- ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
- పీవీఎన్ఆర్, ఎన్టీఆర్ మార్గ్ లో వేసే విగ్రహలను వెంటనే తీసి తరలించేందుకు చర్యలు
- గ్రేటర్‌వ్యాప్తంగా 28 చెరువుల వద్ద ప్రత్యేక కొలనులు
హైదరాబాద్, వెలుగు: హైకోర్టు ఆదేశాలతో గణేశ్ నిమజ్జనానికి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఎ, వాటర్వర్క్స్అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. విగ్రహాలు అన్నీ ట్యాంక్‌బండ్‌కు రాకుండా.. ఆయా మండపాలకు సమీపంలోని చెరువుల వద్ద ఏర్పాటు చేసే ప్రత్యేక కొలనుల్లోనే నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి ట్యాంక్‌బండ్‌పై నుంచి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడం నిషేధించిన ఆఫీసర్లు, పెద్ద పెద్ద విగ్రహాలు వస్తే.. పీవీఎన్ఆర్, ఎన్టీఆర్‌మార్గ్‌లో నిమజ్జనం చేసి, వెంటనే బయటకు తీసి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనం కోసమే గతంలో సంజీవయ్య పార్కులో నిర్మించిన పాండ్‌ను ఈసారి వినియోగించుకోనున్నారు. 8 ఫీట్ల ఎత్తు లోపు విగ్రహాలను ఇందులో నిమజ్జనం చేసే అవకాశం ఇచ్చారు. హైకోర్టు ఆదేశాలు మేరకు ఇప్పటికే ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన క్రేన్ లను జీహెచ్ఎంసీ తొలగిస్తోంది. ఎక్కడి వారు అక్కడే గణేశ్‌లను నిమజ్జనం చేసేందుకు గ్రేటర్ పరిధిలో మూడేళ్ల క్రితం జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన 28 ప్రత్యేక కొలనులను ప్రస్తుతం సిద్ధం చేస్తున్నారు. పోలీసుల సాయంతో గణేశ్ మండపానికి సమీపంలో ఉన్న కొలనుల్లో నిమజ్జనం చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
ప్రత్యేక కొలనులు ఎక్కడెక్కడంటే..
కాప్రా, చర్లపల్లి ట్యాంక్, అంబీర్ చెరువు(కూకట్‌పల్లి), గంగారం పెద్ద చెరువు-(శేరిలింగంపల్లి), వెన్నెల చెరువు(జీడిమెట్ల), రంగధాముని కుంట(కూకట్‌పల్లి), మల్కా చెరువు(రాయదుర్గ్), నలగండ్ల చెరువు(నలగండ్ల), పెద్ద చెరువు(మన్సూరాబాద్), హుస్సేన్‌సాగర్ లేక్(సికింద్రాబాద్), పెద్దచెరువు-(నెక్నాంపూర్), లింగంచెరువు(-సూరారం), ముళ్లకత్వచెరువు-(మూసాపేట్), నాగోల్‌చెరువు(నాగోల్), కొత్తచెరువు(అల్వాల్), నల్లచెరువు(ఉప్పల్), పత్తికుంట(-రాజేంద్రనగర్), బోయిన్‌చెరువు(హస్మత్‌పేట్), గురునాథ్ చెరువు(మియాపూర్), గోపిచెరువు(లింగంపల్లి-), రాయసముద్రం చెరువు(రామచంద్రాపురం), కైదమ్మకుంట(హఫీజ్‌పేట్-), దుర్గంచెరువు(రాయదుర్గ్) ప్రాంతాల్లో నిమజ్జనానికి ప్రత్యేకంగా కొలనులు ఏర్పాటు చేశారు.
హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ నిమజ్జనాలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలె
భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి డిమాండ్
హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై ఆంక్షలు విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లి నిమజ్జనం కొనసాగేలా చూడాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ భగవంత్‌రావు డిమాండ్ చేశారు. శనివారం అమీర్‌పేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేవుడిని పూజించడం, నిమజ్జనం చేయడం ప్రజల హక్కు అని అన్నారు. రసాయన విగ్రహాల ద్వారా నీరు కలుషితం అవుతుందన్న రిపోర్ట్ ఎక్కడా లేదని చెప్పారు. నాలాల నుంచి వచ్చే నీరు, పరిశ్రమల వ్యర్థాలతోనే హుస్సేన్ సాగర్‌లో నీరు కలుషితం అవుతుందన్నారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్‌లో నీరు వంద శాతం కలుషితమైందని పేర్కొన్నారు. కోర్టుకు అధికారులు తప్పుడు రిపోర్టులు ఇవ్వడంతోనే ఇలాంటి తీర్పు వచ్చిందని ఆరోపించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు ఇస్తున్నాయని, సంప్రదాయాలకు, ప్రజలకు ఇబ్బందుల్లేకుండా తీర్పు ఉండాలన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను అందుబాటులో ఉంచదని, రసాయన విగ్రహాలను నిమజ్జనం చేయొద్దు అంటే ఎలా? అని ప్రశ్నించారు. ప్రతిష్టించిన విగ్రహాలను నిమజ్జనం చేయొద్దంటే రోడ్లపైనే విగ్రహాలను ఉంచాలా అని ప్రశ్నించారు. ఉద్దేశ పూర్వకంగానే గణేశ్ విగ్రహాల నిమజ్జనాన్ని అడ్డుకుంటున్నారని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు ఆరోపించారు. కొన్ని ఏరియాల్లో గణేశ్ మండపాల ఏర్పాటుకు కూడా పర్మిషన్ ఇవ్వలేదన్నారు. ఎంఐఎం ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఖాసీం రజ్వీలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.