రేషన్​ కార్డులు లేనోళ్లకి..గృహలక్ష్మి ఉత్తదేనా?

రేషన్​ కార్డులు లేనోళ్లకి..గృహలక్ష్మి ఉత్తదేనా?
  • 2016 నుంచి కొత్త రేషన్​ కార్డులు ఇవ్వని సర్కార్
  • మహిళల పేర్లపై 30 నుంచి 40 శాతం లోపు ప్లాట్లు
  • పాలమూరు జిల్లాలో ఆర్థికసాయం కోసం 41 వేల అప్లికేషన్లు

మహబూబ్​నగర్, వెలుగు : సొంత జాగ ఉన్నవాళ్లు ఇల్లు కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ‘గృహలక్ష్మి’ స్కీంకు వైట్​ రేషన్​ కార్డు లేని వారు దూరమవుతున్నారు. గృహలక్ష్మి పథకం కింద వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. మహిళల పేరు మీద జాగ ఉండకపోవడం, వైట్​ రేషన్​ కార్డు లేకపోవడంతో చాలా మంది అర్హులైన పేదలు దరఖాస్తు చేసుకోలేక పోయారు.

రేషన్​కార్డులు లేక..

జిల్లాలోని మహబూబ్​నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాలుండగా, నియోజకవర్గానికి 3 వేల చొప్పున మొత్తం 9 వేల మందికి గృహలక్ష్మి కింద లబ్ధి చేకూరనుంది. మొదటి రోజు 2 వేల అప్లికేషన్లు రాగా, బుధవారం 18 వేలు, గురువారం 21 వేల చొప్పున మొత్తం 41వేల అప్లికేషన్లు వచ్చాయి. అయితే, ప్లాట్​ డాక్యుమెంట్లు, ఆధార్​తో పాటు రేషన్​ కార్డును తప్పనిసరి చేయడంతో చాలా మంది స్కీంకు దూరం అవుతున్నారు. 2016 నుంచి రేషన్​ కార్డుల జారీ నిలిచిపోయింది. కొత్తగా పెళ్లైన వారు, ఉమ్మడి కుటుంబాల నుంచి విడిచిపోయిన వారు కొత్త రేషన్​ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. కానీ వీరికి రేషన్​ కార్డులు శాంక్షన్​ చేయలేదు. దీంతో ఒక్క పాలమూరు జిల్లాలోనే దాదాపు 30 వేల మంది కొత్త రేషన్ ​కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో దాదాపు 8 వేల మంది సొంత జాగ ఉన్నవారు ఉన్నట్లు సమాచారం.

గిఫ్ట్​ డీడ్​ చేయాలంటే వేలల్లో ఖర్చు..

ప్లాట్​ మహిళల పేరు మీద ఉంటేనే స్కీం వర్తించనుండడంతో చాలా మంది అనర్హులుగా మిగిలిపోతున్నారు. జిల్లాలో దాదాపు 50 శాతం నుంచి 65 శాతం ప్లాట్లు పురుషుల పేర్ల మీద రిజిస్ట్రేషన్​ అయి ఉన్నాయి. దీంతో భర్తల పేరు మీద నుంచి భార్యల పేరు మీదకు గిఫ్ట్​ డీడ్​ చేయాలన్నా, తల్లుల పేరు మీద, కూతుళ్ల పేరు మీద రిజిస్ట్రేషన్​ చేయాలన్నా వేలల్లో ఖర్చు అవుతోంది. ఉదాహరణకు జిల్లాలోని మహబూబ్​నగర్, జడ్చర్ల సబ్​ రిజిస్ట్రార్ల పరిధిలో 80 గజాల నుంచి 120 గజాల ప్లాటుకు మార్కెట్ వ్యాల్యూను బట్టి రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు రిజిస్ట్రేషన్​ ఫీజు అవుతోంది. దీంతో చాలా మంది అప్లై చేసుకోవడానికి కూడా ముందుకు రావట్లేదు. అలాగే గిఫ్ట్​ డీడ్​ చేయాలన్నా, రిజిస్ట్రేషన్​ చేయాలన్నా వారం రోజుల టైం పట్టే అవకాశం ఉండడంతో సైలెంట్​గా ఉంటున్నారు.

అన్నా.. మాకే వచ్చేట్టు చూడండి

ఇదిలా ఉంటే గ్రామాల్లో రూలింగ్​ పార్టీల లీడర్లు స్కీం తమకే వర్తింపజేయాలని కోరుతున్నారు. జిల్లాకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు ఆయా మండలాల్లో ఇటీవల సర్పంచులు, ఎంపీటీసీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సర్పంచులు, ఎంపీటీసీలు మాట్లాడుతూ తాము ఏండ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నామని, ఈ స్కీం తాము సిఫార్సు చేసిన వారికి అందేలా చూడాలని కోరినట్లు తెలిసింది. దీనికితోడు కొందరు లీడర్లు వారికి అత్యంత సన్నిహితులైన వారితో అప్లై చేయించారని సమాచారం.

భార్యాభర్తలను అర్హులుగా గుర్తించాలి..

ప్లాట్​ నా పేరు మీద ఉంది. అవకాశం ఇస్తారేమోనని భార్యతో కలిసి స్కీంకు అప్లై చేసుకుందామని వచ్చాను. ఆఫీసర్లు అవకాశం లేదని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితిలో నా భార్య పేరు మీద ప్లాట్​ను గిఫ్ట్​ డీడ్​ చేయాలంటే రూ.60 వేలు రిజిస్ట్రేషన్​ ఫీజుకే అవుతోంది. ఈ స్కీంకు ప్రభుత్వం భార్యాభర్తలను అర్హులుగా ప్రకటించాలి.

- ఆనంద్, మహబూబ్ నగర్