నస్రల్లా బంకర్ తుక్కు తుక్కు.. రెండు సెకన్లకొకటి చొప్పున ఇజ్రాయెల్​ బాంబుల వర్షం

నస్రల్లా బంకర్ తుక్కు తుక్కు.. రెండు సెకన్లకొకటి చొప్పున ఇజ్రాయెల్​ బాంబుల వర్షం

జెరూసలెం/బీరుట్: ప్రతి రెండు సెకన్లకు ఓ బాంబు. రెండున్నర నిమిషాల్లోనే వంద బాంబులు పిడుగుల్లా దూసుకొచ్చాయి. ఓ అపార్ట్ మెంట్ బిల్డింగ్ కింద అత్యంత దృఢంగా 6 మీటర్ల మందంతో నిర్మించిన కాంక్రీట్ స్లాబ్​లను చీల్చుకుంటూ60 అడుగుల లోతున ఉన్న అండర్ గ్రౌండ్ బంకర్లను బద్దలుకొట్టాయి. లెబనాన్  రాజధాని బీరుట్​లోని అండర్ గ్రౌండ్ బంకర్​లో ఉన్న హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను హతమార్చేందుకు అత్యంత చాకచక్యంతో, గురితప్పకుండా  ఇజ్రాయెల్ శుక్రవారం చేసిన భీకర దాడి ఇది. 

ఎంతోకాలంగా నస్రల్లా కదలికలపై నిఘా పెట్టిన ఇజ్రాయెల్.. పక్కా సమాచారం, పకడ్బందీ ప్లాన్​తో అతడిని మట్టుబెట్టిందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో వెల్లడించింది. అమెరికా అందించిన బంకర్ బస్టర్ బాంబులను ఇజ్రాయెల్ ఈ దాడికి ఉపయోగించినట్టు తెలిపింది. మొత్తం 2 వేల టన్నుల పేలుడు పదార్థాలతో కూడిన జీబీయూ28, జీబీయూ 37, మాసివ్ ఆర్డ్ నెన్స్ పెనెంట్రేటర్ అనే 3 రకాల బంకర్ బస్టర్ బాంబులను.. బంకర్ బద్దలవడంతోపాటు ఆరు భవనాలు నేలమట్టం అయ్యాయని పేర్కొంది. అధునాతనమైన ఈ బాంబులు ఎంత దృఢమైన కాంక్రీట్​ను అయినా చీల్చుకుంటూ వెళ్లి బంకర్​ను పేల్చేస్తాయని వివరించింది. బంకర్​లో సమావేశమైన నస్రల్లాతోపాటు హెజ్బొల్లా కీలక నేతలు ఎవరూ తప్పించుకోకుండా ఉండేందుకే వంద బాంబులను ప్రయోగించామని ఇజ్రాయెల్ బ్రిగేడియర్ జనరల్ అమిచయ్ లెవిన్ చెప్పారు. ‘న్యూ ఆర్డర్’ పేరుతో ఆపరేషన్ చేపట్టినట్టు తెలిపారు.

ఇరాన్ గూఢచారి ఇచ్చిన సమాచారంతోనే.. 

ఎప్పుడూ బంకర్లలో, అత్యంత రహస్యంగా తిరిగే నస్రల్లాను హతమార్చేందుకు ఇజ్రాయెల్ గతంలో అనేక సార్లు ప్రయత్నించి ఫెయిల్ అయింది. కానీ ఈ సారి ఇరాన్ గూఢచారి ద్వారా సమాచారాన్ని రాబట్టి.. నస్రల్లా రాకను ముందే తెలుసుకుంది. ఇజ్రాయెల్​కు వ్యతిరేకంగా ఎలాంటి దాడులు చేయాలన్న దానిపై చర్చలు జరిపేందుకు నస్రల్లా సహా హెజ్బొల్లా కీలక నేతలు శుక్రవారం బంకర్​లో సమావేశం అవుతున్నారని ఇరాన్ గూఢచారి నుంచి కొన్ని గంటల ముందే సమాచారం అందడంతో ప్లాన్​తో దాడి చేసిందని ఫ్రాన్స్​కు చెందిన ‘లే పర్షియన్’ పత్రిక వెల్లడించింది. అమెరికా పర్యటనకు వెళ్తున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు విమానంలో నుంచే మిలిటరీ ఆఫీసర్లతో చర్చల్లో పాల్గొన్నారని తెలిపింది. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్​కు చెందిన 69వ స్క్వాడ్రన్ (హ్యామర్స్) ఫైటర్ జెట్లు రంగంలోకి దిగి, నిమిషాల్లోనే పని ముగించాయని పేర్కొంది.

