న్యూఢిల్లీ: ఈసారి రాఖీ పండుగకు దేశం మొత్తం మీద సుమారు రూ.12 వేల కోట్ల బిజినెస్ జరుగుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా చైనాలో తయారైన రాఖీల కంటే ఇండియాలో తయారైన రాఖీలకు డిమాండ్ పెరగడమే కారణమని వెల్లడించాయి. కిందటేడాది రాఖీ పండుగకు రూ.10 వేల కోట్ల బిజినెస్ జరిగిందని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (కైట్) నేషనల్ జనరల్ సెక్రెటరీ ప్రవీణ్ ఖండెల్వాల్ అన్నారు. పెరిగిన డిమాండ్‌ను బట్టి ఈసారి రూ. 12 వేల కోట్ల బిజినెస్ జరగొచ్చని, ఇది 20 శాతం గ్రోత్‌కు సమానమని పేర్కొన్నారు.
కాగా, 2022 లో రాఖీ పండుగ టైమ్‌లో రూ.7 వేల కోట్ల వ్యాపారం జరగగా, 2021 లో రూ.6 వేల కోట్లు, 2020 లో రూ.5 వేల కోట్లు, 2019 లో రూ.3,500 కోట్లు, 2018 లో రూ.3 వేల కోట్ల బిజినెస్ జరిగింది. రక్షాబంధన్ నాడు చెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రాఖీలను కడతారు. ఈ ఏడాది రక్షాబంధన్‌కు ఇండియాలో తయరైన రాఖీలు పెద్ద మొత్తంలో అందుబాటులో ఉన్నాయని కైట్ పేర్కొంది. నాగ్‌పూర్ నుంచి ఖాదీ రాఖీలు, జైపూర్ నుంచి సంగనెరి రాఖీలు, పూణె నుంచి సీడ్ రాఖీలు, మధ్యప్రదేశ్ నుంచి ఉన్నితో చేసిన రాఖీలు, అస్సాం నుంచి వెదురు రాఖీలు, టీ ఆకు రాఖీలు వంటివి మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయని వివరించింది. ఈ ఏడాది పండుగ సీజన్‌లో ఇండియాలో తయారైన ప్రొడక్ట్‌ల అమ్మకాలు పెరుగుతాయని, రూ. 4 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని ఈ సంస్థ అంచనా వేస్తోంది. కాగా, పండుగ సీజన్ దసరా, దీపావళి నుంచి మొదలై జనవరిలో సంక్రాంతి వరకు కొనసాగుతుంది.