
కాశీబుగ్గ, వెలుగు : గిరిజన మహిళను కులం పేరుతో దూషిస్తూ, కొట్టిన ఎక్సైజ్ సీఐ రమేశ్ చంద్రను సస్పెండ్ చేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం వరంగల్ నగరంలోని చింతల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు అజ్మీర వెంకట్ మాట్లాడుతూ బతుకుదెరువు కోసం వరంగల్ వచ్చి, ఇంటికి వెళ్లేందుకు రోడ్డు పక్కన నిల్చున్న బుజ్జిపై ఎక్సైజ్ సీఐ రమేశ్ చంద్ర, కానిస్టేబుల్, డ్రైవర్ కలిసి దాడి చేయడం సరికాదన్నారు. సీఐతో పాటు మిగతా వారిపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో ట్రాఫిక్ నిలిచిపోవడంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి వారితో మాట్లాడారు. అయినా రాస్తారోకో విరమించకపోవడంతో పోలీసులు, నాయకుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం ధర్నా చేస్తున్న వారిని అరెస్ట్ చేసి మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.