ఏజెంట్ల మోసాలకు..బలైతున్నరు

కామారెడ్డి, వెలుగు: ఏజెంట్ల మాటలు నమ్మి కంపెనీ వీసాపై కాకుండా, విజిట్​ వీసాపై విదేశాలకు వెళ్తున్నవారు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్​జిల్లాలోని సదాశివ్​నగర్, రామారెడ్డి, మాచారెడ్డి, లింగంపేట,  రాజంపేట, కామారెడ్డి, దర్పల్లి, సిరికొండ, ఆర్మూర్, బీమ్​గల్​ఏరియాల నుంచి ఎక్కువ సంఖ్యలో గల్ఫ్, మలేషియా దేశాలకు వెళ్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు లక్షా 40 వేల మంది వివిధ దేశాల్లో పనిచేస్తున్నారు. ఇందులో 30 వేల మంది విజిట్​వీసాలపై వెళ్లినవారు ఉన్నారు. విజిట్​వీసాపై వెళ్లి గల్ఫ్​దేశాల్లో పని చేస్తున్న వారి వీసాలను ఏజెంట్లు మళ్లీ కంపెనీ వీసాలుగా మారుస్తున్నారు. మరికొందరు విజిట్​వీసాపై ఏండ్ల తరబడి అక్కడే ఉంటూ జైళ్లల్లో మగ్గుతున్నారు. ఏజెంట్ల మోసాలు చాలా సార్లు బయటపడుతున్నా యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదు.

మలేషియాలో నరకం..

ఇటీవల కాలంలో కామారెడ్డి, నిజామాబాద్ ​జిల్లాలకు చెందిన 4 వేల మలేషియా వెళ్లారు. వీరిలో సగం మంది విజిట్​వీసాపై వెళ్లే వారే. ఫస్ట్​ విజిట్​వీసా వస్తుందని, అక్కడకు వెళ్లిన తర్వాత కంపెనీ వీసా వస్తుందని నమ్మిస్తున్నారు. తీరా అక్కడికు చేరిన తర్వాత చాలా మంది నరకం అనుభవిస్తున్నారు. జీతం తక్కువ ఇస్తున్నారు. ఒక పని అని చెప్పి మరో పని చేయిస్తున్నారు. అక్కడి ఏజెంట్లను ప్రశ్నిస్తే  భౌతికంగా దాడులు చేస్తున్నారు. మాచారెడ్డి మండలం ఇసాయిపేటకు చెందిన ఓ యువకుడు 6 నెలల కింద తీవ్రగాయాలతో ఇంటికొచ్చాడు. నెలల తరబడి కొందరి ఆచూకీ తెలియక, ఫోన్లు రాక ఇక్కడ ఉన్న వారి ఫ్యామిలీ మెంబర్స్​ఆందోళన చెందుతున్నారు.  ఇటీవల కామారెడ్డి జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన సుమారు 50 మంది తిరిగి రిటర్న్​వచ్చారు.    

ఫొటోలో దీనంగా కూర్చున్న తల్లీబిడ్డలు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్​వాయి చెందిన పురం నాగమణి, రాధిక, నిఖిల. నాగమణి భర్త సిద్ధరాములు(46) రూ.లక్ష అప్పుజేసి కొన్ని నెలల కింద మస్కట్​ వెళ్లాడు. కంపెనీ వీసా అని చెప్పిన ఏజెంట్, విజిట్​వీసా పై పంపాడు. వీసా గడువు కంప్లీటవడంతో పనిలో నుంచి బయటకు పంపారు. దీంతో అక్కడఇక్కడ అడుక్కొని తినేవాడు.10 రోజుల కింద ఫోన్​చేసి భార్య, బిడ్డలతో మాట్లాడాడు. రోడ్డు పక్కన ఓ చోట పడిపోయి ఉండగా, వివరాలు కనుక్కొని సిద్ధరాములు వీడియో తీసినట్లు ఇక్కడి ఫ్యామిలీ మెంబర్స్, ఏజెంట్​కు పంపారు. 4 రోజుల కింద సిద్ధరాములు చనిపోయినట్లు సమాచారం వచ్చింది. కంపెనీ వీసా అని చెప్పి, టూరిస్ట్ వీసాపై పంపడంతో అవస్థల పాలై, చనిపోయాడని తమను ఆదుకోవాలని నాగమణి వేడుకుంటోంది.

ఫొటోలో ఉన్నది కామారెడ్డి జిల్లా శాబ్దిపూర్​తండాకు చెందిన బాదావత్ ​గణేశ్. 4 ఏండ్ల కింద రూ.65 వేలు అప్పుజేసి కంపెనీ వీసాపై సౌదీ వెళ్లి కుక్​గా పని చేశాడు. రెండున్నర ఏండ్లకు సొంతూరు వచ్చాడు. కొన్నాళ్లకు ఏజెంట్ మాటలు నమ్మి మలేషియా వెళ్లాడు. వీసా, టెస్టులు, ఫ్లైట్​ టికెట్ ​కోసం రూ.లక్ష అప్పు చేసి 2022, జూన్​లో వెళ్లాడు. కంపెనీ వీసా, సెక్యూరిటీ గార్డు ఉద్యోగమని చెప్పి ఏజెంట్​ విజిట్ ​వీసాపై పంపాడు. ఇతడితో పాటు వెళ్లిన 9 మందిని కంపెనీ దగ్గర పని అని చెప్పి తీసుకెళ్లారు. టౌన్​లో సేకరించిన చెత్తను వేరు చేసే కంపెనీ అది. అక్కడ వాసన భరించలేక ఏజెంట్​కు ఫోన్​చేస్తే, మళ్లీ ఓ కంపెనీకి అని చెప్పి మరో చోటికి మార్చారు. 

ALSOREAD:కార్పొరేటర్ల మధ్య విభేదాలు లేవు

6 నెలలపాటు అవస్థలు పడ్డాడు. టూరిస్ట్ ​వీసా గడువు అయిపోతోందని ఏజెంట్​ను ప్రశ్నిస్తే, కంపెనీ వీసా వస్తుందని నమ్మించాడు. సామాన్లు కొనేందుకు షాప్​కి వెళ్లగా పోలీసులు ఇతన్ని పట్టుకొని తీసుకెళ్లారు. వీసా లేకపోవడంతో కోర్టులో హాజరుపరిచి జైల్లో వేశారు. 6 నెలలు జైలులో నరకం అనుభవించాడు. ఆఫీసర్లకు తెలియకుండా జైలులో ఉన్న సంగతిని పేపర్​పై రాసి, జైలు నుంచి రిలీజయ్యే ఇతర స్టేట్​కు చెందిన వ్యక్తుల ద్వారా ఫ్యామిలీ మెంబర్స్​కు, ఏజెంట్​కు పంపించాడు. మైగ్రెట్స్​ రైట్స్ ​అండ్ ​వెల్ఫేర్ ​ఫోరం ​వారి సాయంతో జైలు నుంచి రిలీజై ఈ నెల 23న ఇంటికి వచ్చాడు.