పగ్గాలు చేపట్టడానికి రాహుల్ గాంధీకి ఇదే మంచి టైమ్

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మోడీ ప్రభుత్వ వైఫల్యాన్ని బహిర్గతం చేస్తూ, మొత్తం ప్రతిపక్షాలతో కలిసి ముందుకు నడవాల్సిన సమయంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. డీ ఫాక్టో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ ఇప్పటికీ పార్టీ పగ్గాలు చేపట్టడానికి సిద్ధంగా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తలు ఏ మార్గంలో నడవాలో తెలియక అచేతనంగా ఉండిపోయారు. పార్టీ పూర్తిగా గందరగోళంలో ఉన్నందున ఎలాంటి కదలికా కనిపించడం లేదు. హైకమాండ్​ చురుగ్గా లేకపోవడంతో రాజకీయ భవిష్యత్తు గురించి అనిశ్చితంగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు వేరే దారులు చూసుకుంటున్నారు. మరోవైపు, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్టీలో పాతుకుపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాలను శాశ్వతంగా కోల్పోతామన్న భయంతో హైకమాండ్ తమకు ఇబ్బందులు కలిగించదని వారు నమ్మకంతో ఉన్నారు. రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్‌‌గఢ్​ సీఎంలు రాహుల్ ను మించి శక్తివంతమయ్యారు.

మునుపెన్నడూ లేని విధంగా 135 ఏండ్ల ఘన చరిత్ర కలిగిన గ్రాండ్​ ఓల్డ్​ పార్టీ పునాదులు ఇప్పుడు కదిలిపోతున్నాయి. గాంధీ–నెహ్రూ వారసులు పార్టీని కాపాడేందుకు ముందుకొచ్చినా ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. గులాం నబీ ఆజాద్​ నేతృత్వంలోని జీ–25 లీడర్లు పార్టీ నాయకత్వ సమస్యను ఓపెన్​గానే లేవనెత్తారు. అయితే వారు తప్ప ఇంకెవరూ వారితో కలిసేందుకు ముందుకు రాలేదు. పార్టీలోని ప్రస్తుత స్థితితో విసిగిపోయిన మనీష్ తివారీ, శశి థరూర్, ముకుల్ వాస్నిక్, ఆనంద్ శర్మ, కపిల్ సిబల్.. పార్టీ హైకమాండ్‌‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు వస్తుందని, మరింత మంది తమను అనుసరిస్తారని భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. నెహ్రూ–గాంధీ వారసులు లేకుంటే భవిష్యత్తు లేదని పార్టీ నమ్ముతోంది.

రాహుల్​పైనే ఆధారపడిన కాంగ్రెస్
కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టడానికి సోనియాగాంధీని ఒప్పించడానికి పార్టీకి ఏడు సంవత్సరాలు పట్టింది. 1991లో రాజీవ్ గాంధీ హత్య జరిగితే 1998లో సోనియా పార్టీ పగ్గాలు అందుకున్నారు. ఇప్పుడు మరోసారి రాహుల్ గాంధీ మనసు మారుతుందని పార్టీ వేచి చూస్తోంది. గతంలో కూడా కాంగ్రెస్​ రాహుల్​ కోసం ఎదురుచూసింది. 2013లో కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా ఉండటానికి రాహుల్ ​అంగీకరించారు. చివరికి 2017లో రాహుల్​ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. కానీ 2019 లోక్​సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఇప్పుడు మళ్లీ పార్టీ అధ్యక్షుడిని చేసేందుకు ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీజేపీ పప్పు అని గేలిచేస్తున్నా.. కాంగ్రెస్ పూర్తిగా రాహుల్ పై ఆధారపడింది. అయితే, రాహుల్​ అద్భుతాలు చేస్తాడని, ప్రస్తుతం దేశాన్ని నడుపుతున్న వారి కంటే కరోనా పరిస్థితిని బాగా హ్యాండిల్​ చేయగలరని విశ్వసిస్తోంది. అవసరమైన అదృశ్యమయ్యే వ్యూహాత్మక మనుషుల కంటే సంక్షోభం చెలరేగినప్పుడు ముందంజలో ఉండే పప్పులనే ప్రజలు ఇష్టపడతారని ఆ పార్టీ నమ్ముతోంది.

