- ఆ పార్టీ ఎన్నటికీ ప్రజల అంచనాలను అందుకోలేదని ఫైర్
న్యూఢిల్లీ: పార్లమెంట్ లో చర్చలు జరగకుండా కాంగ్రెస్ అడ్డుకుంటున్నదని ప్రధాని మోదీ మండిపడ్డారు. పార్లమెంట్ ను, ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మోదీ మాట్లాడారు. ‘‘ప్రజల చేత 80 నుంచి 90 సార్లు తిరస్కరణకు గురైనవారు.. కొందరితో గూండాయిజం చేయిస్తూ, పార్లమెంట్ ను నియంత్రించేందుకు తరచూ ప్రయత్నిస్తున్నారు.
వాళ్ల చర్యలను దేశ ప్రజలు గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా శిక్షిస్తారు” అని అన్నారు. ‘‘ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్యమంటే గౌరవం లేదు. ప్రజల ఆకాంక్షలూ ప్రతిపక్ష నేతలకు పట్టవు. ప్రజల విషయంలో వాళ్లెప్పుడూ బాధ్యత తీసుకోరు. ప్రజలను అర్థం చేసుకోరు. ప్రజల అంచనాలను ప్రతిపక్ష నేతలూ ఎన్నటికీ అందుకోరు” అని విమర్శించారు.
సమావేశాలు సజావుగా జరగాలి..
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చలు సవ్యంగా జరగాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. వింటర్ సెషన్ ఎంతో ముఖ్యమైనదని అన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏండ్లు అవుతున్నదని, మంగళవారం సంవిధాన్ సదన్ లో రాజ్యాంగ దినోత్సవం జరుపుకుందామని చెప్పారు. అన్ని పార్టీల నుంచి ఎన్నికైన కొత్త సభ్యులకు పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం లభించాలన్నారు. ‘‘కొత్తగా ఎన్నికైన సభ్యులు దేశ అభివృద్ధి కోసం కొత్త ఐడియాలతో వస్తారు. ప్రజల ప్రతినిధులుగా మనందరం వాళ్ల ఆకాంక్షలను గౌరవించాలి” అని పిలుపునిచ్చారు. ఈ సెషన్ బాగా జరుగుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.