ఢిల్లీ రాజకీయం ఎట్ల మారుతదో?

ఢిల్లీ కోటను బద్దలు కొడతాం.. ఇటీవలి కాలంలో తరచు సీఎం కేసీఆర్​ చెపుతున్న మాట ఇది. కానీ వాస్తవంలో ఢిల్లీ కోటను బద్దలు కొట్టడం సాధ్యమేనా అనేది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే ముందు కేసీఆర్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలి. ఇంట గెలిస్తేనే రచ్చ గెలిచే అవకాశం ఉంటుంది. గతంలో ములాయం, లాలూ, కరుణానిధి, ఎన్టీఆర్, చంద్రబాబు ఇలాగే ఇంట గెలిచి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్ నాయకత్వాన్ని ఇతర రాష్ట్రాల నాయకులు అంగీకరిస్తారా అనేది కూడా మరో ప్రశ్న. ఇప్పటికీ నరేంద్రమోడీ ప్రభ తగ్గలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ కోటను బద్దలు కొట్టడం అనేది కేసీఆర్​కు అంత తేలికైన విషయం కాదు. ప్రతి రాజకీయ పార్టీ ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పాలని, అన్నీ అనుకూలిస్తే ఢిల్లీపై జెండా ఎగురవేయాలని కోరుకుంటాయి. జాతీయ పార్టీల ప్రభావం తగ్గి సంకీర్ణ యుగాలు ప్రారంభమైన తరువాత ఢిల్లీ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల హవా ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో సుదీర్ఘ అనుభవం కల కొద్దిమంది రాజకీయ నాయకుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  ఒకరు. గత కొన్ని సంవత్సరాలుగా జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని ఉవ్విళ్ళూరుతున్న కేసీఆర్  మునుపెన్నడూ లేనంతగా బీజేపీపై విమర్శల దాడి తీవ్రతరం చేశారు. ఇటీవల నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగ సభలు, మీడియా సమావేశాల్లోనూ ఇదే పద్ధతిని ఫాలో అయ్యారు. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి తనతోనే సాధ్యమని చెబుతూ.. మరోవైపు రాష్ట్ర అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందనే అభిప్రాయం కలిగేలా ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి పంపారు ప్రత్యేక రాష్ట్రం సాధించాను, మళ్లీ ఆశీర్వదించి పంపితే ఢిల్లీ కోటను బద్దలు కొడతానని చెబుతున్నారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆకాంక్షను కేసీఆర్​ అప్పుడే వెల్లడించారు. కానీ 2019 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని మెజారిటీతో కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర రాజకీయాల్లో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. కానీ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ హ్యాట్రిక్ విజయం సాధించిన తర్వాత మళ్ళీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ప్రయత్నాలను మమతాబెనర్జీ, కేసీఆర్​ ముమ్మరం చేశారు.

మూడోసారి ఇంట గెలిచేనా..

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్  చక్రం తిప్పాలంటే ముందు 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలి. ఇంట గెలిస్తేనే రచ్చ గెలిచే అవకాశం రాజకీయాల్లో ఉంటుంది. గతంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ములాయంసింగ్ యాదవ్, లాలూప్రసాద్ యాదవ్, దేవగౌడ, ఎన్టీఆర్, చంద్రబాబు, కరుణానిధి లాంటి నాయకులు ఇంట గెలిచిన తర్వాతే జాతీయ రాజకీయాలను ప్రభావితం చేశారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బలహీన నాయకత్వం ఉన్న కాంగ్రెస్ పై సునాయాసంగా విజయం సాధించిన కేసీఆర్ 2023 ఎన్నికల్లో కూడా ఆ స్థాయి విజయం సాధిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాలు గెలుస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. క్షేత్రస్థాయిలో అలాంటి అనుకూలత టీఆర్ఎస్ పార్టీకి కనిపించడం లేదు. కాంగ్రెస్, బీజేపీ.. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ నాయకత్వంలో గతంలో కంటే బలం పుంజుకోవడం, ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని మూడోసారి అధికారంలోకి రావడం అంత తేలికైన విషయం కాదని కేసీఆర్​కు కూడా అర్థమైంది. కాబట్టే ప్రశాంత్ కిషోర్ లాంటి ఎన్నికల వ్యూహకర్త సహాయం తీసుకోవటంతో పాటు ఆరు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలనుకోవడం, దళితబంధుతో పాటు మరిన్ని పథకాలతో గెలిచేందుకు అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు, గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గణనీయమైన డివిజన్లలో గెలిచి బీజేపీ బలపడుతున్న సంకేతాలు,  హుజూరాబాద్ ఓటమి టీఆర్‌ఎస్‌కు రాజకీయంగా పెద్ద నష్టం చేసిందనే చెప్పాలి. ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ దే అనే స్థాయి నుంచి గెలవటానికి కష్టపడే స్థాయికి టీఆర్ఎస్ చేరుకోవటం ఆ పార్టీ భవిష్యత్తు విజయాలపై నీలినీడలు కమ్ముతున్నట్లుగానే కనపడుతోంది. 

ఢిల్లీ రాజకీయం ఎట్ల మారుతదో?

