కామారెడ్డి, వెలుగు: ఎవరేం చేస్తున్నారో మా దగ్గర రిపోర్టులున్నాయి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు‘ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. విభేదాలు వీడి పార్టీ కోసం పని చేయాలన్నారు. భారీ మెజార్టీ లక్ష్యంగా సమష్టిగా కృషి చేయాలన్నారు. కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, లీడర్లతో బుధవారం మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కామారెడ్డి నియోజకవర్గంలోని మండలాల వారీగా లీడర్లతో మంత్రి భేటీ అయ్యారు. కొందరు నేతలు కొంత మందికే ప్రయార్టీ ఇస్తున్నారని, వార్డుల్లో ఫండ్స్ కేటాయింపుల్లో కూడా వివక్ష చూపారని, పార్టీకి నష్టం వచ్చే పనులు చేస్తున్నారంటూ పలువురు ఫిర్యాదు చేశారు.
పార్టీ నేతలు ఎవరు కూడా విభేదాలు పెట్టుకోవద్దన్నారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఆయా మండలాలు, టౌన్లలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, కాంగ్రెస్, బీజేపీ పరిస్థితులపై కూడా లీడర్లను మంత్రి కేటీఆర్అడిగి తెలుసుకున్నారు. మీటింగ్‌లో విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జహీరాబాద్ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, పార్టీ జిల్లా ప్రెసిడెంట్ఎంకే ముజీబోద్దీన్, ముఖ్య నేతలు కొమ్ముల తిర్మల్‌రెడ్డి, నిట్టు వేణుగోపాల్‌రావు, పున్న రాజేశ్వర్, మామిండ్ల అంజయ్య, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ ప్రెసిడెంట్లు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
పలువురు కౌన్సిలర్ల కినుక
తమకు మీటింగ్‌కు పిలవలేదని, వివిధ అంశాల్లో తమపై వివక్ష చూపుతున్నారని కామారెడ్డి మున్సిపాలిటీకి చెందిన పలువరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు అలక బూనారు. హైదరాబాద్‌లో నిర్వహించే మీటింగ్‌కు కొంతమంది కౌన్సిలర్లకే సమాచారమిచ్చి, మరి కొందరికి ఇవ్వలేదంటూ పది మంది కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్ల భర్తలు కామారెడ్డి శివారులోని ఓ ఫామ్‌హౌజ్‌లో సమావేశమయ్యారు. కొన్ని వార్డులకే ఎక్కువ ఫండ్స్ ఇచ్చారని, పార్టీ మీటింగ్‌లు, ప్రోగ్రామ్స్ల్లోనూ కొంత మందికే ప్రయార్టీ ఇస్తున్నారన్నారు. పార్టీ ముఖ్యనేతల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని మీటింగ్‌లో చర్చించారు.