ఈ మామిడికి భలే డిమాండ్.. ఒక్కోటి రూ.1,000

ఈ మామిడికి భలే డిమాండ్.. ఒక్కోటి రూ.1,000

ఇండోర్: సమ్మర్‌లో మామిడి పండ్లకు చాలా డిమాండ్ ఉంటుంది. బంగినపల్లి మామిడి పండ్లకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. ఇలాంటి క్రేజ్ ఉన్న మామిడి పండ్లకు ధర ఎక్కువగా పలుకుతుంది. ఈ సీజన్‌లో నూర్జహాన్ మామిడి పండ్లకు మంచి క్రేజ్ దక్కింది. మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌‌పూర్ జిల్లాలో పండించే ఈ రకం మామిడి పండ్లకు ఒక్కొక్కటి రూ.500 నుంచి రూ.1,000 పలుకుతుండటం విశేషం. ఈ సీజన్‌లో వాతావరణపరంగా అనుకూల పరిస్థితులు ఉండటంతో పలు వైవిధ్యమైన రుచులతో కూడిన మామిడి పండ్లు మార్కెట్‌లోకి వచ్చాయి. వీటిలో నూర్జహాన్ రకం మామిడికి చాలా మంది ఫిదా అవుతున్నారు. అఫ్గానిస్థాన్‌కు చెందిన ఈ రకం మామిడిని అలీరాజ్‌పూర్‌‌ జిల్లాలోని కత్తివాడలోనే పండిస్తున్నారు. ఈ ప్రాంతం గుజరాత్ బార్డర్‌కు సమీపంలో ఉంది. రెండు నుంచి మూడున్నర కిలోల బరువుండే నూర్జహాన్ మామిడి రుచి అదరహో అని ఫ్రూట్‌లవర్స్ అంటుండగా.. వీటిని పండించడం ద్వారా మంచి లాభాలు గడిస్తున్నామని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.