మరో మండల్​ ఉద్యమం కావాలి : ప్రొ. ఎస్. సింహాద్రి

బీపీ మండల్ విగ్రహాన్ని ఈ మధ్యలో మంథని పట్టణంలో ఆవిష్కరించారు. తెలంగాణలో ఇది మొదటి విగ్రహం. కొన్ని నెలల ముందు గుంటూరులో కూడా ఆవిష్కరించారు.  మరికొన్ని జిల్లాల్లో మండల్ విగ్రహ స్థాపనకు బీసీలు సిద్ధమవుతున్నారు. దేశంలో ఓబీసీ రిజర్వేషన్ల పితామహుడైన మండల్ గురించి బహుశా 40 ఏండ్లలోపు గల యువతకు తెలియక పోవచ్చు. మండల్ కమిషన్ రిపోర్ట్ ఈ దేశంలోని కులతత్వ శక్తులను/పార్టీలను ఎండగట్టింది. కుల ఓబీసీ వ్యతిరేకతను మండల్ ఉద్యమం బట్టబయలు చేసింది. ఓబీసీ సాధికారతకు అదొక మలుపు.

కొన్ని పార్టీలు వ్యతిరేకించినా..

దురదృష్టవశాత్తు ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఈ రిపోర్టును వ్యతిరేకించింది. దాంతోపాటు ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కూడా వ్యతిరేకించింది. మూడు నెలల తర్వాత బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతును విత్ డ్రా చేయడంతో వీపీ సింగ్ ప్రభుత్వం రాజీనామా చేసింది. మండల కమిషన్ రిపోర్టులో ఉన్న రిజర్వేషన్లను ఈ రెండు పార్టీలు, బయట ఉన్న విద్యార్థి, ఉద్యోగ సంఘాలు వ్యాపార, పారిశ్రామిక వేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. చివరకు1992 నవంబరులో సుప్రీం మండల కమిషన్ రిపోర్టు సిఫార్స్​ చేసిన రిజర్వేషన్ శాస్త్రీయంగా,  డేటా ఆధారంతో ఉన్నదని చెప్పింది.1993లో మొదటిసారి కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగ నియామకాలకు ఓబీసీ రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయి. మండల్ కమిషన్ ఓబీసీలు 52 శాతం జనాభా ఉన్నట్లు నిర్ధారించింది. ఆనాడు కోర్టులు రిజర్వేషన్లకు 50 శాతం పరిమితులు విధించాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పోను మిగిలిన 27% ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలని మండల్ కమిషన్​ సిఫారసు చేసింది. రాజ్యాంగ సభలో మొదలైన ఓబీసీల చర్చ 1993 వరకు కొనసాగింది. పార్లమెంట్ లో మండల్ కమిషన్ రిపోర్టు అమలును వ్యతిరేకిస్తూ పెద్ద ఉద్యమం జరిగింది. అందులో భాగంగా బీజేపీ నాయకత్వంలో రామ జన్మభూమి రథయాత్ర మొదలైంది. ఇంకోవైపు మండల్ ను సమర్థించే సోషలిస్టు, బహుజన సామాజిక శక్తులు ఉద్యమించాయి. దేశంలో మండల్ చుట్టూ తీవ్ర భావజాల పోరాటం జరిగింది. దీన్ని కొందరు మండల్ విప్లవంలా పేర్కొన్నారు. 7 ఆగస్టు1990 ఓబీసీల ఉనికిని చాటిన గొప్ప దినంగా చెప్పుకుంటారు. 

