లెక్కలు రాని వారు లెక్కలోకి రారా? : సీనియర్ జర్నలిస్ట్ హన్మిరెడ్డి

‘‘యువకుడా.. గణితంలో నీకు విషయాలు అర్థం కావు. వాటిని అలవాటు చేసుకోవాలంతే..’’ అంటాడు ప్రఖ్యాత హంగేరియన్ అమెరికన్ సైంటిస్ట్ జాన్ వాన్ న్యూమన్. లెక్కలు నేర్చుకుంటే లాజిక్ తెలుస్తదంటరు మ్యాథమెటీషియన్లు. కానీ.. అసలు లెక్కల్లో ఉన్న లాజిక్ ఏంటో అర్థం కాకనే చాలా మంది గణితం అంటే ఆమడదూరం పారిపోతుంటరు. లెక్కలు అనే సబ్జెక్ట్ కొందరికి నీళ్లు తాగినంత ఈజీగా ఉంటది. కానీ చాలా మందికి మాత్రం ఆ సైన్ టీటాలు, కాస్ టీటాలు, ఫార్ములాలు అర్థం కాక.. మైండ్ అంతా గజిబిజి మేళం గందరగోళం అయిపోతది. ఏదో ఎగ్జాంలో పాస్ కావడానికి తప్పదని హైస్కూల్​లో అందరూ ‘ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్’ ఫార్ములాను బట్టీ పడ్తరు కానీ..  దాన్ని నేర్చుకుని, రియల్ లైఫ్ లో ఎట్లా యూజ్ చేసుకోవాల్నో మాత్రం ఎప్పటికీ సమజ్ కాదు. నిజానికి చిన్నప్పుడు లెక్కలు బాగా చెప్పే సారోళ్ల చేతిలో పడితేనే కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారం వంటి బేసిక్స్ అయినా వస్తయి. మంచి లెక్కల సారోళ్లు దొరకనోళ్లకు ఈ మాత్రం లెక్కలూ రాకపోవడం పెద్దగా సర్ ప్రైజ్ అవ్వాల్సిన ముచ్చటేమీ కాదు. అయితే లెక్కలు నేర్చుకున్నోళ్ల బ్రెయిన్ కొంచెం షార్ప్ గా పని చేస్తదట. 16 ఏండ్లకే లెక్కల సబ్జెక్ట్ ను పక్కనపెట్టేవాళ్లకు మాత్రం బ్రెయిన్ ఎదుగుదలపై కొంచెం ఎఫెక్ట్ పడుతుందట. బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ రీసెర్చర్లు పోయినేడాదే లెక్కగట్టి మరీ ఈ సంగతి బయటపెట్టిండ్రు. అంతేకాదు.. లెక్కల్లో కొంచెం హుషారు ఉన్నోళ్లు జీ(వి)తంలో కూడా కొంచెం ముందుంటారని బ్రిటన్ లోని యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్ హామ్ రీసెర్చర్లు చేపట్టిన మరో స్టడీలో తేలింది. బ్రిటన్ లో అడ్వాన్స్​డ్ లెవల్(మన దేశంలో ఇంటర్ మీడియెట్ లెవల్) దాకా మ్యాథ్స్ సబ్జెక్ట్ చదివినోళ్లు, అంతకు తక్కువ చదివినోళ్లతో పోలిస్తే.. 33 ఏండ్లు వచ్చే నాటికి వారిలో A లెవెల్ దాకా గణితం చదివినోళ్ల జీతాలు11 శాతం ఎక్కువగా ఉన్నాయని రీసెర్చర్లు తేల్చిచెప్పిన్రు. 

ఆఖరి ముచ్చట..

