10th paper leak : ఈసారి హిందీ పేపర్​ లీక్.. పరీక్ష మొదలైన 30 నిమిషాలకే వాట్సప్​లో

  • ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో వైరల్
  • వరంగల్​ సీపీకి విద్యాశాఖ అధికారుల ఫిర్యాదు
  • ఫ్రెండ్​కు చిట్టీలు అందించడం కోసమే సెల్​లో ఫొటోలు: సీపీ
  • వాటిని సోషల్​ మీడియాలో షేర్​ చేసిన మైనర్
  • కమలాపూర్​ బాయ్స్​ హైస్కూల్ ​నుంచి బయటకొచ్చినట్టు వెల్లడి
  • మైనర్ సహా ఇద్దరు యువకుల అరెస్ట్..మూడు ఫోన్లు సీజ్

హనుమకొండ, వెలుగు: టెన్త్​ పరీక్షలు మొదలైన తొలి రోజే నిమిషాల వ్యవధిలోనే తెలుగు పేపర్​బయటకు రాగా.. రెండో రోజు హిందీ పేపర్​ కూడా అలాగే సోషల్​ మీడియాలో ప్రత్యక్షమైంది. మంగళవారం ఉదయం 9.30 గంటలకు పరీక్ష మొదలు కాగా అర్ధ గంటలోపే ప్రశ్నపత్రం వాట్సప్​లో చక్కర్లు కొట్టింది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్​ జిల్లాలోని వాట్సప్​ గ్రూపుల్లో ఉదయం 10.30 గంటల నుంచే వైరల్​ అయ్యింది. రెండు రోజుల్లో రెండు పేపర్లు బయటకు రావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. బిల్డింగ్​ ఎక్కి.. మొబైల్​లో ఫొటోలు తీసి..టెన్త్​ పరీక్ష రాస్తున్న తన ఫ్రెండ్​కు చిట్టీలు అందించడం కోసమే ఓ మైనర్​హిందీ క్వశ్చన్​ పేపర్​ను ఫొటోలు తీశాడని, వాటిని ఇంకో ఇద్దరు వైరల్​ చేశారని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్​ చెప్పారు.

హిందీ పేపర్​కు సంబంధించి మైనర్,​ మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి.. మూడు సెల్​ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మంగళవారం వరంగల్​ కమిషనరేట్​లో సీపీ రంగనాథ్​ వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపూర్​కు చెందిన శివ(మైనర్) స్నేహితుడు అదే మండలం ఉప్పల్​ లో టెన్త్​ పరీక్షలు రాస్తున్నాడు. ఫ్రెండ్​కు చిట్టీలు అందించాలనే ఉద్దేశంతో శివ మంగళవారం ఉదయం కమలాపూర్​ లోని జడ్పీ స్కూల్​కు వెళ్లాడు. పక్కనే ఉన్న చెట్టు ద్వారా మూడు ఫ్లోర్లు బిల్డింగ్​ ఫస్ట్​ ఫ్లోర్​ వరకు ఎక్కి రూమ్​ నెంబర్​3 వద్దకు వెళ్లాడు.

అక్కడ పరీక్ష రాస్తున్న హరీశ్​నుంచి హిందీ పేపర్​ తీసుకుని 9.45 గంటలకు మొబైల్​లో ఫొటోలు తీసుకున్నాడు. 9.59 గంటలకు వాటిని కమలాపూర్​కు చెందిన మౌటం శివగణేశ్​కు వాట్సప్​లో పంపాడు. శివగణేశ్​ఆ ఫొటోలను 31 మంది ఉన్న వాట్సప్​ గ్రూప్​కు ఫార్వార్డ్​ చేశాడు. అదే గ్రూపులోని ఓ వ్యక్తి తన బంధువైన ఓ పత్రిక మాజీ రిపోర్టర్​ అయిన గుండెబోయిన మహేశ్​ కు పంపించాడు. మహేశ్​ దానిని ఓ టీవీ చానల్​లో పనిచేసి మానేసిన బూరం ప్రశాంత్​కు ఫార్వార్డ్​ చేశాడు.

