బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే.. కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ ఎక్కువ బాధపడ్తున్నరని విమర్శ : కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొలువుల జాతర కాదని.. కొలువుల కుంభమేళా జరుగుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. నియోజకవర్గాల్లో కోచింగ్ సెంటర్లు పెడుదామని.. ఇందుకు ఎమ్మెల్యేలంతా ముందుకు రావాలని కోరారు. సీఎం కేసీఆర్ భారీ సంఖ్యలో 90 వేల ఉద్యోగాల ప్రకటన చేయడం చరిత్రగా పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రెండు ప్రధాన పక్షాలకు చదువు రాదేమోనన్నారు. సీఎం ప్రకటనపై అందరు హర్షం వ్యక్తం చేస్తుంటే.. నమ్మకం లేదు అని మాట్లాడుతున్నరని మండిపడ్డారు. కేంద్రం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తమని చెప్పిందని, దీనిపై ఒక రిపోర్టర్ ప్రధానమంత్రి మోడీని ప్రశ్నిస్తే పకోడిలు వేసుకోవడం కూడా ఉద్యోగమేనని అన్నారన్నారు. తమను నమ్మని వాళ్లు 2 కోట్ల ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలన్నారు. నిరుద్యోగులకు కోచింగ్ ఇవ్వడం కోసం తమ నియోజకవర్గాల్లో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, సైదిరెడ్డిని అభినందించారు.
భట్టి వర్సెస్ కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి
‘‘బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కంటే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడే ఎక్కువ బాధపడుతున్నరు. బీజేపీ, కాంగ్రెస్ అవిభక్త కవలలుగా కనిపిస్తున్నరు. వాళ్ల అండర్ స్టాండింగ్ ఏందోమరి. హుజూరాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌లలో కలిసి పనిచేశారని బయట చాలా పుకార్లు వస్తున్నయి. దురదృష్టం ఏంటంటే ఆ పార్టీలో భట్టి విక్రమార్కది నడుస్తలేదు.. అక్కడ గట్టి అక్రమార్కులు ఉన్నరు. వాళ్లది మాత్రమే నడుస్తోంది.. ఇది దురదృష్టం” అని కేటీఆర్ అన్నారు. సభలో ఈ వ్యాఖ్యలు చేయడం ఏంటని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడితే అండగా ఉంటామని.. కానీ సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడడం సరికాదన్నారు. ఇంతలో జోక్యం చేసుకున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి కాంగ్రెస్ తీరును తప్పుబట్టారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజున రేవంత్ రెడ్డి సీఎంకు పిండం పెట్టాలనడం సంస్కారమా అని మండిపడ్డారు.