- కాంగ్రెస్‌లో కొత్త జాబ్
- క్యాంపెయిన్ ప్రతినిధులను నియమిస్తున్న పార్టీ
- ఇయ్యాల ఇంటర్వ్యూలు.. 100 మంది దాకా రిక్రూట్
హైదరాబాద్, వెలుగు : ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్.. ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. సర్వేల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తున్న ఆ పార్టీ.. గ్రౌండ్ లెవెల్లో పార్టీకి ఉన్న పతార ఏందో కూడా తెలుసుకుంటున్నది. తాజాగా ఇప్పుడు పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు ప్రత్యేకంగా కొంతమందిని నియమించుకుంటున్నది.
ఇందుకోసం ‘క్యాంపెయిన్ ప్రతినిధులు’ పేరుతో కొత్త జాబ్ క్రియేట్ చేసింది. రాజకీయాలపై ఆసక్తి ఉన్న యువతను నియమించుకోవాలని నిర్ణయించింది. 50 నుంచి 100 మంది దాకా క్యాంపెయిన్ ప్రతినిధులను నియమించనుంది. దీనికి సంబంధించి శుక్రవారం హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఎంపికైన అభ్యర్థులకు జీతం, ఫుడ్, అకామడేషన్ కల్పించనుంది.
నేతల విజ్ఞప్తి మేరకే..
పార్టీ ప్రచార వ్యవహారాలను చూసుకునేందుకు ఇటీవల గాంధీ భవన్లో వార్ రూమ్ ఏర్పాటు చేశారు. పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు సునీల్కనుగోలు వ్యూహాలు రచిస్తున్నారు. అభ్యర్థుల కోసమంటూ ప్రత్యేకంగా ఎలాంటి వ్యూహాలు చెప్పడం లేదు. ఈ నేపథ్యంలో తమకు గ్రౌండ్ లెవెల్లో మంచి పేరు వచ్చేలా ప్రచారం చేసేందుకు ప్రతినిధులను నియమిస్తే బాగుంటుందని పలువురు నేతలు విజ్ఞప్తి చేశారని తెలిసింది. ఈ ప్రతిపాదనను పార్టీ పెద్దలకు తెలియజేయగా ఓకే అన్నారని సమాచారం. అందులో భాగంగానే ఈ క్యాంపెయిన్ప్రతినిధుల నియామకం చేపడుతున్నారని తెలుస్తున్నది.
ALSO READ : రైతుల చుట్టే రాజకీయం ..అన్ని పార్టీల చూపు రైతాంగం వైపే
వీళ్లేం చేస్తరంటే?
ఈ జాబ్ కు ఎంపికైనోళ్లు వార్‌రూమ్‌లో ఉండి అభ్యర్థుల తరఫున ప్రచార వ్యూహాలు రెడీ చేస్తారు. జనాల్లోకి వెళ్లాలంటే ఏం చేయాలి? ఏం మాట్లాడాలి? తదితర విషయాలను తెలియజేస్తారు. ప్రచారంలో భాగంగా అభ్యర్థులు మాట్లాడే స్పీచ్‌ను సోషల్‌మీడియాలో సర్క్యులేట్ చేస్తారు. అభ్యర్థులకు అవసరమైన పవర్ఫుల్ కంటెంట్ తయారు చేసిస్తారు. దాంతో పాటు కాంగ్రెస్ ప్రకటించే హామీలు, మేనిఫెస్టోపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు రూపొందిస్తారు. అవి జనానికి అర్థమయ్యేలా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తారు. కాగా, ఇలాంటోళ్లకు కచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని పార్టీ లీడర్లు చెబుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా పని చేయాలని, రాజ్యాంగంపై అవగాహన ఉండాలని పేర్కొంటున్నారు.