జగిత్యాల, వెలుగు: కోట్లాది మంది పూజించే అయ్యప్పను కించపరిచేలా మాట్లాడినవారిని దేశద్రోహులుగా పరిగణించాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో కరీంనగర్-– జగిత్యాల రోడ్డుపై అయ్యప్ప దీక్షపరుల రాస్తారోకోకు ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ అయ్యప్పపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మల్లాపూర్: బైరి నరేశ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌చేస్తూ విశ్వహిందూ పరిషత్ , బజరంగ్ దళ్ లీడర్లు మల్లాపూర్ఎస్ఐ నవీన్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు.కార్యక్రమంలో సభ్యులు నాగేశ్ , జైపాల్, నరేశ్, లక్ష్మణ్ పాల్గొన్నారు. మండలకేంద్రంలోని భారతమాత విగ్రహం వద్ద అయ్యప్ప దీక్షదారులు బైఠాయించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సంగెం శ్రీరాంపూర్ సర్పంచ్ దిలీప్ , టీఆర్ఎస్ నాయకులు ప్రేమ్, లింగుస్వామి, రమేశ్ రెడ్డి, దీక్షాధారులు పాల్గొన్నారు.
ముస్తాబాద్ బంద్ సంపూర్ణం
ముస్తాబాద్: హిందూ సంఘాలు, అయ్యప్ప సేవా సమితి సభ్యులు పిలుపునిచ్చిన ఒక్కరోజు బంద్ ముస్తాబాద్‌లో సక్సెస్అయింది. మండల కేంద్రంలో వ్యాపారులు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ బంద్ నిర్వహించారు . బీజేపీ నాయకులు తాండ్ర రాంగోపాల్, అయ్యప్ప సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు .
వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
వేములవాడ, వెలుగు: అయ్యప్ప పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వేములవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి కిషోర్రావు, మల్లికార్జున్, మహేశ్ పాల్గొన్నారు. సుల్తానాబాద్, వెలుగు: బైరి నరేశ్‌పై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేస్తూ సుల్తానాబాద్ లో శనివారం అయ్యప్ప దీక్షదారులు రాస్తారోకో నిర్వహించారు. రాజీవ్ రహదారిపై అయ్యప్ప స్వాములు, భక్తులు ఆందోళన చేయడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.
వేములవాడలో బీజేపీ కౌన్సిలర్ల ఆందోళన
వేములవాడ, వెలుగు: వేములవాడలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉండగా, ప్రజల బాగోగులు పక్కనబెట్టి మున్సిపల్ ఆఫీసులో బిల్లుల ఆమోదం కోసమే జనరల్ బాడీ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారని బీజేపీ కౌన్సిలర్, పట్టణ అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు ఫైర్ అయ్యారు. శనివారం మున్సిపల్ ఆఫీసులో చైర్పర్సన్ అధ్యక్షతన కౌన్సిలర్ల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మున్సిపల్‌ఆఫీసు ఎదుట బీజేపీ కౌన్సిలర్లు ఆందోళన చేశారు. పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై కౌన్సిల్లో మాట్లాడడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో రామతీర్థపు కృష్ణవేణి. అన్నారం ఉమరాణి, హరిష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
షాట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేట గ్రామంలో విద్యుత్ షాట్‌సర్క్యూట్‌తో ఓ ఇల్లు దగ్ధమైంది. కరెంట్తీగలలో మంటలు చెలరేగి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు కాలిపోయాయి. సుమారు 1.50 లక్షల నగదు మంటల్లో కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పింది.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలవి మోసపు దీక్షలు
గోదావరిఖని, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతోనే బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణి పాల్గొనలేదని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మోసపూరిత దీక్షలు చేస్తున్నారని, దీనిని కార్మికులు నమ్మవద్దని బీఎంఎస్ అనుబంధ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య తెలిపారు. శనివారం గోదావరిఖనిలోని యూనియన్ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఒంటెద్దు పోకడలతో సింగరేణికి ముప్పు ఏర్పడిందని, సంస్థకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.వేల కోట్లు ఇవ్వడం లేదన్నారు. ఎంఎండీఆర్ ‒ 2015 చట్టానికి పార్లమెంట్‌లో మద్దతు తెలిపిన బీఆర్‌ఎస్ ఎంపీలు నేడు కమర్షియల్ మైనింగ్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మీటింగ్‌లో లీడర్లు ఆకుల హరిణ్, సతీశ్, వెంకటస్వామి, స్వామి, సాంబయ్య, రాజేశం, నారాయణ పాల్గొన్నారు.
చౌలమద్ది బ్రిడ్జి పూర్తి చేయకుంటే..ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తాం
మెట్ పల్లి, వెలుగు: మెట్‌పల్లి మండలం చౌలమద్ది గ్రామంలోని అసంపూర్తి బ్రిడ్జి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని లేకపోతే ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంటిని ముట్టడిస్తామని టీపీసీసీ నేత జువ్వాడి కృష్ణారావు హెచ్చరించారు. శనివారం చౌలమద్ది బ్రిడ్జి వద్ద గ్రామస్థులతో కలిసి బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 8 ఏండ్లు కావస్తున్నా ఇప్పటికీ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంపూర్తి బ్రిడ్జితో రైతులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. కార్యక్రమంలో కె.లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి, రాజు, గ్రామస్థులు చిన్నరాజన్న, రాజేందర్, గంగారెడ్డి, రాజశేఖర్, రమేశ్, లక్ష్మీనారాయణ, రాజాం, మారుతి పాల్గొన్నారు.