
హైదరాబాద్: అందమైన భాగ్యనగరం అందాల పోటీలకు వేదికగా మారనుంది. 72వ మిస్వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. మే 7 నుంచి 31 దాకా హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. 25 రోజుల పాటు 22 ఈవెంట్లు నిర్వహించనున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి 140 దేశాలకు చెందిన కంటెస్టెంట్లతో పాటు ఆయా దేశాలకు చెందిన ప్రముఖ క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, న్యాయవాదులు, కళాకారులు.. ఇలా విభిన్న రంగాలకు చెందినవారు తరలిరానున్నారు. ఈ బిగ్ఈవెంట్ను కవర్ చేసేందుకు మరో 3వేల మందికి పైగా దేశ, విదేశీ మీడియా ప్రతినిధులు హాజరుకానున్నారు.
మే 6 నుంచే కంటెస్టెంట్స్ రాకతో హైదరాబాద్ సందడిగా మారనుంది. 10న గచ్చిబౌలిలో మిస్ వర్డల్ ఓపెనింగ్ సెర్మనీ, 31న మిస్ వరల్డ్ గ్రాండ్ఫినాలె జరగనుంది. మధ్యలో తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసేలా వివిధ ప్రాంతాల్లో రకరకాల ఈవెంట్లు నిర్వహించనున్నారు. మే 10న తెలంగాణ జానపద, గిరిజన నృత్యాలతో గ్రాండ్గా ఓపెనింగ్ సెర్మనీ.. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే కంటెస్టెంట్లకు తెలంగాణ ఆటపాటలతో గ్రాండ్ వెల్కమ్.
మే 12, 13న కంటెస్టెంట్ల స్పిరిచ్యువల్ టూర్, నాగార్జున సాగర్ బుద్ధవనం సందర్శనతో పాటు హైదరాబాద్ హెరిటేజ్ వాక్. మే 13న చౌమహల్లా ప్యాలెస్ విజిట్, మే 14న కాకతీయ హెరిటేజ్ ట్రిప్ వరంగల్, రామప్ప ఆలయ సందర్శన. మే 15న యాదగిరిగుట్ట ఆలయ దర్శనం.. అదేరోజు పోచంపల్లి హ్యాండ్ లూమ్ టూర్.
ALSO READ | సీఎం రేవంత్ రెడ్డి జపాన్ టూర్ షెడ్యూల్ ఖరారు
మే 16న ఏఐజీ, అపోలో, యశోద హాస్పిటల్స్కు కంటెస్టెంట్ల మెడికల్ టూర్. మే 17న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫినాలే. మే 17న తెలంగాణ ఎక్స్ పీరియం ఎకో టూరిజం పార్క్ సందర్శన, తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్, కల్చరల్ ఈవెంట్. మే 19న కంటెస్టెంట్ల స్టేట్ సెక్రటేరియట్ టూర్, ట్యాంక్ బండ్, అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ విజిట్. మే 20, 21న టీ హబ్ ఆధ్వర్యంలో కాంటినెంటల్ ఫినాలే. మే 21న శిల్పారామంలో కంటెస్టెంట్ల ఆర్ట్స్, క్రాఫ్ట్స్ సెషన్.
తెలంగాణ వైపు ప్రపంచం దృష్టిని ఆకర్షించడం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం, ఇక్కడి పర్యాటక ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్నది. మిస్వరల్డ్పోటీలకు మొత్తం రూ.54 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో సగం అంటే రూ.27 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగతా సగం ఈవెంట్ నిర్వాహకులు వెచ్చిస్తారు. ప్రభుత్వం ఇచ్చే రూ.27 కోట్లలో కేవలం రూ.5 కోట్లను మాత్రమే నేరుగా భరిస్తుంది. మిగిలిన రూ.22 కోట్లను స్పాన్సర్ల ద్వారా సమకూర్చుకునేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుండటం గమనార్హం.