మాల్​ ప్రాక్టీసింగ్​ యాక్ట్ కింద కేసు: సీపీ

ప్రశాంత్​ తనకు వచ్చిన పేపర్​ను ‘సీను ఫ్రెండ్స్’అనే మీడియా వ్యక్తుల గ్రూప్​లో పోస్ట్​ చేశాడని సీపీ చెప్పారు. ప్రభుత్వ ఎగ్జామినేషన్​ సిస్టం సరిగా లేదనే భావన కలిగించాలనే దురుద్దేశంతో ఉదయం 10.46కి గ్రూప్​లో ఫొటోలు పెట్టి 9.35 కే పేపర్​ బయటకు వచ్చినట్టు ఓ మెసేజ్​ క్రియేట్​ చేశాడన్నారు. ‘వరంగల్ లో ఎస్ఎస్సీ హిందీ పేపర్ లీక్.. ఉదయం 9.30కే లీకైన ప్రశ్నపత్రం.. వరుసగా రెండో రోజు ప్రశ్నపత్రం లీక్ అవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎస్ఎస్​సీ స్టూడెంట్స్ వాట్సప్ గ్రూప్ లో ప్రత్యక్షమైన హిందీ ప్రశ్నపత్రం’అనే మెసేజ్​ను వివిధ గ్రూపులతోపాటు మీడియా ప్రతినిధులకు పంపించాడని తెలిపారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ కి కూడా ఉదయం 11.30 గంటలకు పేపర్​ పంపించినట్లు వెల్లడించారు. పేపర్​ తనకు చేరిన రెండు గంటల్లోనే వివిధ వ్యక్తులు, మీడియా ప్రతినిధులకు సంబంధించిన 142 ఫోన్​ కాల్స్​ను ప్రశాంత్​ మాట్లాడినట్టు సీపీ వివరించారు. ప్రశాంత్​ ద్వారానే అన్ని గ్రూపులకు మెసేజ్​ చేరిందన్నారు. తెలంగాణ మాల్​ప్రాక్టీసింగ్​ యాక్ట్ సెక్షన్​ 5 కింద కేసు నమోదు చేసినట్లు సీపీ చెప్పారు. మైనర్ ను జువైనల్ హోమ్​కు.. శివగణేశ్, ప్రశాంత్​ ను రిమాండ్​కు తరలించినట్లు సీపీ వివరించారు. మహేశ్​ను కూడా అరెస్ట్ చేయనున్నట్లు తెలిపారు. సైబర్​ క్రైమ్​ పోలీసుల సాయంతో నిందితులను గుర్తించినట్టు సీపీ చెప్పారు. 

ఆఫీసర్లకు విద్యాశాఖ మంత్రి ఆదేశాలు

టెన్త్​ పేపర్​ సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్​ శాంతికుమారి అన్నిజిల్లాల కలెక్టర్లు, పోలీస్​ ఉన్నతాధికారులు, విద్యాశాఖ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. వెంటనే నిందితులను గుర్తించాలని వరంగల్ సీపీకి ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు పేపర్​ ఎలా బయటకొచ్చిందో తేల్చాలని స్యూల్​ఎడ్యుకేషన్​ డైరెక్టర్​శ్రీదేవసేన వరంగల్, హనుమకొండ డీఈవోలు వాసంతి, అబ్ధుల్​ హైని ఆదేశించారు. దీంతో వారు వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్​కు ఈ అంశంపై ఫిర్యాదు చేశారు.

ఇన్విజిలేటర్లు.. సెక్యూరిటీ స్టాఫ్ ఏం చేస్తున్నరు?

చెట్టు మీదుగా బిల్డింగ్​ ఎక్కి శివ ఫొటోలు తీసుకున్నట్లు పోలీసులు చెబుతుండగా.. ఇన్విజిలేటర్​తోపాటు ఎగ్జామినేషన్​ సెంటర్​ సెక్యూరిటీ సిబ్బంది, స్కూల్ స్టాఫ్​ ఉండగా ఇదంతా ఎలా సాధ్యమైందనే అనుమానాలు కలుగుతున్నాయి. ముగ్గురిని అరెస్ట్​ చేయగా.. ఇన్విజిలేటర్​తోపాటు ఇతర సిబ్బందిపై యాక్షన్​ తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.