భారతదేశ అత్యున్నత శాసన వ్యవస్థ పార్లమెంట్. రాజ్యసభ, లోక్‌సభ, రాష్ట్రపతులతో కూడిన పార్లమెంట్ దేశ పరిపాలనకు అవసరమైన శాసనాలు రూపొందిస్తుంది. బ్రిటన్ పార్లమెంట్ ప్రభావితమై 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన ద్విసభా విధానం కాలక్రమంలో శాసన వ్యవస్థగా రూపొందింది. మన దేశం పార్లమెంటరీ విధానాన్ని అనుసరిస్తున్నందున కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు శాసన వ్యవస్థకు సమష్టి బాధ్యత వహిస్తున్నాయి.
ప్రశ్నలు, తీర్మానాలు, ఆర్థికపర అంశాల ద్వారా పార్లమెంట్ ప్రభుత్వాన్ని అదుపు చేస్తుంది. మన పార్లమెంట్ బ్రిటీష్ పార్లమెంట్ మాదిరిగా సార్వభౌమాధికార సంస్థ కాకపోయినా రాజ్యాంగ సవరణలతోపాటు అన్ని రకాలైన శాసనాలను రూపొందిస్తుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటుంది. ఉన్నత పదవుల్లోని వారిపై వచ్చే ఆరోపణలు విచారించి న్యాయపరమైన అధికారాలను నిర్వహించడంలో భారత పార్లమెంట్ కూడా ప్రాధాన్యం సంతరించుకుంటుంది.
రాజ్యసభతో పోల్చినప్పుడు లోక్‌సభ ఎక్కువ అధికారాలు, ప్రాధాన్యతనూ కలిగి ఉన్నది. లోక్‌సభ భారత ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా పేర్కొనే లోక్‌సభ అనేక విషయాల్లో ప్రాధాన్యతను మాత్రమే కాకుండా ఆధిక్యతనూ కలిగి ఉన్నది.
కేంద్ర మంత్రిమండలి విషయంలో
కేంద్రంలో మంత్రి మండలిని ఏర్పాటు చేయాలంటే లోక్‌సభలో మెజార్టీ సాధించిన పార్టీకి మాత్రమే అవకాశం ఉంది. ఆర్టికల్ 75(3) ప్రకారం కేంద్ర మంత్రి మండలి లోక్‌సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రిమండలిపై లోక్‌సభ అదుపును కలిగి ఉంటుంది. అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించవచ్చు. ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన అధికార బిల్లులు, తీర్మానాలు వీగిపోయినప్పుడు ప్రభుత్వం రాజీనామా చేయాలి. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లులు, తీర్మానాలు నెగ్గినప్పుడు ప్రభుత్వం రాజీనామా చేయాలి. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరించి మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులోనూ పని విధానంలోనూ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించడంలోనూ లోక్‌సభ కీలకపాత్రను పోషిస్తుంది. అంటే కేంద్ర మంత్రి మండలి భవిష్యత్తును నిర్ణయించేది లోక్‌సభ మాత్రమే.
ఆర్థిక బిల్లులు
ఒక బిల్లు ఆర్థికమైనది, కానిది లోక్‌సభ స్పీకర్ నిర్ణయిస్తారు. ఈ బిల్లులను రాష్ట్రపతి అనుమతితో మొదట లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. లోక్‌సభ ఆమోదించి పంపిన ఆర్థిక బిల్లులపై రాజ్యసభ 14 రోజుల్లోగా నిర్ణయం తెలుపాలి. లేకపోతే ఆమోదించినట్లుగానే పరిగణిస్తారు. లోక్‌సభ పంపిన బిల్లులను రాజ్యసభ తిరస్కరించినా సవరణలు చేసినా ఆ బిల్లులు తిరిగి లోక్‌సభ పరిశీలనకు వెళ్తాయి. రాజ్యసభ తిరస్కరించి పంపిన ఆర్థిక బిల్లులను సవరణలతో గానీ సవరణలు లేకుండా గానీ లోక్‌సభ రెండోసారి ఆమోదిస్తే రాజ్యసభ పరిశీలనకు పంపకుండానే లేక ఆమోదంతో నిమిత్తం లేకుండానే రాష్ట్రపతి ఆమోదానికి పంపవచ్చు. ఆర్థిక బిల్లుల విషయంలో వీటో చేసే అధికారం రాష్ట్రపతికి కూడా లేదు. అందువల్ల ఆర్థిక బిల్లుల విషయంలో లోక్‌సభ తిరుగులేని ఆధిక్యతను కలిగి ఉంటుంది.
