చు. 457 మీటర్ల (1,500 అడుగుల) ఎత్తు వరకు వెళ్లగలదు. ఈ ఫ్లయింగ్ ట్యాక్సీ బ్యాటరీని మార్చలేం. ఈ ఫ్లయింగ్ ట్యాక్సీని  నడపడానికి ఒక పైలెట్ అవసరం.  10–15 కి.మీ దూరం గల  షార్ట్ ట్రిప్‌‌లను సింగిల్ ఛార్జింగ్‌‌పై 10 సార్లు వెళ్లగలిగేలా మోడల్‌‌ను తీసుకురావడమే తమ టార్గెట్‌‌ అని  కంపెనీ చెబుతోంది. ఈప్లేన్ కంపెనీ  ఇప్పటి వరకు  మిలియన్ డాలర్లను సేకరించింది.