మండల్​ ఉద్యమం ప్రభావం

ఓబీసీల ఐడెంటిటీని రిజర్వేషన్లను సమర్థించిన మండల్ ఉద్యమం దేశంలో ఆలోచనల ఉద్యమానికి నాంది పలికింది. మండల్ ను సమర్థించేవారు, వ్యతిరేకించేవారు ఈ ఉద్యమంలో బలంగా పాల్గొన్నారు. దాంతో ఓబీసీ గుర్తింపు ఒక చరిత్రాత్మకమైన అంశంగా దేశం ముందు నిలిచింది. ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో ఓబీసీ చైతన్యంతో ఎలక్షన్స్ జరిగి ఓబీసీల నాయకత్వంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడ్డాయి. దేశంలో అత్యంతగా సమాజాన్ని ప్రభావితం చేసిన ఓబీసీ ఉద్యమం మండల్ ఉద్యమమే. ఇంత ప్రాముఖ్యత కలిగిన ఉద్యమాన్ని ఓబీసీలు ఎందుకు కొనసాగించలేకపోయారు? మండల్ ఉద్యమ ప్రభావం ఉత్తరాదిలో బలంగా ఉన్నది. దక్షిణాదిలో మండల్ ఉద్యమం పట్టణాలకే పరిమితమైంది. కేంద్ర విద్యా సంస్థల్లో కూడా మండల్ సూచించిన రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆ తర్వాత మండల్ 2లో భాగంగా ఐఐటీ, ఐఐఎం కేంద్రీయ విశ్వవిద్యాలయాల సీట్లలో మన విద్యార్థులు పోటీపడుతుండటంతో మండల్ ఫలాలు ఓబీసీలు అనుభవించడం మొదలైంది. 

తెలంగాణలో మండల్​ ఉద్యమం?

తెలంగాణకు బలమైన ప్రజా ఉద్యమాల చరిత్ర ఉంది. అయితే రాష్ట్రంలో ఎన్నో ఉద్యమాలు జరిగినా  బీసీలకు ఎలాంటి సాధికారిక లభించలేదు. విద్య, ఉద్యోగాలు అంతంత మాత్రంగానే పొందినారు. రాజకీయ అధికారం మాత్రం వీరిని ప్రభుత్వ అంచులకు కూడా రానీయకుండా, ఎదిగిన కుల పార్టీలు అడ్డుకున్నాయి. ప్రధాన ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ కుల సంఘ, ప్రజాసంఘ చర్చలు, దరఖాస్తులు ప్రభుత్వ పాలసీలను ప్రభావితం చేయలేకపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న క్రమంలో సామాజిక తెలంగాణ చైతన్యం కూడా ముందుకు వచ్చింది. కానీ టీఆర్ఎస్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడినప్పటికీ బీసీల ఆకాంక్షలను ఏమాత్రం పట్టించుకోలేదు. కులవృత్తుల రూపంలో ప్రభుత్వ సాయం కొంతమేరకు కనిపించినా మోడరన్ ఎకానమీలో ఏమాత్రం అవకాశాలను కల్పించలేదు. రాజ్యాధికారంలో ఓబీసీల స్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడిలాగే ఉన్నది.  ప్రభుత్వం, పార్టీలు ఏమాత్రం ఓబీసీల అధికారం కోసం తోడ్పడలేదు.

మండల్​ రిపోర్టు  బీసీలకు రాజ్యాంగం

అంబేద్కర్ పోరాటాలు వారి రచనలు దళిత సమాజం మీద ముఖ్యంగా విద్యావంతులను ఎక్కువ ప్రభావాన్ని చూపించినాయి. అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ గ్రామ గ్రామాన దళిత చైతన్యాన్ని ముందుకు తీసుకొచ్చింది. దురదృష్టవశాత్తు ఓబీసీలు అలాంటి చైతన్యాన్ని అందుకోలేక పోయినారు. ఫూలే పోరాటాలు స్వాతంత్ర్యం ముందు ఉన్నప్పటికీ అవి సాంస్కృతిక పోరాటంగా మిగిలిపోయింది. స్వాతంత్ర్యం అనంతరం అలాంటి విశిష్ట పోరాటాలు ఓబీసీలలో కనిపించవు. ఓబీసీలకు మండల్​ ద్వారానే ఒక గుర్తింపు దొరికింది. రిజర్వేషన్ల రూపంలో విద్య, ఉద్యోగ రంగాలలో ప్రవేశించడం మొదలైంది. కానీ మండల్ చేసిన 40 సిఫారసులలో రిజర్వేషన్ అనే ఒకే ఒక్క అంశం ఉద్యమ రూపంలో  ముందుకు వచ్చింది. మిగిలిన సిఫారసులను పార్టీలు ప్రభుత్వాలు పట్టించుకోలేదు. బీసీల అభివృద్ధికై మండల్​ రిపోర్టు ఒక బీసీ రాజ్యాంగంగా, బీసీల అభివృద్ధి రాజ్యాంగంగా గుర్తించడంలో తప్పేం లేదు. అంబేద్కర్ విగ్రహాల చుట్టూ దళిత చైతన్యం కొనసాగినట్టు, ఫూలే అంబేద్కర్​లతో పాటు మండల్ విగ్రహావిష్కరణతో ఓబీసీల రాజకీయ పోరాటం ముందుకు పోతుంది. దాంతోపాటు సిద్ధాంత భావజాల చర్చలు, ప్రచారాలు బీసీల సాధికారితకు తోడ్పడుతాయి. ఓబీసీల అధికారం మండల్ విగ్రహావిష్కరణతో సాధ్యమవుతుంది.

