= రద్దు చేస్తున్నట్టు గవర్నర్ తో చెప్పించే ఇక్కడికి రావాలి
= ఐక్యకార్యాచరణ కమిటీ సమావేశంలో రైతుల తీర్మానం
= ఎస్టీ జాబితాలో చేర్చాలని మరో వైపు లబాన్ లంబాడీల లొల్లి
=1,016 నామినేషన్లు వేస్తామంటున్న ఆ సామాజికవర్గం హెచ్చరిక
హైదరాబాద్/ కామారెడ్డి: సీఎం కేసీఆర్ పోటీ చేయనున్న కామారెడ్డిలో పొలిటికల్ సీన్ మారిపోతోంది. మాస్టర్ ప్లాన్ కోసం ఉధృతంగా ఉద్యమించిన రైతులు కేసీఆర్ పై పోటీకి సిద్దమవుతున్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేసినట్టు గవర్నర్ తో చెప్పించాలని, ఆ తర్వాతే కామారెడ్డికి రావాలని మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు తమను ఎస్టీ జాబితా నుంచి తొలగించడంపై లబాన్ లంబాడీలు ఆగ్రహంతో ఉన్నారు. ఎస్టీ జాబితా నుంచి తొలగించడం వల్ల తాము పోడు వ్యవసాయం చేసుకుంటున్న భూములు వదులు కోవాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. తమను తిరిగి ఎస్టీ జాబితాలో చేర్చుతున్నట్టు ప్రకటించాలని ఆ సామాజికవర్గం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
డెడ్ లైన్ దాటి పోవడంతో 1016 మంది అభ్యర్థులతో సీఎం కేసీఆర్ పై నామినేషన్ వేయిస్తామని లబాన్ లంబాడీల జేఏసీ నేత తాన్ సింగ్ ప్రకటించారు. ఈ మేరకు మండలాల వారీగా పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితానూ ప్రకటించారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పరిధిలోని తొమ్మిది గ్రామాలకు చెందిన రైతులు ఇవాళ లింగాపూర్ లో సమావేశమయ్యారు. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేసినట్టుగా గవర్నర్ తో చెప్పించాలని రైతులు డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ పరిధిలోని 9 గ్రామాలకు చెందిన రైతులు సీఎం కేసీఆర్ పై పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి గ్రామం నుంచి 15 నామినేషన్లు వేయాలని తీర్మానించుకున్నారు.
కనీసం వంద నామినేషన్లు దాఖలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని జనవరిలో మున్సిపల్ కౌన్సిల్ తీర్మానించింది. దీనిని నిరసిస్తూ పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలు నిర్వహించారు.
మాస్టర్ ప్లాన్ పేరుతో తమ భూములను ప్రభుత్వం తీసుకోవడంపై బాధితులు కన్నెర్ర చేశారు. కలెక్టరేట్ వద్ద భారీ సంఖ్యలో బైఠాయించారు. హైకోర్టులో కేసు వేశారు. ఆందోళనలు నిర్వహించిన సమయంలో విపక్ష పార్టీల నేతలు బాధిత రైతులకు మద్దతు ప్రకటించారు. కామారెడ్డి నుంచి ఈ సారి సీఎం కేసీఆర్ బరిలోకి దిగనున్నారు. దీంతో తమ డిమాండ్ పై సీఎం నుంచి హామీ పొందేందుకు వీలుగా మాస్టర్ ప్లాన్ పరిధిలోని రైతులు నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. కామారెడ్డిలో పని ఉందని, అందుకే అక్కడికి వెళ్తున్నానని కేసీఆర్ అన్నారని, ఆయనకు ఇక్కడ ఏం పనో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. తమను మభ్యపెట్టే మాటలు కాకుండా మాస్టర్ ప్లాన్ రద్దు చేయిస్తున్నట్టు గవర్నర్ తో చెప్పించాకే నియోజకవర్గంలోకి రావాలని వారు డిమాండ్ చేశారు.
2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పసుపు రైతులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. తమ డిమాండ్ ను దేశ వ్యాప్తంగా తెలియజెప్పే ఉద్దేశంతో పసుపు రైతులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాంటి సీనే మళ్లీ ఇక్కడా రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.