- కరోనా అయినా నెట్టుకొచ్చారు
- ఈ ఏడాది గ్రోత్ గ్యారెంటీ
- ప్రభుత్వ కంపెనీల బోర్డులను మార్చాలి
- వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి
- పీఎల్‌ఐ స్కీమ్‌తో తయారీకి బూస్టప్
- రెండేళ్లలో ప్రీ కరోనా లెవెల్స్‌కి ఎకానమీ
కరోనా బారిన పడి చితికిపోయిన ఎకానమీ బండిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై ఎకనమిక్ సర్వే దృష్టి పెట్టింది. బ్యాంకులను బలోపేతం చేయడం నుంచి పీఎస్‌యూ బోర్డులలో మార్పులు, మరిన్ని పీఎస్‌యూల లిస్టింగ్వంటి అంశాలకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించింది. కుంగిపోయిన ఎకానమీ గ్రోత్ మళ్లీ పుంజుకోవడానికి ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న చర్యలను మెచ్చుకుంటూనే, మరిన్ని రిఫార్మ్స్ అవసరమని ఎకనమిక్ సర్వే రికమెండ్ చేసింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు ఊతమివ్వడంతోపాటు, రైతుల రాబడి పెంపొందించడమూ గ్రోత్‌కు కీలకమని అభిప్రాయపడింది. పన్ను రెవెన్యూ తగ్గిపోతుందని చెబుతూనే, పబ్లిక్ హెల్త్‌పై పెట్టుబడులు మరింత పెంచాలని సూచించింది.
న్యూఢిల్లీ: కరోనా సంబంధిత రెగ్యులేటరీ ఆంక్షలు తొలిగిపోయాక బ్యాంక్‌ల అసెట్ క్వాలిటీపై దృష్టిపెట్టాలని 2020–21 ఎకనమిక్ సర్వే పిలుపునిచ్చింది. ఎకానమీ మెరుగవ్వడానికి రెగ్యులేటరీ పరమైన ఆంక్షలు తొలగిపోవాలని, ఆ తర్వాత వెంటనే బ్యాంక్ బుక్‌ల క్లీనప్ కార్యక్రమాన్ని చేపట్టాలని చీఫ్ ఎకనమిక్ అడ్వయిజర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ అన్నారు. కరోనా సంబంధిత ప్రొవిజన్లు తొలగించిన తర్వాత మరో బ్యాంకింగ్ క్రైసిస్ బారిన పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సర్వే సూచించింది. అంతేకాక కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థల బోర్డులను పూర్తిగా మార్చాల్సి ఉందని సర్వే అభిప్రాయపడింది. స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ ద్వారా కార్పొరేట్ గవర్నెన్స్‌ను మెరుగుపర్చాలని సూచించింది. దీని ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలలో పారదర్శకత తీసుకురావొచ్చని చెప్పింది. ప్రస్తుతం ప్రభుత్వం పబ్లిక్ రంగ కంపెనీల డిస్‌ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ను అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా వివిధ రంగాలలో ఆరోగ్యకరమైన పోటీని తీసుకురావొచ్చని అభిప్రాయపడింది. సోమవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కీలక పాయింట్లను సర్వే అంచనాలుగా విడుదల చేస్తారు. ఈ సర్వేను చీఫ్ ఎకనమిక్ అడ్వయిజర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ టీమ్ తయారు చేసింది. ఇండియా జీడీపీ వృద్ధి 2021–22 ఆర్థిక సంవత్సరంలో 11 శాతం రికార్డు అవుతుందని ఎకనమిక్ సర్వే అంచనావేసింది. దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్.. కోలుకున్న కన్జూమర్ డిమాండ్ గ్రోత్‌కు సపోర్ట్‌గా నిలుస్తాయని వివరించింది. శుక్రవారం నుంచి ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎకనమిక్ సర్వేను ప్రవేశపెట్టింది. మార్చి 31తో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇండియా ఎకానమీ 7.7 శాతం వరకు పడుతుందని ప్రభుత్వం సర్వేలో అంచనావేసింది. నాలుగు దశాబ్దాల్లో ఇదే అత్యంత కనిష్ట స్థాయిలని చెప్పింది.
