ఇక్కడ.. బతికేదెట్ల?

ఇక్కడ.. బతికేదెట్ల?
  •     చిమ్మ చీకట్లోనే  వెయ్యి  కుటుంబాల నివాసం 
  •     ఆదిలాబాద్ టౌన్ నడి మధ్యన విష పురుగుల మధ్యే జీవనం
  •     ఏళ్లుగా పోరాటం... నిత్యం నిరసనల బాట 
  •     ఎవరికీ పట్టని కొమరం భీమ్ కాలనీ వాసుల అవస్థలు
  •     ప్రభుత్వాలు మారినా వీరి బతుకులు మారట్లేదు

 ఆదిలాబాద్, వెలుగు : జిల్లా కేంద్రంలోని  కొమరం భీమ్ కాలనీ  ఆదివాసులు చిమ్మ చీకట్లోనే బతుకులు వెళ్లదీస్తున్నారు. నాలుగేండ్లుగా కనీస సౌలతులు కూడా లేక బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు.  గోండు, కోలాం, ఇతర తెగలకు చెందిన ఆదివాసులు బతుకుదెరువు కోసం వచ్చి కూలీ పని చేసుకుంటున్నారు. ఉండేది టౌన్ లోనైనా అధికారిక గుర్తింపు లేకపోవడంతో  సర్కార్ నుంచి ఎలాంటి సౌలతులు అందడం లేదు. ముఖ్యంగా కరెంట్ లేకపోవడంతో  రాత్రిపూట పాములు, తేళ్లు, విష పురుగులు ఇండ్లలోకి వస్తున్నాయని ఆవేదనతో చెప్తున్నారు. వానాకాలంలో పరిస్థితి అధ్వానంగా ఉంటుం ది. కరెంటు ఉండదు.  మరోవైపు పిల్లలకు విద్య, వైద్యం లేదు. ఏండ్లుగా ఆందోళనలు చేస్తుండగా.. హామీలు ఇస్తున్నారే తప్ప.. ఆ తర్వాత పట్టించుకోవట్లేదని ఆదివాసులు వాపోతున్నారు. 

ఏండ్లుగా పోరాటాలు..

మావల శివారు లోని సర్వే నం. 72లో 22 ఎకరాల్లోని ఖాళీ స్థలంలో నాలుగేండ్ల కింద గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు.  కొమరం భీమ్ కాలనీ వాసులు తమ సమస్యలపై ఏండ్లుగా ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారు. అయినా  ఏ ప్రభుత్వమూ పట్టించుకోవట్లేదు. 2023లో హైదరాబాద్ లో సైతం ధర్నా చేశారు. ఆదివాసులులు వందలాదిగా  పిల్లాపాపలతో కలిసి  ప్రగతి భవన్ కు పాదయాత్ర చేస్తే.. ఆర్మూర్ వద్ద అప్పటి బీఆర్ఎస్ సర్కార్ అరెస్టులు చేసింది. గురువారం కూడా ఇండ్ల పట్టాలు, కరెంట్, విద్య, వైద్యం కల్పించాలని, పక్కా ఇండ్లు ఇవ్వాలని కోరు తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట కరెంటు బల్బులు, విద్యుత్ లైన్ల మాదిరిగా చేతిలో పట్టుకొని నిరసన తెలిపారు. ఇకనైనా కాంగ్రెస్ సర్కార్  స్పందించి ఇంటి స్థలాలు, అన్ని సౌలతులు  కల్పించాలని ఆదివాసులు కోరుతున్నారు.

 మా గోస ఎవరికీ పట్టట్లే..

నాలుగేండ్లుగా చిన్న పిల్లలతో చీకట్లోనే పడి ఉంటున్నం. కరెంట్ లేక పాములు, తేళ్లు ఇండ్లలోకి వస్తున్నయి. ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందోనని భయపడుతూ గడుపుతున్నం. రాత్రిళ్లు చిన్నపిల్లలు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నరు.  మా గోస తెలియాలని హైదరాబాద్ కు కూడా పోయివచ్చినం.  సర్కార్ పట్టించుకోవట్లేదు.  నీళ్లు లేవు. రోడ్లు లేవు.. ఇగ మేం ఎట్ల బతకాలే.   

ALSO READ : అంబానీ, అదానీ కోసమే బీజేపీ పని చేస్తున్నది

– బలరాం, కొమరం భీమ్ కాలనీ-

 ముఖ్యమంత్రి అయినా న్యాయం చేయాలె

కొమరం భీమ్ కాలనీలోని ఆదివాసుల కోసం ఏండ్లుగా పోరాటం చేస్తున్నం.  బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదు.   హైదరాబాద్ వెళ్లి ధర్నాలు చేసినా న్యాయం చేయలేదు. కాంగ్రెస్ సర్కారైనా స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇండ్ల ను ఇవ్వాలి. కరెంట్, విద్య, వైద్య సేవలు కల్పించాలి. ఆదివాసులు అడవిని వదిలి పిల్లల చదువులు, భవిష్యత్ కోసం పట్టణాలకు వెళ్లి కూలి పనులు చేసి బతుకుతున్నరు. 

భూముల విలువలు పెరగడంతో కొమరం భీమ్ కాలనీపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ, అధికారుల కన్నుపడింది.  నకిలీ పట్టాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నరు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి న్యాయం చేయాలి.  

– గొడం గణేశ్, తుడుం దెబ్బ,  రాష్ట్ర కో కన్వీనర్-