ఇదే కరెక్ట్​ టైమ్.. ఇన్వెస్టర్లకు ప్రధాని మోడీ కీలక పిలుపు

ఇదే కరెక్ట్​ టైమ్.. ఇన్వెస్టర్లకు ప్రధాని మోడీ కీలక పిలుపు

న్యూఢిల్లీ: ఇండియాలో పెట్టుబడులకు ఇదే మంచి టైమ్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అన్ని రంగాల్లో ఇన్వెస్ట్​మెంట్లకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. టెక్నాలజీ, ఇన్వెస్ట్​మెంట్, ఇన్నొవేషన్, గ్రీన్ గ్రోత్, సెక్యూరిటీ, స్కిల్, మొబిలిటీ సెక్టార్లకు సంబంధించిన ఇన్వెస్ట్​మెంట్ బ్లూ ప్రింట్ ఇప్పటికే సిద్ధం చేశామన్నారు. ఈ ఏడాది చివరి వరకు ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. 

యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్‌‌‌‌‌‌‌‌ డెర్‌‌‌‌‌‌‌‌ లెయెన్‌‌‌‌‌‌‌‌ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇండియాకు వచ్చారు. ఆమెతో ప్రధాని మోదీ శుక్రవారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వాణిజ్య, రాజకీయ, ఇండో, పసిఫిక్‎లో శాంతి స్థాపనతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ఇండో, పసిఫిక్ రీజియన్‎లో చేపడ్తున్న డెవలప్​మెంట్ ప్రాజెక్ట్‎లో తమ సహకారం ఉంటుందని తెలిపారు. ఇండియా, ఈయూ మధ్య పార్ట్​నర్​షిప్ ‘నేచురల్, ఆర్గానిక్’ అని చెప్పారు.

ప్రజాస్వామ్య, భాగస్వామ్య విలువలపై ఆధారపడి ముందుకెళ్తున్నదని తెలిపారు. ఈయూ తీసుకొచ్చిన కొత్త వీసా పాలసీని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఇండియాలో ఉన్న ప్రతిభావంతులైన యువత.. తమ సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎంఈఈసీ)ను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

కలిసి పని చేసేందుకు రెడీ: ఉర్సులా వాన్​డెర్

ఇండియాతో డిఫెన్స్, సెక్యూరిటీ రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్‌‌‌‌‌‌‌‌ డెర్‌‌‌‌‌‌‌‌ లెయెన్‌‌‌‌‌‌‌‌ అన్నారు. గతంలో తాము ఇలాంటి ఒప్పందాన్ని జపాన్, దక్షిణ కొరియాతో కుదుర్చుకున్నామని తెలిపారు.