ఈసారి ఎల్​నినో ఆందోళన..ప్రభుత్వాలు సిద్ధమేనా?

అనేక దేశాల్లో ఆర్థిక మాంద్యం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మన దేశంలో ఆర్థిక పరిస్థితి నియంత్రణలోనే ఉందని అటు ప్రభుత్వం, ఇటు రిజర్వ్ బ్యాంకు చెబుతున్నాయి. అయితే ఆహార ధరల్లో హెచ్చు తగ్గుల గురించి స్పష్టమైన వివరణ మాత్రం ప్రజలకు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే వానాకాలంలో వర్షాభావం ఉంటుందా లేదా అనే దాని మీద భారత వాతావరణ శాఖ, అమెరికా వాతావరణ సంస్థల మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇందులో ఇమిడి ఉన్న శాస్త్రీయత, ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ లబ్ధి గురించి ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది.

1945  నుంచి

భారత వాతావరణ శాఖ(ఐఎండీ)1945 నుంచి ‘ఫార్మర్స్ వెదర్ బులెటిన్’ రూపంలో రైతులకు సాధారణ వాతావరణ సేవలను ప్రారంభించింది. అప్పట్లో, ఈ సమాచారం రేడియో ద్వారా ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేసేవారు. 1971లో జాతీయ వ్యవసాయ కమిషన్(ఎన్సీఏ) సిఫారసు మేరకు రైతుల అవసరాలకు అనుగుణంగా అగ్రోమెటరోలాజికల్ అడ్వైజరీ సర్వీసెస్(ఏఏఎస్)ను ప్రారంభించింది. 1975,-1976 లలో  నాసా, ఐఎండీ వ్యవసాయ సంస్థలతో కలిసి శాటిలైట్ ఇన్​స్ట్రక్షన్, టెలివిజన్ ఎక్స్​పర్​మెంట్(సైట్) వ్యవస్థ ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు వ్యవసాయ రంగానికి అవసరమైన వాతావరణ సమాచారం అందిస్తున్నారు. అనేక ఉపగ్రహాలు, కంప్యూటర్లు, అందరికి చేతిలో ఫోన్లు, ఇంకా వివిధ రకాల సామాగ్రి అందుబాటులోకి వచ్చాక రైతులకు వాతావరణ సమాచారం చేరవేసే మార్గాలు ఈజీ అయ్యాయి. అయినా రైతులకు ప్రాంతాల వారీగా చేరకపోవటానికి అనేక సంస్థాగత సమస్యలు, లోపాలు ఉన్నాయి. చిత్తశుద్ధి లేమి కూడా స్పష్టంగా ఉన్నది.

ఎల్​నినో అవకాశం దాదాపు70 శాతం

ఈ ఏడాది రుతుపవనాలు ఏర్పడే సందర్భంలో ఎల్ నినో వచ్చే అవకాశం దాదాపు70 శాతం ఉందని ఐఎండీ తెలిపింది. తద్వారా పరిణమించే వర్షాభావం పరిస్థితుల వల్ల వ్యవసాయం రంగం, ప్రజల ఆహారం, దేశ ఆర్థిక వ్యవస్థ మీద పడే ప్రభావం గురించి ఆందోళన వ్యక్తమవుతున్నది. 2001- నుంచి 2020 మధ్య కాలంలో భారత్ ఏడు ఎల్​నినోలను చూసింది. వీటిలో నాలుగు(2003, 2005, 2009–-10, 2015-–16) కరువులకు దారితీశాయి. ఈ నాలుగేండ్లలో వ్యవసాయ ఉత్పత్తి 16%, 8%, 10%, 3% క్షీణించి ద్రవ్యోల్బణాన్ని పెంచింది.1997లో భారతదేశం బలమైన ఎల్​నినోను ఎదుర్కొంది. అయినా ఆ ఏడాది రుతుపవనాలు సాధారణంగా ఉన్నాయని ఐఎండీ విశ్రాంత అధికారి చెప్పారు. అయితే, నాలుగు సంవత్సరాల సాధారణ రుతుపవనాల తరువాత, మళ్లీ సాధారణ సంవత్సరం రావడం కష్టం. మనం సిద్ధంగా ఉండాలి అని కూడా ఆయన అన్నారు. ఎల్​నినో ప్రభావం దాని తీవ్రతను బట్టి ఉంటుంది. ఈసారి బలహీనమైన ఎల్ నినోను అంచనా వేస్తున్నామని విశ్లేషకులు అంటున్నారు. 2014, 2018లో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. అందువల్ల, పంట ఉత్పత్తి గురించి అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు అంటున్నారు. మరి, వినియోగదారులకు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

అంచనాల్లో శాస్త్రీయత ఎంత?