సాధారణ బిల్లులు
సాధారణ బిల్లులు ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. లోక్‌సభ ఆమోదించి పంపిన బిల్లులను రాజ్యసభ తిరస్కరించినా సవరణలు సూచించినా ఆరు నెలల్లోగా ఎలాంటి నిర్ణయం తెలుపకపోయినా ఉభయసభల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తినట్లుగా భావిస్తారు. సాధారణ బిల్లులపై ఉభయ సభల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు రాష్ట్రపతి 108వ అధికరణ ద్వారా సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశానికి లోక్‌సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. సంయుక్త సమావేశంలో జరిపే ఓటింగ్‌ను అనుసరించి బిల్లు భవిష్యత్తును నిర్ణయిస్తారు. లోక్‌సభ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల లోక్‌సభ అభిప్రాయమే నెగ్గుతుంది. ఉభయ సభల సంయుక్త సమావేశంలో జరిపే ఓటింగ్‌లో బిల్లు నెగ్గినా, ఓడినా ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఓటింగ్‌లో బిల్లు ఓడిపోయినట్లయితే ఆ బిల్లు వీగిపోతుంది.
రాజ్యసభ ఆవశ్యకత ఉన్నదా?
లోక్‌సభతో పోల్చినప్పుడు రాజ్యసభ ప్రాధాన్యత తక్కువ అనే భావన సహజంగానే చర్చనీయాంశం. ప్రభుత్వాల నిర్మాణం ప్రభుత్వాల అదుపు, తొలగింపులు పూర్తిగా లోక్‌సభలో మెజార్టీపైనే ఆధారపడి ఉంటుంది అనే అంశం వాస్తవం. ఆర్థికాంశాలపై లోక్‌సభకు తిరుగులేని అధికారం ఉన్నది. అంటే సమాఖ్య లక్షణాలను కలిగి ఉన్న మన దేశ పార్లమెంట్‌లోని ఎగువసభ అయిన రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించడం ద్వారా రాష్ట్రాల హక్కులను సంరక్షణకు తోడ్పడుతుందని గోపాలస్వామి అయ్యంగార్ అభిప్రాయపడ్డారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర జాబితాలోని ఐదు అంశాలను తొలగించి ఉమ్మడి జాబితాలో చేర్చిన సందర్భంలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ రాష్ట్రాల హక్కులను కాపాడటం ఆ రాజ్యాంగ సవరణను నిరోధించలేదని విమర్శ ఉంది.
రాష్ట్రపతి భారతదేశంలో ఎలాంటి జాతీయ అత్యవసర పరిస్థితి విధించాలనుకున్నప్పుడు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. ఒకవేళ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన సమయంలో లోక్‌సభ రద్దయి ఉన్నట్లయితే రాజ్యసభ ఆమోదం తప్పనిసరి అయినందున రాజ్యాంగ సంక్షోభం రాకుండా రాజ్యసభ సంరక్షణ చేస్తుంది.
దేశంలో నూతన అఖిల భారత సర్వీసుల ఏర్పాటుకు 312 అధికరణ ప్రకారం రాజ్యసభ ప్రత్యేక తీర్మానం తప్పనిసరవుతుంది.
చాలా బిల్లులను రాజ్యసభ ఆమోదించిన తర్వాతనే లోక్‌సభ ఆ బిల్లులు ఆమోదించడం గమనించదగిన అంశం. 21వ రాజ్యాంగ సవరణ బిల్లు, 40వ రాజ్యాంగ సవరణ బిల్లు, హిందూ వారసత్వ చట్టాల బిల్లు, కనీస వేతనాల చట్టాల బిల్లులు.
మన దేశంలో నేటివరకూ జరిగిన సంయుక్త సమావేశాలు
1. 1961లో వరకట్న నిషేధపు బిల్లును లోక్‌సభలో ఆమోదించి, రాజ్యసభలో తిరస్కరించడం వల్ల ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
2. 1978లో బ్యాంకింగ్ సర్వీసుల నిబంధనల చట్టాన్ని ఆమోదించి రాజ్యసభ తిరస్కరించడం వల్ల ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
3. 2002లో పోటా చట్టాన్ని లోక్‌సభ ఆమోదించి రాజ్యసభ తిరస్కరించడం వల్ల ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ మూడు బిల్లులను కూడా పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశాల్లో ఆమోదించడం ద్వారా అవి చట్టాలుగా మారాయి. అంటే ఈ మూడు సందర్భాల్లోనూ లోక్‌సభ అభిప్రాయమే నెగ్గింది. ఈ మూడు సందర్భాల్లోనూ బిల్లులకు అనుకూలంగా అటల్ బిహారీ వాజ్‌పేయి ఓటేశారు.
జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు
44వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్‌సభకు ఒక ప్రత్యేక అధికారాన్ని కల్పించా రు. దీని ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేయాలంటే లోక్‌సభ ఒక సాధారణ తీర్మానాన్ని ఆమోదించాలి. అలాగే, జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేయాలని కోరుతూ లోక్‌సభలోని 1/10వ వంతు సభ్యులు ఒక తీర్మాన నోటీసును లోక్‌సభ స్పీకర్‌కు లేదా రాష్ట్ర పతికి సమర్పించవచ్చు. 14 రోజుల్లోగా లోక్‌సభ ఈ అంశాన్ని చర్చించి సాధారణ మెజార్టీతో తీర్మానం ఆమోదిస్తే అత్యవసర పరిస్థితి రద్దు చేస్తారు. అందువల్ల జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు విషయంలో లోక్‌సభ ప్రత్యేక అధికారాన్ని కలిగి ఉంటుంది.