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌దే కీలక పాత్ర…
ఎకానమీలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెన్స్ ఎంత ఉందో ఎకానమిక్ సర్వే వివరించింది. బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవసరాల ప్రాధాన్యతను మరవ కూడదని చెప్పింది. ఇన్‌ఫ్రా సెక్టార్‌లో సరిగ్గా ఇన్వెస్ట్ చేయకపోతే.. మెరుగైన ఆర్థిక వృద్ధిని సాధించడం కష్టమని ఈ డాక్యుమెంట్ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగం కలిసి ఎన్‌ఐపీని లాంచ్ చేశాయి. ఇవి 2020 నుంచి 2025 మధ్య కాలంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై రూ.111 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టనున్నాయి. ఈ స్కీమ్‌లో మేజర్ సెక్టార్లుగా ఎనర్జీ, రోడ్లు, అర్బన్ ఇన్‌ఫ్రా, రైల్వే ఉన్నాయి.
ఆర్ అండ్ డీలో పెట్టుబడులు పెట్టాలి..
ఆరోగ్యపరమైన సంక్షోభం ఎకానమీని, సమాజాన్ని ఎంత దారుణంగా దెబ్బతీయనుందో కరోనా ఎత్తి చూపింది. పెద్ద మొత్తంలో పబ్లిక్‌పై ఖర్చు పెట్టాలని, వాటిలో హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ఎక్కువగా కేటాయించాలని సర్వే సూచించింది. జీడీపీలో ఇండియాను మూడో అతిపెద్ద ఎకానమీగా నిలబెట్టేందుకు ఆర్ అండ్ డీలో ఇన్వెస్ట్‌మెంట్లను పెంచాల్సి ఉందని తెలిపింది.
17 ఏళ్ల తర్వాత కరెంట్ అకౌంట్ సర్‌ప్లస్…
దాదాపు 17 ఏళ్ల తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెంట్ అకౌంట్ సర్‌ప్లస్‌గా ఉంటుందని అంచనావేస్తున్నట్టు ఎకనమిక్ సర్వే వెల్లడించింది. సర్వీసెస్ ఎక్స్‌పోర్ట్స్ బాగా ఉండటంతో ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో జీడీపీలో కరెంట్ అకౌంట్ 3.1% సర్‌ప్లస్‌గా ఉన్నట్టు చెప్పింది. ఉత్పత్తులు, సేవల ఎక్స్‌పోర్ట్స్‌ను తీసుకుంటే.. ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం కరెంట్ అకౌంట్ సర్‌ప్లస్‌ను జీడీపీలో కనీసం 2 శాతంగా రికార్డు చేస్తుందని తెలిపింది. 17 ఏళ్ల తర్వాత ఈ అకౌంట్ సర్‌ప్లస్‌గా ఉంటుందని పేర్కొంది.
రెండంకెలకు చేరే చాన్స్..
2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ గ్రోత్ రెండంకెలుగా నమోదై, 11 శాతంగా ఉంటుందని ప్రభుత్వం అంచనావేసింది. ఇది వాల్యు టర్మ్స్‌లో రూ.149.2 లక్షల కోట్లుగా పేర్కొంది. 2019-20లో నమోదైన రూ.145.7 లక్షల కోట్ల జీడీపీ కంటే 2.4 శాతం ఎక్కువ. నామినల్ జీడీపీ 15.4 శాతంగా ఉంటుందని తెలిపింది. 1991లో ఇండియా తన ఎకానమీని సరళతరం చేసినప్పటి నుంచి ఇదే బలమైన వృద్ధి. 1947లో ఇండియాకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి చూసుకుంటే ఇదే హయ్యస్ట్ నామినల్ గ్రోత్. ఈ ఆర్థిక సంవత్సరం మాత్రం ఇండియన్ ఎకానమీ 7.7 శాతం పడుతుందని ఎకనమిక్ సర్వే అంచనావేసింది. కరోనా లాక్‌డౌన్‌లతో నాలుగు దశాబ్దాలలో తొలిసారి అత్యంత కనిష్ట స్థాయిలకు ఎకానమీ పడుతుందని తెలిపింది. అయితే వచ్చే రెండేళ్లలో ఇండియా వేగవంతమైన ఎకానమీగా ఎదుగుతుందని సర్వే అంచనావేసింది. ఈ వారం ప్రారంభంలో కూడా ఇండియా గ్రోత్ 2021లో 11.5 శాతం రికార్డు అవుతుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ తెలిపింది. కరోనా మహమ్మారి ఉన్నా.. ఈ ఏడాది రెండంకెల గ్రోత్‌తో ప్రపంచంలో మేజర్ ఎకానమీగా ఇండియా అవతరించనుందని పేర్కొంది. సంస్కరణల ద్వారా సప్లయి వైపు సమస్యలను పరిష్కరించడం, రెగ్యులేషన్స్‌ను సరళతరం చేయడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పెంచడం, ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా తయారీ రంగానికి బూస్టప్ ఇవ్వడం, సర్వీసెస్ సెక్టార్ డిమాండ్, వ్యాక్సిన్ లాంచ్, తక్కువ వడ్డీ రేట్లు వంటివి గ్రోత్‌కు సపోర్ట్ ఇవ్వొచ్చని ఎకనమిక్ సర్వే అంచనా వేసింది.
