కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు డిలే.. రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతులు

 

  •     రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతులు
  •     కాంటాలు పెట్టక చెడగొట్టు వానలకు తడుస్తున్న వడ్లు    
  •     ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతుల ఆగ్రహం

 కామారెడ్డి , వెలుగు: రైతులకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు.  ఓ పక్క చెడగొట్టు వానలు అతలాకుతలం చేస్తుంటే .. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కాంటాల కోసం రైతులు పడిగాపులు పడాల్సి వస్తోంది.  రోజుల తరబడి వడ్లు కాంటా పెట్టకపోవడంతో ఆరిన వడ్లు మళ్లీ.. తడుస్తుండడంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కాంటాలు పెట్టించడంలో ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.   
జిల్లాలో యాసంగి సీజన్​లో   వడ్ల కొనుగోలుకు 346 సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆఫీసర్లు నిర్ణయించారు. ఇందులో    సొసైటీల ఆధ్వర్యంలో  324,   ఐకేపీ ఆధ్వర్యంలో  22 సెంటర్లు  ఉన్నాయి.  ఇప్పటి వరకు 204 సెంటర్లను   స్థానిక ప్రజాప్రతినిధులు , ఆఫీసర్లు     ప్రారంభించారు. కొన్ని ప్రాంతాల్లో  సెంటర్లు ఏర్పాటు చేసే నాటికి ముందే రైతులు వడ్లు తెచ్చి  కొనుగోలు కేంద్రాల ఆవరణలో ఆరబోశారు.  204 సెంటర్ల మొత్తంలో 9 సెంటర్లలోనే కాంటాలు సరిగా జరుగుతున్నాయి. మిగతా వాటిలో ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.  

పరిస్థితి ఇది...

 బాన్స్​వాడ, ఎల్లారెడ్డి  డివిజన్లలో  వరి కోతలు ముందే షురూ చేస్తారు.  ఈ సారి కామారెడ్డి డివిజన్​లో కూడా ముందే  మొదలయ్యాయి. ఈ సారి  5 లక్షల మెట్రిక్​ టన్నుల దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేశారు.  సెంటర్లు ప్రారంభించి  కాంటాలు పెట్టిన చోట  ఇప్పటి వరకు 109 కేంద్రాల్లో 30,100  మెట్రిక్​ టన్నుల వడ్లు కాంటా పెట్టారు.   ఒక్కో రైతు సెంటర్​లో  రెండు వారాలకు పైగా కాంటాలు కాక పడిగాపులు కాస్తున్నారు.     లక్షన్నర  మెట్రిక్​ టన్నులకు పైగా వడ్లు  సెంటర్లలోనే  కుప్పలుగా ఉన్నట్లు అంచనా.

 లింగంపేట, నాగిరెడ్డిపేట, రాజంపేట, ఎల్లారెడ్డి,  సదాశివనగర్​, రామారెడ్డి, భిక్కనూరు,  దోమకొండ,  నిజాంసాగర్​,  పిట్లం,  మండలాల్లోని సెంటర్లలో  వడ్ల కుప్పలు ఏడియాడనే ఉన్నాయి. 10 రోజులుగా జిల్లాలో  చెడగొట్టు వానలు  పడుతుండడంతో కుప్పలు తడిచిపోయాయి.  ఆరితే కానీ  కాంటాలు పెట్టలేమని  నిర్వాహకులు రైతులతో చెబుతున్నారు.  దీంతో వడ్లు మాయిశ్చర్​వచ్చినప్పుడు   సకాలంలో ఆఫీసర్లు కాంటాలు పెట్టి ఉంటే  తమకు నష్టం జరిగేది కాదని  రైతులు  వాపోతున్నారు. ఆఫీసర్ల డిలే వల్లనే వడ్లు తడిచి మొలకలు వస్తున్నాయని చెప్తున్నారు. 

కాంటాలు కాక ఇబ్బంది

వరి కోసి 12 రోజులయ్యింది.  ఆరోజే వడ్లు తెచ్చి సెంటర్​లో ఆరబోసినం. వడ్లు ఎండినయ్​ కూడా.  ఇంతలోనే  వాన పడ్డది. వారం రోజులుగా   పడుతూనే ఉండడంతో వడ్ల కుప్పలు అట్లనే  ఉంటున్నయ్.  వడ్లు తెచ్చినప్పుడే  వెంటనే కాంటా పెట్టి ఉంటే తడిసే పరిస్థితి
 రాకుండే. 
- రాజేందర్​, రైతు, కొండాపూర్​

ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం

రైతులకు ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం.  సెంటర్లు ఏర్పాటుచేసి  కాంటాలు పెట్టేలోపే వాన పడ్డది. ఈ పరిస్థితుల్లో   కొన్ని చోట్ల కాంటాలు పెట్టడం లేట్​ అయ్యింది.   కాంటాలు చేయటంలో  ఎక్కడా  డిలే చేయడం లేదు.
- అభిషేక్​,  డీఎం, సివిల్​సప్లై, కామారెడ్డి