ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించిన ఆయన.. క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మోడీ... రైలు ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించామని, ప్రమాదానికి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రైలు ప్రమాదం చాలా దురదృష్టకరమన్న మోడీ.. ఈ ఘటనలో చాలా రాష్ట్రాల ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని చెప్పారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయక చర్యల్లో ఒడిశా ప్రభుత్వం అన్ని విధాల సహకరించిందని మోడీ చెప్పుకొచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మోడీ అదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులకు మోడీ ధన్యవాదాలు తెలిపారు.
ఒడిశా రైలు ప్రమాద బాధితులకు కేంద్రం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఆర్థికసాయం, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 2 లక్షలు, స్వల్పంగా గాయాలపాలైనవారికి రూ. 50 వేలు ఆర్థిక సాయం ప్రకటించింది.