భద్రాచలం మన్యంలోని ఆంధ్రా విలీన కూనవరం మండలం రామచంద్రాపురం గొత్తికోయ గిరిజన గ్రామంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఫుడ్ ఫెస్ట్ ఆలోచింపజేసింది. అడవిలో సహజసిద్ధంగా సీజన్ల వారీగా దొరికే ఆహారపదార్ధాలను సేకరించి వాటిని ఈ ఫెస్ట్ లో ప్రదర్శించారు.
వాటిని వండి తోటి ఆదివాసీలకు పంపిణీ చేశారు. ముందుగా సేకరించిన 51 రకాల ఆహారపదార్థాలకు గ్రామ పటేల్ కుంజం భీమయ్య, గ్రామపెద్ద సోడి జోగయ్య తమ కులదేవతలకు నైవేద్యంగా పెట్టి పూజలు చేశారు. తాము సేకరించిన ఆహార పదార్థాలను ఆకులతో తయారు చేసిన దొప్పల్లో పెట్టి ప్రదర్శనగా ఉంచారు.
కొంత కాలంగా మన్యంలో జనవికాస్ సొసైటీ అనే సంస్థ ఆదివాసీలను చైతన్య పరిచి అడవుల్లో అనాదిగా వారు సేకరించే ఆహారపదార్థాలను గుర్తిస్తోంది. వారిని చైతన్య పరుస్తోంది. దానిలో భాగంగానే ఆదివాసీలు ఈ ఫుడ్ ఫెస్ట్ ను నిర్వహించారు. ఇకపై జనవరి 20, 21న ప్రతిఏటా ఈ పండుగ చేయాలని ఊరి పెద్దలందరూ తీర్మానించారు. ఆదివాసీ మహిళలు సంప్రదాయ రేలా నృత్యాలు ఆకట్టుకున్నాయి. - భద్రాచలం, వెలుగు