హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వ పథకాలు, సాధించిన విజయాలను ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా ప్రింట్ అవుతున్న ‘తెలంగాణ మాస పత్రిక’ సమాచార శాఖ ఆఫీసు గడప దాటడం లేదు. వేలాది కాపీలను గ్లేజ్డ్ పేపర్‌పై అందంగా ముద్రించి మూలకేస్తున్నారు. కోట్లు ఖర్చు చేసి ప్రింట్ చేస్తున్న ఈ పత్రిక క్షేత్రస్థాయిలోకి వెళ్లడం లేదనే ఆరోపణలున్నాయి. గతేడాది డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు దీరింది. ఈ మేరకు పలు కొత్త పథకాలను ఇప్పటికే ప్రవేశపెట్టింది.
మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్, మహిళా సంఘాలకు రుణాలు.. ఇలా అనేక పథకాలను ప్రవేశపెట్టింది. వాటికి సంబంధించిన వివరాలను తెలంగాణ మాస పత్రికలో ముద్రిస్తున్నారు. తెలంగాణ సాధించిన విజయాలను అందులో పేర్కొంటున్నారు. ప్రతి నెలా 24 వేల కాపీలను ప్రభుత్వ సమాచార శాఖ ప్రింట్ చేస్తున్నది. ఇందులో 20 వేల కాపీలు తెలుగులో, 4 వేల కాపీలు ఉర్దూ భాషలో ప్రింట్ చేస్తున్నది. వీటిని లైబ్రరీలకు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు, ప్రభుత్వ కార్యాలయాలకు పంపాల్సి ఉంటుంది. ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు
తెలంగాణ మాస పత్రిక పూర్తి స్థాయిలో ప్రజలకు చేరడంలేదు. సమాచార శాఖ పట్టించుకోకపోవడంతో తెలంగాణ మాస పత్రిక బండిళ్లను ఎక్కడపడితే అక్కడ ఓ మూలన పడేస్తుండటం విస్మయం కలిగిస్తున్నది. ప్రభుత్వ పథకాలు, సర్కారు ఇచ్చే గణాంకాలు తెలంగాణ మాస పత్రికలో ఉంటాయి. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఉపయుక్తంగా ఉంటాయి.
స్పందించిన మంత్రి పొంగులేటి
తెలంగాణ మాస పత్రిక అన్ని చోట్లకు వెళ్లడం లేదంటూ వీ6 డిజిటల్‌లో వచ్చిన కథనంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పదించారు. దీనిపై వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
డీపీఆర్వో ఆఫీసుల్లోనే కుప్పలు తెప్పలు
తెలంగాణ మాస పత్రికను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సమాచార పౌరసంబంధాల శాఖ విఫలమైందనే వాదన వినిపిస్తున్నది. కొన్ని కాపీలు జిల్లాలకు హైదరాబాద్ నుంచి వెళ్తున్నా.. అవి క్షేత్ర స్థాయికి చేరడంలేదు. డీపీఆర్వో ఆఫీసుల్లో కుప్పలు తెప్పలుగా పడి ఉంటున్నాయి. ఆ తర్వాత స్క్రాప్ రూమ్‌లోకి వెళ్లిపోతున్నాయి. సెక్రటేరియట్ నుంచి పంచాయతీ వరకు అన్ని ఆఫీసుల్లో ఈ పత్రిక అందుబాటులో ఉండాలి. కానీ కొన్నిచోట్లనే దర్శనమిస్తున్నది.
సచివాలయంలోని మీడియా సెంటర్లో పదుల సంఖ్యలో పుస్తకాలు పేరుకు పోవడం గమనార్హం. అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బుక్ స్టాళ్ల యజమానులు తెలంగాణ మాస పత్రికలను జిరాక్స్ తీసి రూ. 40 చొప్పున విక్రయిస్తున్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే వారు వాటిని కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ఈ పుస్తకాన్ని రూ. 20 చొప్పున అందిస్తున్నది.