అంతర్గత వ్యవహారాలపై దృష్టి పెట్టాలి
పార్టీ అంతర్గత వివాదాలపై రాహుల్​ దృష్టి పెట్టడానికి ఇదే సరైన సమయం. పార్టీలో అంతర్గత విభేదాలకు ఒకేసారి చెక్​ పెట్టాలి. పార్టీ ఫిరాయించిన జ్యోతిరాధిత్య సింధియా లాంటి వారితో వ్యవహరించేటప్పుడు రాహుల్​ క్యారెట్​ అండ్​ స్టిక్​ విధానాన్ని అనుసరించాలి. సింధియా మధ్యప్రదేశ్​లో పార్టీని దెబ్బతీసేందుకు ఎలా ప్రయత్నించారో.. కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను లాక్కుని ప్రజలు ఎన్నుకున్న కమల్​నాథ్​ ప్రభుత్వాన్ని ఎలా కూల్చేశారో రాహుల్​కు తెలుసు. అందరూ సింధియా లాంటి వారే ఉండరు. అధికారాన్ని వెతుక్కుంటూ వేరే పార్టీలోకి వెళ్లేందుకు అందరూ రెడీగా ఉండరు. రాజేశ్​ పైలట్​ కొడుకు సచిన్​ పైలట్​ కొన్నేండ్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ గాంధీల నుంచి స్పష్టమైన హామీ వచ్చినా.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్‌‌పై పైలట్​ ఇచ్చిన ఫిర్యాదులు ఇంకా పరిష్కారం కాలేదు. పార్టీలో సరైన ప్లేస్​లో ఉండటానికి పైలట్​ ఇంకా వేచి చూస్తున్నాడు. పైలట్​కూడా ముఖ్యమంత్రిపై తిరుగుబాటు చేయడం ద్వారా రాజకీయ సంక్షోభం ఏర్పడే పరిస్థితులకు కారణమై తన ఉప ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్, ఆయన ప్రత్యర్థి నవజోత్ సింగ్ సిద్ధు మధ్య వివాదం కూడా ఓపెన్​గానే ఉంది. ఇలాంటి వివాదాల వల్ల ప్రత్యర్థులు మాత్రమే లబ్ధి పొందారు.

బీజేపీ ప్రయత్నాలను అడ్డుకోవాలి
ఏ సీనియర్ కాంగ్రెస్ నాయకుడైనా పార్టీలోకి వస్తే చేర్చుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. ఇలాంటి చర్యలను కాంగ్రెస్ నాయకత్వం మొగ్గలోనే తుంచేయాలి. ఎందుకంటే కాంగ్రెస్‌‌లో చాలా మంది జతిన్ ప్రసాదాలు, సింధియాలు ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో వారు గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నాయకులను ఎలా సర్దుబాటు చేసుకోవాలనే పట్టింపు బీజేపీకి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పట్టు కోల్పోవడమే వారి అంతిమ లక్ష్యం. వాస్తవానికి, ఎవరూ పక్కన లేని స్థాయికి రాహుల్ ను దిగజార్చడమే బీజేపీ ఏకైక ఎజెండా. పప్పు అంటూ నిరంతరాయంగా వ్యతిరేక ప్రచారం చేయడం ద్వారా గాంధీ వారసుల విశ్వసనీయతను తగ్గించడంలో వారు సక్సెస్​ అయ్యారు. మునిగిపోయే ఓడ నుంచి జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్న సొంత పార్టీ నేతలను కాసేపు పక్కన పెట్టండి.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్​తో చేతులు కలపాలా? వద్దా? అనే విషయంలో కాంగ్రెస్​ మిత్ర పక్షాలే స్పష్టతతో లేవు. 