వాతావరణ అంచనాల్లో శాస్త్రీయత మీద అధ్యయనాలు చేయాలి. ఈసారి ఎల్​నినో రావడం వల్ల వర్షాభావం ఎప్పటి నుంచి ఉంటుందనే విషయం మీద భారత వాతావరణ శాఖకు స్కైమేట్ సంస్థ అంచనాల మధ్య తేడా ఎందుకు వస్తున్నదో తెలుసుకోవాలి. మన దేశ పాడి పంటల ధరలు వాతావరణ పరిణామాలతో ముడిపడి ఉన్న పరిస్థితుల్లో, ఆధునిక మార్కెట్లు వాతావరణ అంచనాల్లో తమకనుగుణంగా మార్పులు చేయగలుగుతున్నాయా అనే అనుమానం వస్తుంది. వ్యవసాయం మీద, ఆహార ఉత్పత్తి మీద, ప్రజల జీవనం మీద పడే ప్రభావం ఎంత? ఇందులో ఎవరు ఏం చెబుతున్నారు? ఏం దాస్తున్నారు? వీటి మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విషయాలు తేటతెల్లం చేయాల్సిన అవసరం ఉంది. ఈ యేడు అంతర్జాతీయంగా ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఆహారం ధరలు కొన్ని దేశాల్లో ఆకాశాన్నంటాయి. ద్రవ్యోల్బణం పెరిగింది. దేశ వార్షిక ఆహార సరఫరాలో వానాకాలం పంటల వాటా దాదాపు సగం ఉంటుంది. 

వానలు లేక పంటల ఉత్పత్తి పడిపోతే ఆహారం మీద, ఆహార ధరల మీద ప్రభావం ఉంటుంది. పంటల ఉత్పత్తి ఖర్చు కూడా పెరుగుతుంది. వ్యవసాయ విద్యుత్ మీద ఒత్తిడి పెరుగుతుంది. భూగర్భ జలాల అధిక వినియోగం తప్పదు. పంటల దిగుబడి మీద కూడా ప్రభావం ఉంటుంది. గత మూడేండ్లుగా కుండపోత వర్షాలు పంటల దిగుబడిని తగ్గించాయి. ఒక అంతర్జాతీయ అంచనా ప్రకారం 2023లో వరి ఉత్పత్తి రెండు దశాబ్దాల్లో అతిపెద్ద లోటును నమోదు చేయనుంది. ఇప్పటికే బియ్యం తినే ప్రపంచవ్యాప్తంగా 3.5 బిలియన్లకు పైగా ప్రజలు అధిక ధరలను ఎదుర్కొంటున్నారు. ఆహార నిల్వలను బట్టి కూడా ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. ప్రపంచ చక్కెర వాణిజ్యం సరఫరాలకు కూడా ఎల్​నినో వల్ల ముప్పు కలుగుతుందంటున్నారు. కరువు వల్ల వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల ఆహార ధరలు పెరుగుతాయి.

ప్రభుత్వాల చర్యలు అవసరం

వ్యవసాయ రంగానికి, మొత్తం ఆర్థిక వ్యవస్థకు ఈ వర్షాలు ఎంత ముఖ్యమో పరిశీలిస్తే, ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న భారత్ కు ఎల్ నినో ఆందోళన కలిగిస్తోంది. రైతులు వాతావరణ శాఖ అంచనాలను బట్టి విత్తనాలు, ఎరువులు, రసాయనాల మీద పెట్టుబడి పెడితే, వర్షాభావం వారి పెట్టుబడులను మృగ్యం చేస్తుంది. తీవ్రంగా నష్టపోతారు. పంటల ప్రణాళికల మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు రాబోయే వానాకాలానికి తగిన వాతావరణం, మార్కెట్లు, విధానాల మీద అధ్యయనం చేసి రైతులకు తగిన సూచనలు ఇవ్వాలి. రైతులు వర్షాభావం వల్ల నష్టపోకుండా, ఆహార పంటల వైవిధ్యం గురించిన ప్రచారం ప్రభుత్వం చేయాలి. పంట ధరల హెచ్చుతగ్గుల నుంచి రైతులను రక్షించడానికి, కొత్త రకం వాతావరణ బీమా పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టవచ్చు. భూతాపాన్ని, వాతావరణ మార్పులను తట్టుకునే సహజ వ్యవసాయ పద్ధతులను ప్రభుత్వం ప్రోత్సహించాలి. దేశీయ వంగడాలు తగిన స్థాయిలో రైతులకు అందడానికి వ్యవసాయ రంగంలో మార్పులు తేవాలి. విత్తన చట్టం రైతులకు ఉపయోగకరంగా తీర్చి, విత్తన కంపెనీల ఆగడాలను అరికట్టాలి.

