ఇదే లాస్ట్ వార్నింగ్.. బందీలు అందర్నీ వెంటనే విడిచిపెట్టండి.. హమాస్కు తేల్చిచెప్పిన ట్రంప్

ఇదే లాస్ట్ వార్నింగ్.. బందీలు అందర్నీ వెంటనే విడిచిపెట్టండి.. హమాస్కు తేల్చిచెప్పిన ట్రంప్
  • హమాస్​కు తేల్చిచెప్పిన డొనాల్డ్​ ట్రంప్
  • లేదంటే హమాస్ అడ్రస్ గల్లంతేనని హెచ్చరిక 
  • మృతదేహాలను దాచిపెట్టడమేంటని సీరియస్
  • దోహాలో హమాస్ ప్రతినిధులతో అమెరికా చర్చలు
  • ట్రంప్ హెచ్చరికలను లైట్ తీసుకున్న హమాస్

వాషింగ్టన్/ కైరో: గాజాలోని పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్​ హమాస్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మరోమారు వార్నింగ్​ ఇచ్చారు. బందీలు అందరినీ వెంటనే విడిచిపెట్టాలని అన్నారు. హమాస్ మిలిటెంట్లకు ఇదే ఆఖరి హెచ్చరిక అని, గడువులోపు బందీలను విడిచిపెట్టకుంటే హమాస్ అంతుచూస్తానని చెప్పారు. హమాస్ ను మట్టుబెట్టేందుకు ఇజ్రాయెల్ కు అవసరమైన అన్ని రకాల సాయాన్ని అందిస్తామని ట్రంప్​ స్పష్టం చేశారు. ఈమేరకు మంగళవారం (అమెరికా టైమ్) సాయంత్రం ట్రంప్ ఓ ప్రకటన విడుదల చేశారు. 

ఇందులో హమాస్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారే మృతదేహాలను దాచిపెట్టుకోవడం వంటి పనులు చేస్తారని, హమాస్ మిలిటెంట్లు కూడా ఇదే తరహాకు చెందిన వారని విమర్శించారు. వెంటనే 35 మృతదేహాలను ఇజ్రాయెల్​ కు అప్పగించాలని హమాస్ కు సూచించారు. తమ ఆఖరు హెచ్చరికను కూడా బేఖాతరు చేయడమంటే అంతాన్ని కొని తెచ్చుకోవడమేనని ట్రంప్ చెప్పారు. హమాస్ మిలిటెంట్ల చెర నుంచి ఇటీవల విడుదలైన ఎనిమిది మంది పౌరులతో ట్రంప్ మంగళవారం భేటీ అయ్యారు. వారిని వైట్​హౌస్​కు పిలిపించుకుని హమాస్ వ్యవహరించిన తీరును, బందీలుగా ఉన్న సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా తమను చెర నుంచి తప్పించడంలో అమెరికా ప్రభుత్వం, ట్రంప్​, అధికారులు చేసిన కృషికి వారు కృతజ్ఞతలు తెలిపారు. హమాస్ చెరలో ఉన్న మిగతా 59 మంది బందీలనూ విడిపించాలని వారు ట్రంప్​ కు విజ్ఞప్తి చేశారు. అనంతరం ట్రంప్​ మాట్లాడుతూ.. వెంటనే బందీలు అందరినీ విడిచిపెట్టాలంటూ హమాస్ కు లాస్ట్ వార్నింగ్​ ఇచ్చారు. అదే సమయంలో హమాస్ ప్రతినిధులతో అమెరికా డైరెక్ట్ గా చర్చలు జరుపుతోందని వైట్ హౌస్ అంగీకరించింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల 1 తో ముగియగా దానిని పునరుద్ధరించేందుకు హమాస్ ముందుకు రాకపోవడంతో సందిగ్ధం నెలకొంది. ఈ పరిస్థితుల్లో హమాస్ తో అమెరికా నేరుగా చర్చలు జరుపుతోంది. 

బందీలను విడిచిపెట్టడం సహా ఇతరత్రా అంశాలపై ఖతార్ రాజధాని దోహాలో ఈ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రపంచంలోని ఎలాంటి మిలిటెంట్, టెర్రర్ గ్రూపులతో నేరుగా చర్చలు జరపకూడదని అమెరికా గతంలో నిర్దేశించుకుంది. 1997లో హమాస్ ను టెర్రర్ గ్రూప్ గా అమెరికా గుర్తించి బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ నియమాన్ని పక్కన పెట్టి మరీ హమాస్ తో చర్చలు జరుపుతోంది. ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయని, ఈ చర్చల్లోనూ బందీలను బేషరతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేస్తున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. 

దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించిన వైట్ హౌస్​ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లియావిట్.. హమాస్​తో చర్చలకు ప్రెసిడెంట్ ట్రంప్ ఆమోదం ఉందని నిర్ధారించారు. బందీలకు సంబంధించిన వ్యవహారాల కోసం ప్రెసిడెంట్ ట్రంప్ ప్రత్యేకంగా నియమించిన ఆడమ్ బోహ్లర్ నేతృత్వంలో కిందటి నెలలోనే చర్చలు మొదలయ్యాయని చెప్పారు. ఇప్పటి వరకూ ఈ చర్చల్లో పెద్దగా పురోగతి కనిపించలేదు.. అయితే, హమాస్ తో చర్చలకు ముందుకు రావడమే గొప్ప సంకేతమని అమెరికా అధికారి ఒకరు పేర్కొన్నారు.

ట్రంప్ వార్నింగ్​ను లెక్క చేయని హమాస్

బందీలను విడిచిపెట్టాలంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికను హమాస్ పట్టించుకోలేదు. బందీలను విడిచిపెట్టాలంటే గాజాపై యుద్ధాన్ని ఆపేయడంతో పాటు కాల్పుల విరమణ, గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను వెనక్కి పిలిపించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈమేరకు హమాస్ అధికార ప్రతినిధి అబ్దెల్ లతీఫ్​ అల్​ ఖనౌవా తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. జనవరిలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నుంచి అమెరికా, ఇజ్రాయెల్​ వెనక్కి తగ్గుతున్నట్లు ఖనౌవా ఆరోపించారు. రెండో దశ చర్చలు జరపాల్సి ఉందని, అయితే, ఇజ్రాయెల్ తమ డిమాండ్లకు అంగీకరించకపోవడంతో చర్చలు ముందుకు సాగడంలేదని చెప్పారు.