
సిద్దిపేట, వెలుగు : ఓడినా, గెలిచినా ప్రజల పక్షాన పోరాడేది బీఆర్‌ఎస్ మాత్రమేనని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు చెప్పారు. సిద్దిపేట నుంచి వరంగల్ సభ వరకు వెయ్యి మంది విద్యార్థులు, యువకులతో నిర్వహిస్తున్న పాదయాత్రను శుక్రవారం రంగదాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద హరీశ్‌రావు ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్, రేవంత్ చేస్తున్న అరాచకాలను ఎదిరించేందుకు గులాబీ దండు కదిలిందన్నారు. కాంగ్రెస్ 420 హామీలు, మోసపూరిత వాగ్ధానాలతో గద్దెనెక్కిందన్న విషయం ప్రజలకు అర్థమైందన్నారు.
ఈ పాదయాత్ర కాంగ్రెస్‌కు చెంపపెట్టు కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు అవినాభావ సంబంధం ఉందన్నారు. ఈ పాదయాత్ర బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి విజయయాత్రగా కాబోతుందన్నారు. అంతకుముందు అమర వీరుల స్తూపం వద్ద నివాళులర్పించి, పెహల్గాంలో ఉగ్ర దాడిలో చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు.
వడ్ల కొనుగోలులో నిర్లక్ష్యం
వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీమంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. నంగునూర్ మండలం పాలమాకుల గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సందర్శించి, రైతులకు కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు దళారులకు అమ్ముకోవాల్సి వస్తోందని, అకాల వర్షాలు, వడగండ్ల వానల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వడగండ్ల వానల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు పాలమాకుల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.