ఈ ఇంజినీర్.. ఎర్రలు పెంచుతోంది

ఈ ఇంజినీర్..  ఎర్రలు పెంచుతోంది

ఎర్రలంటే అందరూ చిరాకు పడతారు. కానీ, ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన సనా ఖాన్ వాటిని పెంచుతూ వర్మీ కంపోస్ట్ తయారుచేస్తోంది. ఇంజినీరింగ్ చదివినా, ఎమ్.ఎన్.సీ కంపెనీలో ఉద్యోగం వచ్చినా.. చేరకుండా వర్మీ కంపోస్ట్ సంస్థ పెట్టింది. సంవత్సరానికి కోటి రూపాయల బిజినెస్ చేస్తూ 30 మందికి పైనే ఉపాధి కల్పిస్తోంది.

పెస్టిసైడ్, ఫెర్టిలైజర్స్ వంటి వాటిలో కెమికల్స్ ఎక్కువ. అందుకే వాటితో పెరిగే మొక్కల వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ, వర్మీకంపోస్ట్‌‌తో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పైగా ఇది ఆర్గానిక్. చేయాలనే తపన ఉండాలే కానీ ఈ బిజినెస్ చేయడం చాలా ఈజీ.  తక్కువ పెట్టుబడి. ఎక్కువ లాభం.

ఉత్తరప్రదేశ్‌‌లోని మీరట్ నగరంలో దాదాపు 104 వరకూ స్కూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ స్కూల్స్ వర్మీ కంపోస్ట్‌‌పై దృష్టిపెట్టేలా చేసింది సనా ఖాన్. చెత్తను స్కూల్లో ఎక్కడబడితే అక్కడ పడేయకుండా గుంతలను ఏర్పాటు చేసింది. అందులో ఎర్రలు (వానపాములు) పెంచుతూ వర్మీ కంపోస్ట్ తయారు చేస్తోంది.

ఇంజినీరింగ్ చదువుతూనే..

అందరిలానే సనాకు కూడా వానపాములంటే చిరాకు. కానీ, ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్‌‌‌‌లో ఉన్నప్పుడు వర్మీకంపోస్ట్ ప్రాజెక్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ ప్రాజెక్ట్‌‌ వల్లే సనాకు వానపాములంటే చిరాకు పోయింది. పైగా వర్మీకంపోస్ట్‌‌పై ఇంట్రెస్ట్ పెరిగింది. తనకు కూడా వర్మీకంపోస్ట్ తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చింది మొదలు ‘ఎస్ జె ఆర్గానిక్స్’ అనే వర్మీకంపోస్టింగ్ సంస్థను పెట్టింది. ఓ పక్క ఇంజినీరింగ్ చదువుతూనే మరో పక్క వ్యాపారం అభివృద్ధి చేసేందుకు కృషి చేసింది.

పట్టుదలతో..

వర్మీ కంపోస్టింగ్ బిజినెస్ చేస్తానని సనా తన తల్లిదండ్రులకు చెబితే మొదట ఒప్పుకోలేదు. ‘ఇంజినీరింగ్ చదువుకోకుండా ఇదేం పని’ అని తిట్టారు. అయినా పట్టు వదలలేదు. సనా పట్టుదలను చూసి తండ్రి, అన్నయ్యలు సనాకు సాయంగా నిలబడ్డారు. ఎస్ జె ఆర్గానిక్స్  మొదలుపెట్టాకే ఇంజినీరింగ్ పూర్తిచేసింది. కాలేజ్ సెలక్షన్స్‌‌లో ఎమ్ఎన్‌‌సీ కంపెనీలో జాబ్ వచ్చింది. అయినా, ఆ జాబ్‌‌లో చేరకుండా వర్మీకంపోస్టింగ్‌‌ పైనే దృష్టిపెట్టింది.

అన్నీ సవాళ్లే..

వర్మీ కంపోస్టింగ్ మొదలుపెట్టిన కొత్తల్లో అన్నీ సవాళ్లే ఎదురయ్యాయి ఆమెకి. మొదట తన టార్గెట్… డైరీ ఫామ్స్‌‌లో దొరికే వేస్ట్‌‌ను వర్మీకంపోస్ట్‌‌గా మార్చడం. మీరట్‌‌లో కొన్ని డైరీ ఫామ్‌‌లకు వెళ్లి ప్రయత్నించింది. కానీ, ఎవరూ ఒప్పుకోకపోవడం, ఒప్పుకున్నా  సరైన సదుపాయాలు లేకపోవడంతో ఆ ప్రాసెస్‌‌ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత, ఓ గవర్నమెంట్ కాలేజ్‌‌ పర్మిషన్ తీసుకుని కొంతమంది వర్కర్ల సాయంతో ఇళ్ల దగ్గర, డైరీ ఫామ్‌‌లలో దొరికే చెత్తను ఆ కాలేజ్ గ్రౌండ్‌‌లో వేయించేది. అందులో వానపాములు వేసి పెంచేది. అది నెల రోజుల తర్వాత వర్మీకంపోస్టింగ్‌‌గా మారేది.

