- రేసులో ఉన్నామంటూ ప్రచారం చేసుకుంటున్న ఆశావహులు
- మరోసారి బరిలో సోయం బాపురావు
- ఆదిలాబాద్ రిమ్స్‌కు చెందిన డాక్టర్ సుమలత ప్రయత్నాలు
- సీటును కాపాడుకునేందుకు పార్టీ ప్రయత్నాలు
ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి బీజేపీలో ఈసారి పోటీ పెరిగింది. ఒకప్పుడు బీజేపీలో ఎమ్మెల్యే, ఎంపీ క్యాండిడేట్ల కోసం వెతకాల్సిన పరిస్థితి ఉంటే.. ఇప్పుడు క్యాండిడేట్లు పెరిగి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఆదిలాబాద్ చరిత్రలోనే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మొదటిసారి ఎంపీ సీటు గెలిచిన బీజేపీ.. ఆ సీటు దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల పార్లమెంట్ ఇన్చార్జీలను సైతం ప్రకటించింది. ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆదిలాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ సోయం బాపురావు మరోసారి పోటీ చేయాలని ఆశిస్తుండగా, మరికొందరు లీడర్లు టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.
కొత్త ముఖాలు
ఎంపీ టికెట్ ఆశించిన వారిలో కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి. టికెట్ మళ్లీ తనకే వస్తుందనే సోయం బాపురావు ధీమాగా ఉండగా.. మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్‌తో పాటు భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేశ్ బాబు పేర్లు సైతం వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి ముథోల్ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన రమేశ్‌బాబు అది రాకపోవడంతో బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే రామరావు పటేల్, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మద్దతుతో ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఆయన ఫ్లెక్సీలు, హోర్డింగులు దర్శనమిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ ప్రచారం జరుగుతోంది. రిమ్స్‌లో ఫిజీషియన్‌గా పనిచేస్తున్న డాక్టర్ నైతం సుమలత సైతం టికెట్ కోసం బీజేపీ లీడర్లతో టచ్‌లో ఉంటున్నారు.
గోండు తెగ నుంచి మొదటి మహిళా డాక్టర్‌గానే కాకుండా ఏజెన్సీ గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో గుర్తింపు సాధించారు. రాజకీయాలకు ఈమె కొత్తే అయినప్పటికీ ఆమె తాత మర్సుకోల కాశీరాం బోథ్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన వారసురాలిగా సుమలత ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఎమ్మెల్యేల గెలుపుతో జోష్..
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ఈసారి ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాలు ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్ లో బీజేపీ అభ్యర్థులు గెలవడంతో ఆ పార్టీలో మరింత జోష్ వచ్చింది. సిట్టింగ్ ఎంపీతోపాటు నాలుగు నియోజకవర్గాల్లో బలం పెరగడం బీజేపీకి కలిసొచ్చే అంశం. అందుకే ఎంపీ సీటు కోసం ఆశావహుల్లో పోటీ పెరిగింది. కాంగ్రెస్ సైతం పోటీలోకి దూసుకొచ్చింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఖానాపూర్ లో ఆదివాసీ లీడర్ వెడ్మ బొజ్జు పటేల్ గెలవడంతో ఆదివాసీల్లో కాంగ్రెస్ పట్టు సాధించినట్లయ్యింది. దీనికి తోడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మంత్రి సీతక్కను ఇన్చార్జిగా పార్టీ నియమించడంతో ఈసారి పార్లమెంట్ ఎన్నికలు టఫ్ కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ సైతం ఎంపీ స్థానాన్ని దక్కించుకునేందుకు పట్టుదలతో ఉంది. లోక్‌సభ స్థానం ఎస్టీ నియోజకవర్గం కావడంతో ఆదివాసీ, లంబాడా తెగలకు చెందిన లీడర్లలో ఆయా పార్టీలు ఏ వర్గానికి టికెట్ ఇస్తారో అనేది ఉత్కంఠంగా మారింది.