రైతుల రాబడిని రెండింతలు..
అగ్రికల్చర్ ఉత్పత్తిని బలోపేతం చేయాలని, రాబడిని రెండింతలు పెంచాల్సి ఉందని ఎకనమిక్ సర్వే చెప్పింది. గ్రామ స్థాయిలో ప్రొక్యూర్‌మెంట్, ప్రొడక్షన్‌కు, ప్రాసెసింగ్‌కు మధ్యన లింక్‌లు, రూరల్ మార్కెట్ల డెవలప్‌మెంట్, ఏపీఎంసీ మార్కెట్ వెలుపల అమ్ముకునే విధానం తేవడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెండింతలు పెంచవచ్చని ఎకనమిక్ సర్వే చెప్పింది. 2018-19తో ముగిసిన గత ఐదేళ్లలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు సగటున ప్రతేడాది 9.99 శాతం చొప్పున పెరిగాయని వెల్లడించింది. ప్రొడక్షన్ స్టేజ్‌లో, పోస్ట్ ప్రొడక్షన్‌లో అగ్రికల్చర్‌లో అవసరమైన సంస్కరణలు తేవాలని పేర్కొంది.
పన్నుల రాబడి తగ్గింది..
2020 ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో ప్రభుత్వం పొందిన గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ 12.6 శాతం తగ్గి రూ.10.26 లక్షల కోట్లుగా ఉంది. ఈ ఏడాది మొత్తంగా పొందే గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ కూడా రూ.24.2 లక్షల కోట్లకు పడుతుందని అంచనావేసింది. కేంద్రం పొందే ట్యాక్స్ రెవెన్యూను రాష్ట్ర ప్రభుత్వాలకు పంచుతుంది. ఈ పంపకాలు 2020 ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో 20.7 శాతం తగ్గి రూ.3.34 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఎకానమీ పడిపోవడం ఏ మేర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రభావం చూపిందో ఈ లెక్కల్లో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని పెంచడంతో ఎక్సైజ్ డ్యూటీ వసూళ్లు పెరిగాయి.
ఇండియన్ ఎకానమీ మళ్లీ నార్మల్ స్థాయికి వస్తుందని ఎకనమిక్ సర్వే సంకేతాలిచ్చింది. కన్జంప్షన్, సర్వీసెస్‌లో రికవరీ ఉంటాయనే అంచనాలున్నాయి. పూర్తి స్థాయి గ్రోత్‌ను సాధించడానికి సంస్కరణలను కొనసాగించాల్సి ఉంది. వచ్చే ఏడాది జీడీపీ గ్రోత్ 11 శాతం ఉంటుందని అంచనా వేయడం పాజిటివ్
అవుట్‌లుక్‌ను ప్రజెంట్ చేస్తుంది. ఇండియా చేపడుతోన్న మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది. కీలకమైన సర్వీసులన్ని మళ్లీ సాధారణ స్థాయికి తీసుకురావడానికి సాయపడుతుంది.
– దీపక్ సూద్, సెక్రటరీ జనరల్, అసోచామ్
For More News..