మార్కెటింగ్

వర్మీకంపోస్ట్‌‌ రెడీకాగానే తన కంపెనీ పేరుతో తయారుచేసిన బ్యాగుల్లో వేసి నగరంలోని నర్సరీలకు సరఫరా చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా స్కూళ్లు, గల్లీల్లో కూడా గుంతలు తవ్వి వర్మీకంపోస్టింగ్ చేయడం ప్రారంభించింది. దీంతో, బిజినెస్ పెరగడంతో నర్సరీలతో పాటు రైతులకు, రిటైల్ షాపులకు కూడా సరఫరా చేయడం మొదలుపెట్టింది.

అవగాహన పెంచుతూ..

స్కూళ్లే కాదు మీరట్‌‌లోని స్లమ్ ఏరియాలను కూడా వదలలేదు సన. గల్లీగల్లీ తిరుగుతూ చెత్త వేసేందుకు గుంతలు ఏర్పాటు చేస్తోంది. అక్కడున్న వాళ్లకు వర్మీకంపోస్ట్‌‌పై అవగాహన పెంచుతోంది. అయితే ఇలా గల్లీల్లో తిరుగుతూ వర్మీ కంపోస్ట్ గురించి చెబుతున్నప్పుడు మొదట్లో ప్రజల నుండి చాలా వ్యతిరేకతను చూసింది సన. కానీ, పట్టువదలకుండా మళ్లీ మళ్లీ వాళ్లకు వర్మీ కంపోస్ట్‌‌ లాభాలేంటో వివరించింది. ‘‘ మొదట్లో చెత్త, పురుగులతో వ్యాపారమేంటి? అని నన్ను అన్నవాళ్లే ఎక్కువ. కానీ ఇప్పుడు అలా అన్నవాళ్లు కూడా ఈ బిజినెస్ ద్వారా ఉపాధి పొందుతున్నారు’అని చెప్పింది సన.

లాభాల బాటలో..

కంపెనీ పెట్టిన తర్వాత సంవత్సరం పాటు చాలా కష్టపడింది ఆమె. ఆ తర్వాత రెండేళ్లు వర్మీకంపోస్ట్ క్వాంటిటీ పెంచడం కోసం తీవ్రంగా కృషి చేసింది. ప్రస్తుతం నెలకు 150 టన్నులకు పైనే వర్మీకంపోస్ట్ తయారుచేస్తుంది. దీనివల్ల సంవత్సరానికి ఒక కోటి రూపాయల టర్నోవర్ అందుకుంటోంది.

‘‘ఆడవాళ్లంటే ఇంటికే పరిమితం అనుకుంటారు చాలామంది. లేదంటే కొన్ని పనులు మాత్రమే వాళ్లు చేయగలరు అనుకుంటారు. కానీ, మహిళ ఏదైనా చేయాలని అనుకోవాలేగానీ అది సాధించి తీరుతుంది. ఏ సెక్టార్‌‌‌‌లో అయినా నిలబడగలుగుతుంది’’ అని చెబుతున్న సనా ఖాన్ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

నల్ల బంగారం

వర్మీకంపోస్ట్ అనేది చాలా నేచురల్‌‌గా జరిగే ప్రక్రియ. మట్టి, చెత్తలో వానపాములు వేసి పెంచితే అవి ఆ చెత్తలో ఉండే జీవపదార్థాలను తిని పెరుగుతాయి. అవి ‘వార్మ్ క్యాస్ట్స్’ ను విసర్జిస్తాయి. దీనికి పోషకగుణాలు ఎక్కువ. అందుకే దీన్ని అందరూ ‘నల్ల బంగారం’ అని పిలుస్తారు. మట్టిలో ఈ నల్లబంగారం కలిసిపోవడం వల్ల వర్మీకంపోస్ట్ తయారవుతుంది. వీటిని ఎక్కువగా ఆర్గానిక్ ఫీల్డ్స్‌‌లో ఉపయో గిస్తారు. పైగా తక్కువ రేటు. అందుకే, వర్మీకంపోస్ట్‌‌కు డిమాండ్ ఎక్కువ.