నల్గొండలో రగిలిపోతున్న.. అసమ్మతి నేతలు

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్​టికెట్​దక్కని ఆశావహులంతా రగిలిపోతున్నారు. ఎమ్మెల్యే టికెట్​ఆశించిన ముఖ్య నేతల్లో నకిరేకల్​ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్​ (ఆలేరు), మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్​రెడ్డి కొడుకు అమిత్​ రెడ్డి, కర్నాటి విద్యాసాగర్​(మునుగోడు), సినీ హీరో అల్లు అర్జున్​మామ కంచర్ల చంద్రశేఖర్​ రెడ్డి, మన్నెం రంజిత్ యాదవ్​ (సాగర్), పిల్లి రామరాజు యాదవ్​, చాడ కిషన్​ రెడ్డి (నల్గొండ), కన్మంత శశిధర్​ రెడ్డి (కోదాడ) ఉన్నారు.

టికెట్ దక్కిన ఎమ్మెల్యేలంతా మంత్రి జగదీశ్​రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్​లో సీఎంను కలిసి కృతజ్ఞతలు చెప్పేందుకు వెళ్లగా, ఆయా నియోజకవర్గాల్లోని ఆశావహులు భవిష్యత్​ కార్యచరణపై తమ అనుచరులతో సమావేశమవుతున్నారు. మంగళవారం నాగార్జునసాగర్, దేవరకొండ, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల వ్యతిరేక వర్గం భేటీ కాగా, నకిరేకల్​, కోదాడ, నల్గొండ, మునుగోడులో ఆశావహులు, అసంతృప్తులు ఒకటిరెండు రోజుల్లో భారీ సమావేశాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బుధవారం నకిరేకల్​లోని ఓ ఫంక్షన్​ హాల్​లో ఆత్మీయ సమావేశం నిర్వహించబోతున్నారు. దీనికి నియోజకవర్గంలోని వీరేశం అనుచరులు, బీఆర్ఎస్ లీడర్లందరినీ ఆహ్వానించారు. వాళ్ల అందరితో చర్చించి బుధవారం ఆయన నిర్ణయాన్ని ప్రకటిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి సపోర్ట్​తో కాంగ్రెస్​లో చేరేందుకు వీరేశం సిద్ధమైనట్లు తెలిసింది.