వరంగల్, వెలుగు:స్మార్ట్ సిటీ వరంగల్ నడిబొడ్డున ఉన్న ఆ కాలనీవాసులు 20 ఏండ్లుగా దుర్భర జీవితం గడుపుతున్నారు. 300 కుటుంబాలకు చెందిన1500 మంది నిరుపేదలు ఇటు ఇంటి జాగల్లేక, అటు సర్కారు ఇస్తామన్న డబుల్ బెడ్‍రూం ఇండ్లు రాక అరిగోస పడుతున్నారు. విరిగిన రేకులు, ప్లాస్టిక్ కవర్లు, తడకల గుడిసెల్లోనే బతుకులు వెల్లదీస్తున్నారు. కరెంటోళ్లు మీటర్లు కూడా ఇవ్వకపోవడంతో రాత్రిళ్లు చీకట్లోనే మగ్గుతున్నారు. కాలనీలో రోడ్లు, మంచినీళ్లు కూడా లేవు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే లీడర్లు.. ఆ తర్వాత పత్తా లేకుండా పోతున్నారు. కాలనీవాసులకు ఇండ్ల జాగలు, డబుల్ బెడ్‍రూం ఇండ్లు ఇస్తామని, రోడ్లు వేయిస్తామని, భగీరథ నీళ్లు తెప్పిస్తామని హామీలు ఇచ్చి, తీరా ఓట్లు వేయించుకున్నాక కంటికి కనపడడం లేదు.
20 ఏండ్ల కింద వెలసిన కాలనీ..
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ 62, 63 డివిజన్ల పరిధిలో కాజీపేట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిలో 20 ఏండ్ల కింద వైఎస్ నగర్ కాలనీ ఏర్పాటైంది. అప్పటి కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో పేదలు దాదాపు 300 నుంచి 400 గుడిసెలు వేసుకున్నారు. ఒక్కో ఇంట్లో నలుగురైదుగురు ఉండడంతో వీరిని అడ్డుపెట్టుకుని పోరాటాలకు దిగిన గల్లీ లీడర్లు.. ఇప్పుడు కార్పొరేటర్ల స్థాయికి ఎదిగారు. ఎమ్మెల్యే, ఎంపీ, గ్రేటర్ ఎలక్షన్ల టైంలో ‘ఇండ్ల జాగలకు పట్టాలిప్పిస్తాం.. పక్కా ఇండ్లు కట్టిస్తాం. కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తాం’ అంటూ హామీలు ఇచ్చి, ఓట్లు దండుకున్న లీడర్లు.. ఆపై ముఖం చాటేశారు.
దుర్భర జీవితాలు..
వైఎస్‍ఆర్ నగర్ కాలనీలో 250 నుంచి 300 వరకు ఇండ్లు ఉన్నాయి. ఇవన్నీ రేకులు, ప్లాస్టిక్ కవర్లు, తడకలతో వేసుకున్న ఇండ్లే. చిన్నపాటి వర్షానికి 90 శాతం ఇండ్లు ఉరిసి, వస్తువులన్నీ తడుస్తుంటాయి. 20 నుంచి 30 గజాల స్థలంలో ఉండే చిన్న గుడిసెల్లో పిల్లాపాపలు, నడవలేని ముసలివాళ్లతో కాలం వెళ్లదీస్తున్నారు. ఎక్కడ చూసినా చీరలు, కవర్లతో కూడిన బాత్రూంలే ఉన్నాయి. చుట్టూరా పెద్ద పెద్ద బిల్డింగులు ఉండడంతో చీకటి సమయాల్లోనే స్నానం చేయాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు బాత్రూంలు ఇప్పిస్తామని ఫొటోలు తీసుకుని, డబ్బులు వసూలు చేసిన లీడర్లు.. ఆ నిధులను కూడా కాజేశారని మండిపడుతున్నారు. ఇండ్లకు ఇంటి నంబర్లు, స్థానికులకు ఓటు హక్కు కల్పించారు తప్పితే 20 ఏండ్లుగా ఒక్క అభివృద్ధి పని చేయలేదు. కరెంట్ ఆఫీసర్లు మీటర్లు కూడా మంజూరు చేయలేదు. ఒకవేళ తీగల నుంచి కరెంట్ తీసుకుంటే వేలకు వేలు ఫైన్లు విధిస్తున్నారు. నడవడానికి రోడ్లు, తాగటానికి మంచి నీళ్లు కూడా లేవు. దీంతో బోరు నీళ్లు లేదా ట్యాంకర్ నుంచి వచ్చిన నీటితోనే కాలం నెట్టుకొస్తున్నారు.
డబుల్ బెడ్‍రూం ఇండ్లిస్తామని.. ఇవ్వట్లే
ఉమ్మడి ఏపీలో అందరికీ ఇండ్ల జాగలు, ఇండ్లు కట్టిస్తామని చెప్పిన నాటి కాంగ్రెస్ లీడర్లు.. తెలంగాణ వచ్చాక టీఆర్‍ఎస్ లో చేరారు. వైఎస్‍ఆర్ నగర్ కాలనీ ప్రభుత్వ భూమిలో వెలసిందని, కాదు ప్రైవేటులో ఉందని చెబుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ నగర్ లోని పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని ఓట్లు వేయించుకున్నారు. అదే హామీతో ఎంపీ, గ్రేటర్ ఎన్నికల్లోనూ ఓట్లు దండుకున్నారు. ఇన్నాళ్లూ డబుల్ ఇండ్లు వస్తాయని ఆశపడగా, కేసీఆర్ సర్కారు కేవలం జాగ ఉన్నోళ్లకు మాత్రమే ఇల్లు కట్టుకోడానికి రూ.3లక్షలు ఇస్తామని ప్రకటించింది. దీంతో పేదలంతా ఆందోళన చెందుతున్నారు. వీలైతే డబుల్ బెడ్ రూం ఇండ్లు లేదంటే ఇండ్ల జాగలిచ్చి కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేయాలని
కోరుతున్నారు.
డబుల్ బెడ్‍రూం ఇండ్లు ఇస్తమన్నరు..
టీఆర్‍ఎస్ లీడర్లు ఇండ్ల జాగలు, డబుల్ బెడ్‍రూం ఇండ్లిస్తామని చెప్పిన్రు. ఇంతవరకు ఏ ఒక్కరికీ ఇల్లు ఇయ్యలేదు. ఓట్లప్పుడు వస్తున్నరు... మళ్లీ కనిపించట్లేదు. పుట్టిన బిడ్డలకు పెండ్లిడ్లు కూడా అవుతున్నాయి తప్పితే మాకు మాత్రం ఇండ్లు రావడం లేదు.
– రీల్ లక్ష్మి, కాలనీవాసి
వానొస్తే కాంప్లెక్స్ లోకి..
కూలి పనులు చేసుకుంటూ తడకల గుడిసెల్లో 20 ఏండ్లుగా ఉంటున్నం. వానొచ్చిందంటే పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉండే కాంప్లెక్స్ లోకి వెళ్లి తలదాచుకుంటాం. గుడిసెల్లో కరెంట్ లేదు. బాత్రూంలు లేవు. ఎక్కడినుంచి పాములు, తేళ్లు వస్తాయో తెలియదు. ప్రాణాలు చేతిలో పెట్టుకుని పిల్లలతో కలిసి బతుకుతున్నాం. ప్రభుత్వం ఇండ్లు ఇవ్వడానికి సిటీలో మాకంటే పేదోళ్లు ఎవ్వరుంటరు?
– బలిదే దేవి, కాలనీవాసి