బానిస బతుకులు గడిపేవారికి స్వేచ్ఛగా ఆలోచించే మనసుండదు

వ్యక్తిగా, సమాజంగా, ప్రాంతంగా, దేశంగా మనం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలంటే స్వేచ్ఛగా(ఇతరుల ఆలోచనల ప్రభావం లేకుండా), స్వచ్ఛంగా(సర్వహిత కాంక్షతో) ఆలోచించే పరిస్థితులుండాలి. బానిస బతుకులు గడిపేవారికి స్వేచ్ఛగా ఆలోచించే మనసు ఉండదు. ఎంతసేపూ, బానిసత్వం నుంచి ఎలా బయటపడదామనే ఆలోచనే. ఆ పూటకు కడుపునిండితే చాలనుకునే వారి పరిస్థితి మరీ దారుణం. అందుకే పరిస్థితులు నాటివైనా, నేటివైనా మనం బావిలోనే ఉన్నామనుకునే ఆలోచన నుంచి బయటపడాలి. సమాజాభివృద్ధి కోసం స్వచ్ఛమైన మనసుతో ఆలోచించి అమల్లోకి తీసుకురావాలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీలో చెప్పినట్లుగా ‘కదం కదం బఢాయెజా, ఖుషీకా గీత్ గాయెజా’ అనే గీతం స్ఫూర్తితో ముందుకెళ్లాలి. అప్పుడే స్వరాజ్యమైనా, సురాజ్యమైనా సాధ్యమవుతుంది. ఇందుకు నిజాం అరాచక, నియంతృత్వ పాలన నుంచి బయటపడేందుకు మన పెద్దలు చేసిన పోరాటమే మనకు స్ఫూర్తి కావాలి.

రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం

1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దేశమంతా సంబరాల్లో తేలియాడుతుంటే మన హైదరాబాద్ సంస్థానం ప్రజలు(నేటి తెలంగాణ, మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతం, కర్నాటకలోని నాలుగు జిల్లాలు) మాత్రం మనమెప్పుడు స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటామా అని ఆలోచనతోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. రజాకార్ల రాక్షస కృత్యాలను అడ్డుకుంటూ మన పెద్దలు కొందరు తీసుకున్న చొరవ కారణంగానే.. యావత్ హైదరాబాద్ సంస్థానం ప్రజల్లో ‘మన ప్రాంతం భారతదేశంలో విలీనం కావాలి, మనకు కూడా స్వాతంత్ర్యం కావాలి’ అన్న చైతన్యం వచ్చింది. దీంతో ఎక్కడికక్కడ రజాకార్లకు, వారికి అండతో రెచ్చిపోయిన కొందరు దేశ్‌‌ముఖ్‌‌లను ఎదుర్కోవడం ప్రారంభించారు. కొమురం భీం, రాంజీ గోండు, షోయబుల్లా ఖాన్, వందేమాతరం రామచందర్రావు, నారాయణరావు పవార్, చిట్యాల ఐలమ్మ, సురవరం ప్రతాపరెడ్డి, సర్దార్ సర్వాయి పాపయ్య గౌడ్, సుద్దాల హనుమంతు, కాళోజీ నారాయణ రావు, దాశరథి రంగాచార్య, దాశరథి కృష్ణమాచార్యులు, కొండా లక్ష్మణ్ బాపూజీ, రావి నారాయణ రెడ్డి, కేవీ రంగారెడ్డి వంటి మహనీయులెందరో తమ ప్రాంతాల్లో రజాకార్ల వ్యతిరేక ఉద్యమాలకు వేర్వేరు పేర్లతో నేతృత్వం వహించారు. 

ఆపరేషన్ ​పోలో

హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కాకపోవడం, పైగా కంటిలో నలుసులా మారి మన ప్రజలను ఇబ్బంది పెడుతుండటంపై జాతీయ స్థాయిలోనూ తీవ్రమైన చర్చలు జరిగాయి. పాకిస్తాన్ ఆలోచనలతో స్వతంత్ర దేశంగా ఉండేందుకు నిజాం ప్రయత్నాలు చేస్తుండటంతో కొందరు ఢిల్లీ పెద్దలు మరోసారి నిజాంతో చర్చలు జరపాలని  పట్టుబట్టారు. కానీ నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ మాత్రం ఈ ఆలోచనలకు ససేమిరా అన్నారు. బానిసల్లాగా మనమెందుకు ఆలోచించాలి? రజాకార్ల గర్వమణిచి, హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలకు స్వేచ్ఛావాయువులు పీల్చుకునే అవకాశం నేను కల్పిస్తానంటూ ‘ఆపరేషన్ పోలో’కు శ్రీకారం చుట్టి నిజాం మెడలు వంచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచన కూడా ఇలాంటిదే. మనం ఎప్పుడైతే బానిస ఆలోచనల నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛగా ఆలోచించడం ప్రారంభిస్తామో అప్పుడన్నీ సానుకూల ఫలితాలే కనబడతాయని ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి చెప్పారు.

