
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమాన సేవలపై ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే అసహనం వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా విమానాలు నిరంతరం ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. విమానయాన సంస్థలు జవాబుదారీతనంతో వ్యవహరించాలనే చర్యలు తీసుకోవాలని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడిని కోరారు. ఈ మేరకు శనివారం ఆమె ‘ఎక్స్’ లో పోస్ట్ పెట్టారు. ‘‘ఎయిర్ ఇండియా విమానాలు నిరంతరం ఆలస్యం అవుతున్నాయి.
మేం ప్రీమియం చార్జీలు చెల్లిస్తాం. అయినప్పటికీ, విమానాలు సమయానికి చేరుకోవు. దీని కారణంగా పిల్లలు, వృద్ధులతో సహా అనేకమంది ఇబ్బందులు పడుతున్నారు. నేను ఎయిర్ఇండియాకు చెందిన ఏఐ0508 విమానంలో ప్రయాణించాను. ఈ ప్లైట్ 1.19 గంటలు ఆలస్యమైంది. ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసే ఇలాంటి ఆలస్యాలు ఆమోదనీయం కావు.
ఎయిర్ ఇండియా వంటి సంస్థలకు కఠినమైన నిబంధనలను అమలు చేయాలని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడును ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇటువంటి జాప్యాలు పునరావృతం కాకుండా ఆయా సంస్థలు బాధ్యతగా వ్యవహరించాలి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలి” అని సుప్రియా సూలే పేర్కొన్నారు.