కాంగ్రెస్​ లేకుండా థర్డ్​ ఫ్రంట్​ వైపు అడుగులు
కాంగ్రెస్ పార్టీని పక్కనపెట్టి సొంతంగా మెజారిటీని సాధించడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల ఎన్‌‌సీపీ చీఫ్​ శరద్ పవార్ ఇంట్లో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ మినహా ఇతర పార్టీల నాయకులను ఆహ్వానించారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో మమతాబెనర్జీ విజయంలో కీలకపాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్, కేంద్రంలో, రాష్ట్రాల్లో బీజేపీని ఓడించడానికి లౌకిక నాయకులను ఏకతాటిపైకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా థర్డ్ ఫ్రంట్​ను ఏర్పాటు చేయడం.. తద్వారా రాహుల్ తప్ప ఎవరినైనా తమ నాయకుడిగా, భవిష్యత్​ ప్రధానిగా చేయడం వీరి ఉద్దేశం. అయితే, తమ సహాయం లేకుండా ప్రతిపక్షాలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టమని కాంగ్రెస్‌‌కు తెలుసు. ఇక్కడ మళ్లీ, కాంగ్రెస్​ను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీని కోసం రాహుల్ గాంధీ మాత్రమే పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం తీసుకురాగలరు. కాంగ్రెస్ లో పునరుజ్జీవం నింపలేకపోయినా, కొన్ని రాష్ట్రాల్లో బీజేపీని ఓడించలేకపోయినా, జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించే లక్ష్యం ఎప్పటికీ నెరవేరదు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్​లను ఉదాహరణగా తీసుకుంటే ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య స్ట్రయిట్​ ఫైట్​ ఉంది. ఉత్తరప్రదేశ్‌‌లో మాత్రమే ఎస్పీ, బీఎస్పీ కూడా అక్కడ ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి పెట్టాయి. 

ప్రధాని మోడీ కంటే, రాహుల్ భుజాలపైనే కాంగ్రెస్ భవిష్యత్తు, యూపీఏ అవకాశాలు, లక్షలాది మంది భారతీయుల ఆశలు ఉన్నాయి. ప్రజాస్వామ్య దేశం కావడంతో ప్రతి భారతీయుడు తన ఇష్టానుసారం ఓటు వేయాలనుకుంటారు. కానీ, బీజేపీకి ప్రత్యామ్నాయం లేకపోతే, వారు ఒకే పార్టీకి ఓటు వేయవలసి వస్తుంది. బీజేపీ కూడా మంచి ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటుంది. ఇది పూర్తిగా భిన్నమైన విషయం అయినప్పటికీ, రాహుల్ నోరు తెరిచినప్పుడల్లా, మొత్తం మోడీ కేబినెట్ ఆయనపై ఎటాక్​ చేయడానికి ముందుకొస్తుంది. అప్పుడు కూడా అతను నిజంగా పప్పేనా?

నెహ్రూ–గాంధీ కుటుంబంతోనే మనుగడ
నెహ్రూ-గాంధీ వారసులు లేకుండా కాంగ్రెస్ మనుగడ సాగించలేదనే నమ్మకానికి వచ్చినందున, పార్టీ నాయకులంతా కలిసి రాహుల్ గాంధీని బలోపేతం చేయడం మంచిది. మొట్టమొదటగా, తనను తాను కాంగ్రెస్ అధ్యక్షుడిగా అంగీకరించడం ద్వారా పార్టీ పగ్గాలు చేపట్టాలని ఆయనను ఒప్పించాలి. తన బాధ్యతను వదిలేసి, పార్టీని విడిచిపెట్టి తన పార్టీ కార్యకర్తలను ఎంతకాలం మోసం చేయగలరు? వాస్తవానికి, గత రెండేండ్లుగా ఇదే జరుగుతోంది. 2019లో ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలగడమే, జీ-23 నాయకులు గాంధీలకు లెటర్​ రాయడానికి బలమైన కారణం. రాహుల్ వైఖరి కారణంగా ఇప్పటివరకు మోడీ ప్రభుత్వం డౌన్​ ట్రెండ్​ను చూస్తామనే నమ్మకంతో ఉన్న ప్రజల ఉత్సుకతను తగ్గించేస్తోంది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్​ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వేగంగా వస్తున్నప్పుడు అందరూ కలిసి ముందుకు నడవాలి. 

- అనితా సలుజా, సీనియర్​ జర్నలిస్ట్, పొలిటికల్​ కామెంటేటర్, న్యూఢిల్లీ