ఎన్నికల్లో గెలుపు కోసమేనా?

భారతదేశంలో హైదరాబాద్ ప్రాంతం విమోచనం కోసం తమ  ప్రాంతాల నుంచి కృషిచేసిన వారికి మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు(ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ) ఏటా సెప్టెంబర్17ను గుర్తు చేసుకుంటున్నాయి. స్వామి రామానంద తీర్థ, పీహెచ్ పట్వర్ధన్, గోవిందబాయ్ ష్రాఫ్, విజయంత్ర కబ్ర వంటి వారి పోరాటాలకు ఆయా ప్రాంతాల్లో సరైన గౌరవం కూడా లభిస్తోంది. కానీ నిజాం పాలనకు కేంద్రమైన హైదరాబాద్(నేటి తెలంగాణ)లో మాత్రం ఇంకా బానిస ఆలోచనలు పోలేదు. అరాచక పాలన నుంచి విముక్తి జరిగి 75 ఏండ్లు గడుస్తున్నా.. పైన పేర్కొన్న పోరాట యోధులకు, స్ఫూర్తి  దీపికలకు గుర్తింపు దక్కడం పక్కనపెడితే వారు ఏ నిజాంపైన అయితే పోరాడారో ఆ రజాకార్ల ఆలోచన ప్రతిరూపమైన మజ్లిస్ తో అంటకాగుతూ బతకాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మన ప్రభుత్వాలకు దాపురించింది. నాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో, నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ ఏ పార్టీ అధికారంలో ఉన్నా మజ్లిస్ తో దోస్తీ కోసం అర్రులు చాస్తుండటం తెలంగాణ ప్రజలకు, వారి త్యాగాలతో మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చిన మన పెద్దలకు తీవ్రమైన అవమానం తప్ప మరొకటి కాదు. రజాకార్ల పోరాటాల నుంచి మన ప్రాంతాన్ని విముక్తం చేయడంలో ముస్లింలు, హిందువులు, ఆ కులపోళ్లు, ఈ కులపోళ్లు, పేదోళ్లు, పెద్దోళ్లు అనే తేడా లేకుండా అందరూ పనిచేశారు. కానీ ఆ తర్వాత, వీటన్నింటినీ పక్కనపెట్టి, జాతీయవాదం అనే భావనకు చోటు కల్పించకుండా, కేవలం కొందరిని ‘సంతృప్తి’ పరిచే రాజకీయాలు చేయడమే రాష్ట్రాన్ని ముందుకు పోనీయకుండా ఆపేస్తోంది. ఈ విషయం పాలకులకు తెలిసినా ఎన్నికల్లో గెలవడం తప్ప రాష్ట్రాభివృద్ధి గురించి మనకెందుకు అనే ఆలోచనలతోనే సమాజాన్ని వివిధ వర్గాలుగా విభజించి రాజకీయ క్రీడలు ఆడుతున్నారు. 

ఆత్మగౌరవాన్ని నిలుపుకుందాం

తెలంగాణ స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని బానిస ఆలోచనల నుంచి బయటకు రావాల్సిన తక్షణావసరం ఉంది. నినాదాలకే పరిమితమైన బంగారు తెలంగాణ మనకు అవసరం లేదు. కుల, మత, జాతి, ఆర్థిక అసమానతల్లేని ‘సామాజిక తెలంగాణ’ సాధనే మన లక్ష్యం కావాలి. అప్పుడే మనం స్వప్నిస్తున్న బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది. ఇందుకోసం మన తెలంగాణ స్వాతంత్ర్య వజ్రోత్సవాలే వేదిక కావాలి. మన ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటూ తెలంగాణ, తద్వారా భారతదేశ అభివృద్ధిలో మనమంతా భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను.

- టీ. కృష్ణ ప్రసాద్,  మాజీ డీజీపీ, బీజేపీ లీడర్