ALSO READ :సర్కారు కాలేజీల్లో బదిలీలు చేపట్టాలి

మండల్​ రిపోర్ట్​కు ఆమోదం

1990 ఆగస్టు 7న జనతాదళ్ నాయకులు, ప్రధాని వీపీ సింగ్ పార్లమెంట్ ప్రకటనతో మండల్ ప్రాధాన్యత సంతరించుకున్నది. ముఖ్యంగా మూడు దశాబ్దాలుగా సాగిన  బలమైన బీసీ ఉద్యమంలో భాగంగా 1978లో జనతా పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం బీపీ మండల్​ను  రెండో బీసీ  కమిషన్ చైర్మన్ గా ఏర్పాటు చేశారు. 1980లో మండల్ కమిషన్ రిపోర్టును ఇందిరా గాంధీ ప్రభుత్వానికి సమర్పించారు.  మండల్ గురించి చర్చించినప్పుడు ఓబీసీల రిజర్వేషన్లు గుర్తుకొస్తాయి. రాజ్యాంగం ఆర్టికల్ 340 ప్రకారం భారత ప్రభుత్వానికి వెనుకబడిన తరగతుల కమిషన్ ను ఏర్పాటు చేయుటకు అవకాశం కల్పించింది. ఈ కమిషన్ ఓబీసీలను గుర్తించడం ప్రధాన ఎజెండా. దాంతోపాటు బీసీల స్థితిగతులను అధ్యయనం చేసి వారి అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు చేయడం రెండవ ఎజెండా.

బ్యాక్​వర్డ్​ క్లాస్​ రెండో కమిషన్​..

బాబాసాహెబ్ అంబేద్కర్  ప్రతిపాదన మేరకు ఆర్టికల్ 340 ద్వారా బీసీ కమిషన్ ఏర్పాటు సుగమమైంది.1953లో మొదటి బ్యాక్​వర్డ్ క్లాస్ కమిషన్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1955లో కమిషన్ రిపోర్టు ను ప్రభుత్వానికి సమర్పించడం అయినది. కానీ 1956 లో కేంద్ర ప్రభుత్వం ఆ రిపోర్ట్ ను తిరస్కరించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కమిషన్ వేస్తూ నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఇవ్వడం జరిగింది. దాదాపు పది, పదిహేను కమిషన్లు రాష్ట్రస్థాయిలో రిపోర్టులు సమర్పించినప్పటికీ కోర్టులు కొట్టేయడం జరిగింది. ముఖ్యంగా డేటాను ప్రశ్నించడం, రిపోర్టులు సైంటిఫిక్ గా లేవని కోర్టులో కొట్టేయబడినాయి. దేశస్థాయిలో వెనకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటుకు ఉద్యమం జరిగింది. అందులో భాగంగా రెండో బ్యాక్​వర్డ్ క్లాస్ కమిషన్ అయిన మండల కమిషన్ ను ఏర్పాటు చేసినారు. 1980 లో కమిషన్ రిపోర్టు సమర్పించినా 1990లో రిపోర్టును అమలుకై జనతాదళ్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఓబీసీ రిజర్వేషన్ల అమలు ప్రకటన చేయడమైనది.

- ప్రొ. ఎస్. సింహాద్రి, అధ్యక్షుడు, సమాజ్​వాది పార్టీ, తెలంగాణ