అంచనాలను బట్టి పెట్టుబడులు

ప్రధానంగా వాతావరణమే క్లిష్టంగా మారింది. ముందస్తు హెచ్చరికలు చేయడానికి పనికి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, సామగ్రి దేశ వ్యాప్తంగా రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించలేకపోతున్నాయి. ఏండ్ల కిందట వచ్చిన సునామి తర్వాత వాతావరణ శాఖల మధ్య సమన్వయం పెరిగింది. దురదృష్టవశాత్తు, దేశం లోపల, రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల్లో జిల్లాల స్థాయికి ఈ ప్రామాణిక వాతావరణ అంచనా సేవలు విస్తరించలేదు. వాతావరణం ఎప్పటికప్పుడు మారుతున్నది. ఒకే జిల్లాలో మండలాల మధ్య భారీ తేడా ఉంటున్నది. వాతావరణ సమాచారం, అంచనాల్లో కూడా పొరపాట్లు ఉంటున్నాయి. అసలు వాతావరణ శాఖ ప్రకటన నమ్మదగినదేనా అనే అనుమానాలు వస్తున్నాయి. వాతావరణ అంచనాల బట్టి, హెచ్చరికలను బట్టి పెట్టుబడులు ఉంటాయి. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లలో వాణిజ్యం మారుతుంది. ఎగుమతులు, దిగుమతుల ప్రణాళికలు మారుతాయి. ధరల మీద కూడా ప్రభావం ఉంటుంది. తద్వారా, ప్రభుత్వం మీద, నాయకుల మీద ఒత్తిడి పెరుగుతుంది.

విధానాలు ముఖ్యం

ఎల్​నినో ప్రభావం అనంతరం భారత దేశంలో 2023–-24లో ద్రవ్యోల్బణం 5.0 నుంచి 5.6 శాతం మధ్య ఉండొచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తాజా బులెటిన్​లో పేర్కొంది. రుతుపవనాలు జూన్-–సెప్టెంబర్ భారతీయ రైతులకు కీలకమైనవి. దాదాపు 70% వర్షాలు ఈ కాలంలో కురుస్తాయి. దేశ జీడీపీలో వర్షాధార వ్యవసాయం వాటా 20 శాతం. భారత వినియోగ ధరల సూచీ(సీపీఐ)లో ఆహార ధరల ద్రవ్యోల్బణం దాదాపు 40 శాతంగా ఉంది. 2022 డిసెంబరులో, భారతదేశ సీపీఐ ఒక సంవత్సరం కనిష్ట స్థాయి 5.72 శాతానికి పడిపోయింది. అయితే, ఇటీవల విడుదల చేసిన సమాచారం ప్రకారం రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం సెంట్రల్ బ్యాంక్ గరిష్ట పరిమితి 6% దాటవచ్చు. సరఫరాలో హెచ్చు తగ్గుల వల్ల ఆహార ధరల్లో అస్థిరత పెరుగుతుందని, ఫలితంగా ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్బీఐ అంటున్నది. ఎల్​నినో వల్ల వర్షాలు సరిగా లేకుంటే  బియ్యం, చక్కెర, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు తదితర సరుకుల ఉత్పత్తి తగ్గి కొరత ఏర్పడి వాటి ధరలు పెరుగుతాయి. ఉత్పత్తి పడిపోయినప్పుడు, అది కమోడిటీ ధరలకు ఆజ్యం పోయడమే కాకుండా, వ్యవసాయ  శ్రామికుల ఆదాయాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

- డా. దొంతి నర్సింహా రెడ్డి,పాలసీ ఎనలిస్ట్