అన్నదాతలను ఆదుకోవాలి : కూరపాటి శ్రావణ్

 అన్నదాతలను ఆదుకోవాలి : కూరపాటి శ్రావణ్

భారతదేశంలో ప్రస్తుతం వ్యవసాయ రంగం అనేక సవాళ్ళను ఎదుర్కొంటోంది. నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు, ముఖ్యంగా అతివృష్టి, అనావృష్టి వంటి వాటితో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంవత్సరం వర్షాలు సరిగా పడక పలుచోట్ల కరవు సంభవించింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు, పంట నష్టం ఏర్పడినపుడు కేంద్ర,- రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలను ఆదుకోవడం వాటి బాధ్యత. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 2.20 కోట్ల ఎకరాల సాగుభూమి ఉందని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది.

రైతులు పండిస్తున్న పంటలకు  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. రాష్ట్రంలో సమగ్ర పంటల బీమా పథకంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఫసల్ బీమా యోజన అమలుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ వచ్చిన లేఖను ప్రజహిత వ్యాజ్యంగా  తెలంగాణ హై-కోర్టు విచారణ చేపట్టడం హర్షణీయం. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఫసల్ బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. దీనివల్ల ఇక్కడి రైతులు అందరూ ఈ పథకానికి అనర్హులుగా మిగిలి నష్టపోతున్నారు. అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల  పంటలు దెబ్బతిన్నా లేదా నష్టపోయినా ఈ బీమా వల్ల రైతులకు ప్రభుత్వాల నుంచి పరిహారం అందుతుంది.

ఈ ఏడాది వేసవి కాలంలో 5లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు సంబంధిత అధికారులు అంచనా వేశారు. ఇక నుంచైనా ప్రభుత్వం రైతులు పండించే  అన్నిరకాల పంటలకు సంబంధించి..  కేంద్ర ప్రభుత్వం  ప్రవేశపెట్టిన పంటల బీమా పథకాలన్నింటినీ రాష్ట్రప్రభుత్వం అమలు చేయాలి. ఆ దిశగా కార్యాచరణను రూపొందించి పంట నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలి.


‑  కూరపాటి శ్రావణ్
కొండాపూర్, జనగామ జిల్లా.