దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్ పథ్లో జరిగే గణతంత్ర వేడుకల్లో ఈ సారి ఎన్నో ప్రత్యేకతకు చోటు కల్పించబోతోంది భారత ప్రభుత్వం. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొద్ది మందితోనే రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ గతానికి భిన్నంగా సామాన్యులను ప్రత్యేక అతిథులుగా పిలవాలని నిర్ణయించింది. తొలిసారిగా నిర్మాణ కార్మికులు, పారిశుధ్య కార్మికులు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, ఆటో డ్రైవర్లను ఈ వేడుకలకు ఆహ్వానించబోతున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. సామాన్యులకు సైతం రాజ్ పథ్ లో జరిగే పరేడ్ లో పాల్గొనే అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే పరేడ్ లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయి ఉండాలని తెలిపారు.
600 మంది యువ కళాకారులు..
రాజ్ పథ్ లో ఈసారి 600 మంది యువ కళాకారులు తమ అద్భుతమైన నృత్య ప్రదర్శనలతో అలరించబోతున్నారు. ‘వందే భారతం’ అన్న పేరుతో కేంద్ర సాంస్కృతిక శాఖ, రక్షణ శాఖ కలిసి నిర్వహించిన కాంపిటీషన్ ద్వారా వీరిని ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న రకరకాల ట్యాలెంటెడ్ డ్యాన్సర్లను ప్రోత్సాహించడం కోసం ఇలా పోటీ నిర్వహించి ఎంపిక చేసినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
ఈ ఏడాది రిపబ్లిక్ డే నాడు ఎన్సీసీ స్టూడెంట్స్ గ్రూప్ లోని పిల్లలు.. నేషనల్ వార్ మెమోరియల్ లో స్మృతి చిహ్నంపై చెక్కిన అమర సైనికుల కుటుంబాలను కలిసేందుకు కేంద్ర రక్షణ శాఖ ఏర్పాటు చేసింది. ఆ వీర జవాన్ల త్యాగాలకు థ్యాంక్స్ చెబుతూ ప్రధాని నరేంద్ర మోడీ సంతకం చేసిన జ్ఞాపికలను వారికి అందజేస్తారని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం 5 వేల మంది అమర జవాన్ల కుటుంబాలను గుర్తించినట్లు తెలిపాయి.
‘ఫస్ట్ టైమ్స్’...
తొలిసారిగా విజిటర్స్ కు యుద్ధ విమానాల్లో నుంచి పరేడ్ విజువల్స్ ను చూపించనున్నారని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. అలాగే ఈ సారి రిపబ్లిక్ డే పరేడ్ కోసం ప్రత్యేకంగా ఔషధ మొక్కల విత్తనాలతో ఉండే కార్డులను ఇన్విటేషన్లుగా రూపొందించారు. ఈ ఆహ్వాన పత్రికలను కుండీల్లో వేస్తే వాటి నుంచి మొక్కలు వస్తాయని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఎకో ఫ్రెండ్లీ ఇన్విటేషన్ కార్డులను ముద్రించాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
This year the invitation cards for #RepublicDay have medicinal seeds. After the event, it can be sowed in a flower pot or garden: MoD Sources
— ANI (@ANI) January 18, 2022
చైనా, రష్యా, యూకే తర్వాత ఈ ఘనత మనదే
ఈ సారి జరగబోయే రిపబ్లిక్ డే పరేడ్ ద్వారా మనం.. అగ్ర దేశాల సరసన నిలవబోతున్నాం. గణతంత్ర వేడుకల్లో డ్రోన్ పరేడ్ నిర్వహించిన నాలుగో దేశంగా భారత్ ఘనత దక్కించుకోబోతోంది. ఇప్పటి వరకు చైనా, రష్యా, యూకే తర్వాత మనమే ఈ డ్రోన్ షో నిర్వహిచబోతున్నాం. రిపబ్లిక్ డే సందర్భంగా జరిగే బీటింగ్ రిట్రీట్ లో 1000 డ్రోన్లతో ఈ స్పెషల్ షో ఉంటుంది. ఢిల్లీ ఐఐటీకి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఈ డ్రోన్ పరేడ్ నిర్వహించబోతోంది.