వనపర్తిపై యువ నేతల గురి

వనపర్తిపై యువ నేతల గురి

వనపర్తిపై యువ నేతల గురి
వారసులను బరిలో దింపడంపై నేతల నజర్
సీనియర్లపై పెరుగుతున్న అసంతృప్తి
అసెంబ్లీ బరిలో ఆశావహులు

వనపర్తి, వెలుగు : గత కొద్ది సంవత్సరాలుగా వివిధ పార్టీల్లో పాతుకుపోయిన సీనియర్​ నేతల స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలంటూ అన్ని పార్టీల్లో డిమాండ్ వస్తోంది. ఈసారి ఓటర్లలో 50 శాతం మంది యువత ఉండడంతో కొత్త నేతలకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్​ వస్తోంది.వనపర్తిలో ఏడు సార్లు పోటీ చేసి నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన మాజీ మంత్రి, కాంగ్రెస్  సీనియర్ నేత చిన్నారెడ్డి అభ్యర్థిత్వంపై పార్టీలో వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆయన తన కుమారుడు ఆదిత్యరెడ్డిని రంగంలోకి దించే ప్రయత్నంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్  అయిన చిన్నారెడ్డికి క్రమశిక్షణ కలిగిన లీడర్ గా గుర్తింపు ఉంది. దీంతో హైకమాండ్​ ఆయనను కాదని మరొకరికి టికెట్  ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో చిన్నారెడ్డి తన వారసుడు జిల్లెల ఆదిత్యరెడ్డిని తెరపైకి తెస్తున్నారు. ఇదే పార్టీలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కె శివసేనారెడ్డి సైతం పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. వీరిద్దరిలో ఒకరు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

ఆ ముగ్గురు ఎటు వైపు..

ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన ముగ్గురు నేతలు ఏ పార్టీలో చేరాలనే విషయంపై మంతనాలు జరుపుతున్నారు. వనపర్తి జడ్పీ చైర్మన్  లోక్ నాథ్ రెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డిల్లో ఒకరు ఈ సారి అసెంబ్లీ బరిలో నిలిచే అవకాశం ఉంది. వీరు తమకు ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆపార్టీలో చేరుతామన్న కండీషన్  పెట్టారు. మొదట కాంగ్రెస్  పార్టీతో సంప్రదింపులు మొదలు పెట్టిన వీరు మాజీ మంత్రి చిన్నారెడ్డిని కలిశారు. ఆయన ఈ సారి తాను, లేదంటే తన కుమారుడు పోటీలో ఉంటాడని చెప్పడంతో సదరు నేతలు బీజేపీ వైపు అడుగులు వేశారు. గుజరాత్ లోని మోడీ సన్నిహితులతో పరిచయం ఉందని బీజేపీలో చేరితే తనకే టికెట్ వస్తుందని జడ్పీ చైర్మన్  లోక్ నాథ్ రెడ్డి సన్నిహితులతో చెబుతున్నట్లు తెలిసింది. పాత వారితో విసుగెత్తిన ఓటర్లు ఈసారి కొత్త వారికి అవకాశం ఇస్తారని లోక్ నాథ్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు.

మంత్రితో విభేదించి బీఆర్ఎస్​ను వీడిన మేఘారెడ్డి సైతం బీజేపీ లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో మంచి పట్టున్న తానే ఆ పార్టీకి గట్టి అభ్యర్థి అవుతానని, త్వరలో బీజేపీలో చేరతానని తన అనుచరులతో చెబుతున్నారు. ఇదిలాఉంటే పెద్దమందడి మండలం చిల్కటోనిపల్లి గ్రామానికి చెందిన రిటైర్ట్  ఏఎస్పీ సర్వేశ్వర్ రెడ్డి,  ఖిల్లా ఘనపురం మండలానికి చెందిన జడ్పీ మాజీ సీఈవో లక్ష్మీనారాయణ వనపర్తి నుంచి ఈసారి పోటీలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. బీజేపీలో కొన్నేండ్లుగా పని చేస్తున్న ఎన్ఆర్ఐ అనుజ్ఞారెడ్డి ఈసారి యువత కోటాలో బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. వనపర్తికి చెందిన టీచర్  చెన్నరాములు తన ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు. ఆయన బీఎస్పీ నుంచి పోటీలో ఉండేందుకు ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టారు. 

రావుల రూట్​ సపరేట్..

నియోజకవర్గ ప్రజలతో సన్నిహితంగా ఉండే టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి వ్యవహారం ఎవరికీ అర్థం కావడం లేదు. ఆయన ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. వనపర్తి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నా, ఆరోగ్య రీత్యా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే రావులను టీడీపీ నుంచి కాకుండా బీజేపీ లేదా కాంగ్రెస్  నుంచి బరిలో దించి వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డికి గట్టి పోటీ ఇవ్వాలని ఒక వర్గం భావిస్తోంది. ఇందుకోసం మూడు పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు ఏకమైతే వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డికి పరాభవం తప్పదని, రావుల రాక అనివార్యంగా మారిందని ప్రచారం చేస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఈసారి త్రిముఖ పోటీ ఉండడంతో ఎవరికి వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటీవల పలు ఆరోపణలు రావడంతో మంత్రి వాటిని సరిదిద్దే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇటీవల పెద్దమందడి మండలం వెల్టూర్ లో పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి దావత్ ఇచ్చారు. ఈసారి ఎన్నికల్లో గెలవడం అంత ఈజీ కాదన్న అభిప్రాయానికి వచ్చిన ఆయన అసంతృప్తులను మచ్చిక చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. 

యువతపైనే అన్ని పార్టీల ఫోకస్..

50 శాతానికి పైగా ఉన్న యువ ఓటర్లే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనున్నారు. వనపర్తిలోని 7 మండలాల్లో 2,46,511 ఓటర్లు ఉండగా, ఇందులో 1.25 లక్షల మంది 40 ఏళ్లలోపు వారే ఉండడంతో అన్ని పార్టీలు యూత్​ను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఇటీవల వనపర్తి పాలిటెక్నిక్  కాలేజీ ముందు ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహావిష్కరణకు అన్ని పార్టీలు తమవంతు సాయం అందించాయి. హిందువాహిని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహ ప్రతిష్ఠలో పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. యువత బీజేపీ వైపు మొగ్గు చూపకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్  నేతలు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో యువ అభ్యర్థులు, యువ ఓటర్లే కీలకంగా మారుతారనే చర్చ జరుగుతోంది.