మన దేశంలోనూ స్టూడెంట్లు లెక్కల్లో పూర్ గానే ఉంటున్నరని సర్వేల్లో తేలింది. 2021 నేషనల్ అచీవ్ మెంట్ సర్వే లెక్కల ప్రకారం.. 3,5,8,10 క్లాసుల్లోని 34 లక్షల మంది స్టూడెంట్ల లెక్కల నాలెడ్జ్ ను టెస్ట్ చేస్తే, 32 % మంది మాత్రమే వారి క్లాసుకు తగ్గ పర్ఫార్మెన్స్ చూపించారని వెల్లడైంది. ఇక ఇంటర్, డిగ్రీ పూర్తి చేసినోళ్లు కూడా లెక్కల్లో అంతంత మాత్రమే ఉంటున్నరు. అయితే, బ్రిటన్ మాదిరిగా మన దేశంలో కూడా ఇంటర్ దాకా లెక్కల సబ్జెక్ట్ ను కంపల్సరీ చేయాలన్న డిమాండ్ వస్తే మాత్రం పెద్ద చిక్కే! 

అసలు ముచ్చట.. 

బ్రిటన్ జనాల్లో లెక్కల నాలెడ్జ్ తక్కువగా ఉందని, అందుకే 18 ఏండ్లు వచ్చే దాకా ప్రతి ఒక్కరూ మ్యాథ్స్ తప్పనిసరిగా చదవాల్సిందేనంటూ ఆ దేశ ప్రధాని రిషి సునాక్ ఇటీవల ప్రకటించారు. ఇంగ్లాండ్ లో 80 లక్షల మందికి మాత్రమే ప్రైమరీ స్కూల్ పిల్లల స్థాయి లెక్కల నాలెడ్జ్ ఉందని స్వయంగా ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తేలిందన్నరు. ఇప్పుడు ప్రతి జాబ్ లోనూ డేటా, స్టాటిస్టిక్స్, అనలిటికల్ స్కిల్స్ కు ఇంపార్టెన్స్ పెరిగిందని, ఈ స్కిల్స్ అలవడాలంటే A లెవెల్ మ్యాథ్స్ దాకా చదవడం తప్పనిసరని తేల్చేశారు. అయితే, మ్యాథ్స్ తో లాజికల్, అనలిటికల్, ప్రాబ్లమ్ సాల్వింగ్  స్కిల్స్ పెరిగే మాట నిజమే అయినా.. అందరికీ ఒకే స్థాయిలో లెక్కలు ఎలా అబ్బుతాయంటూ పలువురు మేధావులు, ప్రముఖులు రిషి సునాక్ నిర్ణయంపై పెదవివిరుస్తున్నరు. లెక్కలకు, జెనెటిక్స్ కు సంబంధం ఉందని, అందరూ ఒకే స్థాయిలో లెక్కలు నేర్చుకోలేరన్న స్టడీస్ సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నరు. పేరెంట్స్ లెక్కల నాలెడ్జ్ ను బట్టే పిల్లలకూ లెక్కల నాలెడ్జ్ అబ్బుతుందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పిట్స్ బర్గ్ సైంటిస్టులూ 2016లోనే తేల్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నరు. అందరికీ18 ఏండ్ల దాకా లెక్కలను తప్పనిసరి చేస్తే.. దేశంలో అందరూ లెక్కల్లో ఎక్స్ పర్ట్ లు అయిపోతారని చెప్పలేమని పలువురు సైంటిస్టులు అంటున్నారు.  అసలు మ్యాథ్స్ కూ జెనెటిక్స్ కు సంబంధం ఉందని, ‘రోబో 1’ అనే జీన్ పిల్లల్లో లెక్కల నాలెడ్జ్ స్థాయిని డిసైడ్ చేస్తుందని 2020లోనే జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ సైంటిస్టులు తేల్చారని అంటున్నరు. ఎడమచేతి వాటం ఉన్నోళ్లకు బ్రెయిన్ లో రైట్ సైడ్ ఎక్కువగా డెవలప్ అవుతుంది కాబట్టి, వారికి లెక్కల నాలెడ్జ్ కొంచెం ఎక్కువగానే ఉంటుందన్న స్టడీలనూ గుర్తుచేస్తున్నరు. పిల్లలపై బలవంతంగా లెక్కలను రుద్దితే.. మ్యాథ్స్ యాంగ్జైటీకి గురవుతారని, ఇతర సమస్యల బారిన పడతారని హెచ్చరిస్తున్నరు. 

- హన్మిరెడ్డి యెద్దుల, 
సీనియర్ జర్నలిస్ట్