ట్రైన్ జర్నీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. తక్కువ ఖర్చులో సుదూర ప్రయాణం సుఖవంతంగా చేసేందుకు ట్రైన్ జర్నీ బెస్ట్ ఆప్షన్. రోజూ కొన్ని లక్షల మంది మన దేశంలో రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. రైలు రూపురేఖలు ఎలా ఉంటాయో, రైలు లోపల ఎలా ఉంటుందో, బయట ఎలా ఉంటుందో, రైలు బోగీ పైభాగం ఎలా ఉంటుందో చాలామంది గమనించే ఉంటారు. అయితే.. నిత్యం ట్రైన్ జర్నీ చేసిన వారికైనా రైలు గురించి అన్నీ తెలిసి ఉండాలని రూలేం లేదు. రైలుకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం.
రైలు బోగీ పైభాగంలో.. అదేనండీ రైలు బోగీ రూఫ్ పైన గుండ్రటి ఆకారంలో మూతలు అమర్చి ఉండటాన్ని ఎప్పుడైనా గమనించారా..? గమనించే ఉంటారు గానీ ఎందుకు అవి పెడతారో.. చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆ రౌండ్ షేప్లో ఉన్న మూతలు కేవలం ఏదో రైలు బోగీ పైభాగం ఆకర్షణీయంగా కనిపించడం కోసం అమర్చినవి కాదు. రైలు ప్రయాణంలో అవి కీలక పాత్ర పోషిస్తాయి. రైలు రూఫ్ పైన కనిపించే వాటిని ‘రూఫ్ వెంటిలేటర్స్’ అని అంటారు.
ఈ పేరును చదవగానే ఇవి ఎందుకు అమర్చి ఉంటారో ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. ఒక్కో రైలు బోగీలో వందల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. అంత మంది ఒక బోగీలో ఉన్నప్పుడు ఎన్ని ఫ్యాన్స్ ఉన్నా.. ఎంత కిటికీలు తీసి పెట్టుకున్నా.. వేడి, ఊపిరాడని పరిస్థితి ఉంటుంది. ప్రయాణికులకు అలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చేయడం కష్టతరంగా ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే.. ఆ బోగీల్లోనే తిరుగుతుండే గాలి బయటకు పోవాలి.
అలాంటి పరిస్థితుల్లో బోగీల్లో ఉండే ఆ వేడి గాలి ఈ రూఫ్ వెంటిలేటర్స్ నుంచి బయటకు పోతుంది. మీరు బాగా గమనిస్తే రైలులో ఫ్యాన్ దగ్గర్లోనే చిల్లుల గిన్నె మాదిరిగా ఈ రూఫ్ వెంటిలేటర్ లోపలి భాగానికి ఒక రంధ్రాలున్న ప్లేట్ కనిపిస్తుంది. ఆ రంధ్రాల నుంచి ఈ వేడి గాలి బయటకు పోతుంది. గాలి సరే.. మరి వర్షం పడినప్పుడు ఆ రూఫ్ వెంటిలేటర్స్ నుంచి వర్షం నీరు లోపలికి రాకుండా ఎలా ఉంటుంది..? అంటారా..? వర్షం కురిసినప్పుడు ఆ నీళ్లు రైలు పైభాగం నుంచి లోపలికి రాకుండా ఉండేలా ఈ రూఫ్ వెంటిలేటర్స్ డిజైన్ ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే రైలు బోగీల్లో ప్రయాణికులు ఉక్కపోతతో ఇబ్బందిపడకుండా ప్రయాణం ఎంజాయ్ చేసేందుకు రైలు బోగీల పైభాగంలో ఈ రూఫ్ వెంటిలేటర్స్ ఉంటాయి.