నస్రల్లా డెడ్ బాడీ వెలికితీత 

ఇజ్రాయెల్ దాడిలో నేలమట్టమైన హెజ్బొల్లా హెడ్ క్వార్టర్స్ శిథిలాల నుంచి ఆ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లా డెడ్ బాడీని ఆదివారం వెలికితీసినట్టు రాయిటర్స్ మీడియా సంస్థ వెల్లడించింది. నస్రల్లా బాడీకి నేరుగా గాయాలు కాలేదని లెబనాన్ అధికారిక వర్గాలు తెలిపాయని పేర్కొంది. బాంబు పేలుళ్ల తీవ్రతకు అతడి బాడీ బ్లంట్ ట్రామాకు గురై చనిపోయి ఉండొచ్చని తెలిపింది. 

హెజ్బొల్లా మరో కీలక నేత హతం 

ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లాకు చెందిన మరో కీలక నేత హతమయ్యాడు. హెజ్బొల్లా సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ నబిల్ కౌక్ ను శనివారం నాటి దాడిలో మట్టుబెట్టామని ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో గత వారం రోజుల్లో మరణించిన హెజ్బొల్లా కీలక నేతల సంఖ్య ఏడుకు చేరినట్టు తెలిపింది. లెబనాన్ లోని హెజ్బొల్లా స్థావరాలపై ఆదివారం కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయని, తాజా దాడుల్లో 33 మంది చనిపోయారని చెప్పింది. కాగా, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు యూఎస్ నుంచి తిరిగి వస్తున్న సందర్భంగా బెన్ గురియన్ ఎయిర్ పోర్టుపై మిసైల్ దాడి చేశామని హౌతీ సంస్థ ప్రకటించింది.

హెజ్బొల్లా కొత్త చీఫ్​గా  హషేమ్ సఫీద్దీన్ 

హెజ్బొల్లా సంస్థ కొత్త చీఫ్ గా హషేమ్ సఫీద్దీన్ (60) బాధ్యతలు చేపట్టనున్నట్టు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. శుక్రవారం నాటి దాడిలో నస్రల్లాతోపాటు ఈయన కూడా చనిపోయాడని తొలుత వార్తలు వచ్చాయి. కానీ సఫీద్దీన్ బతికే ఉన్నాడని, హెజ్బొల్లా పగ్గాలు అందుకోనున్నాడని రాయిటర్స్ ఆదివారం తెలిపింది. ప్రస్తుతం హెజ్బొల్లా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చీఫ్ గా ఉన్న సఫీద్దీన్ నస్రల్లాకు దగ్గరి బంధువు. 1990ల నుంచే నస్రల్లా వారసుడిగా ఈయన పేరు ప్రచారంలో ఉంది.


నస్రల్లాను కీర్తించిన ముఫ్తీ.. మండిపడ్డ బీజేపీ 

ఇజ్రాయెల్ దాడిలో మరణించిన హెజ్బొల్లా చీఫ్​నస్రల్లా అమరవీరుడని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కొనియాడారు. పాలస్తీనాకు, లెబనాన్ కు మద్దతు ప్రకటించారు. నస్రల్లా హత్యకు నిరసనగా, హెజ్బొల్లాకు సంఘీభావం గా ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ఆమె ట్వీట్ చేశారు. అయితే, ముఫ్తీ ట్వీట్ పై బీజేపీ మండిపడింది. టెర్రరిస్టులు చనిపోతే కన్నీరు కారుస్తున్నారని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం టెర్రరిస్టులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ విమర్శించారు.