2018లో తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనతో కేసీఆర్ ఢిల్లీ రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ప్రయత్నాలు చేసినా అది ముందుకుపడలేదు. మళ్లీ పశ్చిమ బెంగాల్‌లో మమతాబెనర్జీ విజయం సాధించిన తర్వాత బీజేపీ, కాంగ్రెసేతర ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అయితే జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల కూటమి సాధ్యమేనా? ఒకవేళ సాధ్యమైతే ఎవరు ఈ కూటమిలో భాగస్వామ్యం కాబోతున్నారు అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్న అంశం. ఇప్పటికైతే ప్రతిపాదన దశలో ఉన్న ఈ కూటమిలో ఎటు చూసినా మమతా బెనర్జీ, కేసీఆర్ తప్ప మరెవరు కనిపించడం లేదు. కాంగ్రెస్ తో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ, శివసేన, డీఎంకే లాంటి పార్టీల సహకారం లేకుండా, తటస్థంగా వ్యవహరిస్తున్న బిజూ జనతాదళ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకుండా, బీహార్ లో తేజస్వి యాదవ్, ఉత్తరప్రదేశ్ లో అఖిలేశ్‌ యాదవ్ పార్టీలు బలం పుంజు కోకుండా, కేజ్రీవాల్ వైఖరి బహిర్గతం కాకుండా ప్రాంతీయ పార్టీల కూటమి ఎలా ఏర్పాటు అవుతుందనేది ఊహాజనితమైనదే. కేసీఆర్ తో పాటు వివిధ కారణాలతో బీజేపీని ఓడించాలనే ఆకాంక్ష అనేక ప్రాంతీయ పార్టీలకు ఉన్నా అది నెరవేరే చాయలు కనిపించట్లేదు. వివిధ జాతీయ ప్రసార మాధ్యమాల సర్వేల ప్రకారం యూపీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మూడో కూటమి ఏర్పాటుకు ఆదిలోనే హంస పాదు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. 

ఎవరు నాయకత్వం వహించాలి?

మూడవ కూటమి ఏర్పాటు అయితే ఎవరు నాయకత్వం వహించాలి అనేది పెద్ద సమస్య. దుందుడుకు రాజకీయాలు చేసే మమతా బెనర్జీ నాయకత్వం వహిస్తే ఆమె పొడ గిట్టని వామపక్షాల వైఖరి ఏమిటి అనేది ఒక ప్రశ్న. గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి నేషనల్ ఫ్రంట్ తరపున ఎన్టీఆర్, యునైటెడ్ ఫ్రంట్ తరపున చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్​ నుంచి 42 ఎంపీ సీట్లు ఉన్నాయి. కానీ రాష్ట్ర విభజనతో 17 లోక్‌సభ స్థానాలు కలిగిన తెలంగాణ నుంచి వచ్చిన కేసీఆర్ నాయకత్వాన్ని పెద్ద రాష్ట్రాల నాయకులు ఒప్పుకుంటారా అనేది అనుమానమే. అలాగే అందరికీ ఆమోదయోగ్యమైన సమన్వయం చేయగల నేత ఎవరనేది ముందుగా తేలినప్పుడే కూటమికి ఒక రూపం వచ్చే అవకాశం ఉంది. 

కేంద్రంతో సఖ్యతే రాష్ట్రానికి మేలు

రాష్ట్ర పాలకులు చెబుతున్నట్లు ఎంత ధనిక రాష్ట్రమైనా విభజనకు గురైన ఒక రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా, కేంద్ర గ్రాంట్లు రాకుండా రాష్ట్రం అభివృద్ధి చెందలేదు అనేది కాదనలేని వాస్తవం. విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను నెరవేర్చడానికి కేంద్రంతో కయ్యం కంటే సఖ్యతతో మెలగడమే ముఖ్యమనేది రాష్ట్ర పాలక వర్గానికి తెలియనిది కాదు. జీఎస్టీ లాంటి ఏకీకృత పన్నుల వ్యవస్థ ఏర్పాటు అయిన తరువాత రాష్ట్రాలు తమ ఆర్థిక వనరుల కోసం కేంద్రంపై ఆధారపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు, జాతీయ విద్యా సంస్థల ఏర్పాటు, రైల్వే ప్రాజెక్టుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం కాబట్టి రాజకీయ వైరుధ్యాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని పాలకులు గ్రహించాలి. 

మసక బారని మోడీ ప్రభ

2014లో మోడీ ప్రధాని పదవి చేపట్టారు. ఆయన అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేసినా పెద్దగా మోడీ చరిష్మా తగ్గలేదనే చెప్పాలి. మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ సర్వే ప్రకారంగా 72 శాతంతో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో మోడీ మొదటి స్థానంలో నిలిచారు. ఇటీవల ఇండియాటుడే– సి ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో చేసిన సర్వే ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే బీజేపీకి సీట్లు తగ్గినా 271 స్థానాలు గెలిచి సొంతంగానే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితుల దృష్ట్యా ప్రాంతీయ పార్టీలు గెలిచినా, బలం పుంజుకున్నా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలం పుంజుకోకుండా మరోసారి మోడీని అధికారంలోకి రాకుండా అడ్డుకోలేవు.